Horror Comedy Series : టూరిజం పేరుతో కొత్త ప్లేస్ లలో పర్యటించడం చాలా మందికి ఇష్టం. కానీ ఆ ఇష్టమే డేంజరస్ గా మారితే… ఎక్కడికైనా వెళ్ళాక తిరిగి వచ్చే ఛాన్స్ లేకపోతే… అక్కడి నుంచి బయట పడాలంటే ప్రాణాలు పోయేలా ఉంటే… ఊహించడానికే భయంకరంగా ఉన్న ఇలాంటి స్టోరీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ సినిమా పేరు ‘విడోస్ బే’ (Widow’s Bay).
2026 ఏప్రిల్‌లో Apple TV+ లో విడుదలైన ఒక అమెరికన్ హారర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘విడోస్ బే’. కేటీ డిప్పోల్డ్ సృష్టించిన ఈ సిరీస్‌ను ప్రసిద్ధ దర్శకుడు హిరో మురాయ్ డైరెక్ట్ చేశారు. ఒక శతాబ్దాల నాటి ప్రాచీన శాపం ఉన్న ద్వీపంలో, భయంకరమైన వాతావరణం, నవ్వులు పూయించే కామెడీ మిక్స తో ఈ సిరీస్ సాగుతుంది.
విడోస్ బే అనే ద్వీపానికి మేయర్ టామ్ లాఫ్టిస్ (మాథ్యూ రైస్). భార్యను కోల్పోయిన ఆయన తన పట్టణాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని తపన పడుతుంటాడు. మేయర్ టామ్‌కు అసిస్టెంట్ ప్యాట్రిసియా (కేట్ ఓఫ్లిన్). మేయర్ టామ్ టీనేజ్ కొడుకు ఇవాన్. ఇక స్టోరీలోకి వెళ్తే… న్యూ ఇంగ్లాండ్ తీరానికి దూరంగా ‘విడోస్ బే’ అనే ఒక చిన్న ద్వీపం ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ గానీ, సరిగ్గా సెల్ ఫోన్ సిగ్నల్ గానీ ఉండవు. ఆ ద్వీపానికి మేయర్ గా ఉన్న టామ్ లాఫ్టిస్, ఆ ప్రాంతాన్ని మార్తాస్ విన్యార్డ్ లాంటి ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాలని, తద్వారా స్థానిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు.
ఆ ద్వీపంలో నివసించే స్థానికులకు మూఢనమ్మకాలు ఎక్కువ. ఆ ద్వీపానికి కొన్ని వందల ఏళ్ల నాటి భయంకరమైన ప్రాచీన శాపం ఉందని, ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఆ శాపం యాక్టివేట్ అయి వింత జీవులు, తుఫానులు, మాయం కావడాలు జరుగుతాయని నమ్ముతారు. అయితే సైంటిఫిక్ మైండ్ కలిగిన మేయర్ టామ్ మాత్రం ఇవన్నీ అపోహలని కొట్టిపారేస్తూ ఉంటాడు. తన టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేయడానికి న్యూయార్క్ నుండి ఒక ప్రముఖ ట్రావెల్ రైటర్ ని ద్వీపానికి ఆహ్వానిస్తాడు.
ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. సరిగ్గా అతను వచ్చే సమయానికి ద్వీపంలో దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. అంతేనా కరెంట్ పూర్తిగా పోతుంది. అదే సమయంలో ఫెర్రీ బోటుపై ఉన్న ఒక స్థానికుడు మాయమవుతాడు. స్థానికులు భయపడుతున్నట్లే ఆ పాత కథలు, శాపాలు నిజం కావడంతో అందరూ బిక్కుబిక్కుమంటారు. మరోవైపు పర్యాటకులు రాకుండా ఉండటానికి ఆ ద్వీపంలోని దెయ్యాల హోటల్ గురించి ప్రచారం సాగుతుంది. అది అబద్ధమని నిరూపించడానికి మేయర్ టామ్ స్వయంగా ఆ హోటల్‌లో ఒంటరిగా ఒక రాత్రి గడపడానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఎదురైన భయానక అనుభవాలు, అతడి ప్రాణాల మీదకు తెస్తాయి. మరి అతని ప్రాణాలు పోయేలా అక్కడ ఏం జరిగింది ? అసలు ఆ శాపం వెనుక ఉన్న రహస్యం ఏంటి ? చివరికి ఆ శాపం ఎలా ఎండ్ అయ్యింది ? అన్నది కథ.
Read Also : పెళ్లి పీటలెక్కడానికి ముందే పెను విషాదం… తెలుగులోనే స్ట్రీమింగ్