Horror Mystery Movie: హారర్ అండ్ మిస్టరీ సినిమాలకు వరల్డ్ వైడ్‌గా ఉండే ఫ్యాన్ బేస్ వేరు. అందులోనూ కేవలం దయ్యాలు మాత్రమే కాకుండా, సైకలాజికల్ ట్విస్టులు, మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. హాలోవీన్ స్పెషల్ గా హారర్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘షడర్’ (Shudder)లో రిలీజ్ అయిన లేటెస్ట్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ మూవీ ‘హంటింగ్ మాథ్యూ నికోల్స్’ (Hunting Matthew Nichols). 20 ఏళ్ల నాటి ఒక మిస్టరీ కేసును తవ్వుతూ వెళ్తే బయటపడే భయంకరమైన నిజాలు ఏంటి ? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా హారర్ లవర్స్‌ని భయపెడుతోంది. మరి మీరు కూడా భయపడాలి అనుకుంటే దీన్ని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.
టారా నికోల్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ జీవితంలో తన సోదరుడు మాథ్యూ నికోల్స్ అదృశ్యం ఒక తీరని ప్రశ్నగా మిగిలిపోతుంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం మాథ్యూ, అతని స్నేహితుడు కనిపించకుండా పోతారు. వాళ్లకు అసలు ఏం జరిగింది ? ఎక్కడికి వెళ్లారు ? వారి అదృశ్యం వెనుక ఏదైనా కారణం ఉందా ? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరకవు. ఏళ్లు గడిచినా తన సోదరుడి అదృశ్యాన్ని మర్చిపోలేని టారా, ఈ కేసును మళ్లీ ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతుంది. తన దగ్గరున్న సమాచారం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందిస్తూ, మాథ్యూ మిస్సింగ్ కేసులో అసలు నిజాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెతో పాటు ఓ టీమ్ కూడా ఈ అన్వేషణలో భాగమవుతుంది. అయితే అనుకోకుండా బయటపడిన ఓ కీలక ఆధారం ఈ కేసుపై ఉన్న అనుమానాలను మరింత పెంచుతుంది.
మాథ్యూ ఇంకా బతికే ఉండవచ్చనే ఆలోచన టారాలో కొత్త ఆశను కలిగిస్తుంది. ఆ ఆధారం నిజంగా ఏం చెబుతోంది ? మాథ్యూ, అతని స్నేహితుడు కనిపించకుండా పోయిన రోజు ఏం జరిగింది ? వాళ్ల అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు టారాను ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కథ క్రమంగా భయానక మలుపులు తీసుకుంటుంది. మిస్సింగ్ కేసుగా మొదలైన అన్వేషణ వెనుక దాగున్న రహస్యాలను తెలుసుకోవాలంటే సినిమా చివరి వరకు చూడాల్సిందే.
‘హంటింగ్ మాథ్యూ నికోల్స్’ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ మూవీ. అక్టోబర్ 31 నుంచి షడర్ (Shudder)లో స్ట్రీమింగ్కు వచ్చింది. సినిమా సుమారు 89 నిమిషాలు ఉంటుంది. దర్శకుడు మార్కియన్ తరాసియుక్ (Markian Tarasiuk) ఈ చిత్రాన్ని ఫౌండ్-ఫుటేజ్, మాక్ డాక్యుమెంటరీ శైలిలో రూపొందించారు. అంటే జరిగిన సంఘటనలను కెమెరాలో రికార్డ్ చేసిన దృశ్యాల్లా చూపిస్తూ కథకు సహజత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మిరాండా మాక్డగల్ (Miranda MacDougall) టారా నికోల్స్ పాత్రలో నటించగా, మార్కియన్ తరాసియుక్, ర్యాన్ అలెగ్జాండర్ మెక్‌డొనాల్డ్ (Ryan Alexander McDonald), క్రిస్టీన్ విల్స్ (Christine Willes) తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా నిజమైన ఘటన ఆధారంగా రూపొందింది కాదు. కల్పిత కథనే నిజమైన కేసు విచారణలా చూపించడం దీని ప్రత్యేకత.