Horror Series on OTT : 1980లలో అమెరికాను వణికించిన ‘సాటానిక్ పానిక్’ నేపథ్యంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘హిస్టీరియా’ (Hysteria). పబ్లిసిటీ కోసం తాము సాతాను ఆరాధకులమని నటించిన ముగ్గురు టీనేజర్ల జీవితాలు ఎలా నరకంగా మారాయి ? అసలు హత్యల వెనుక నిజంగా దెయ్యాల శక్తులున్నాయా ? లేక మనుషులే ఆ భయాన్ని ఆయుధంగా మార్చుకున్నారా ? అనే ఉత్కంఠభరితమైన కథతో ఈ సిరీస్ సాగుతుంది. మరి ఈ భయంకరమైన రియల్ హర్రర్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
1980ల చివరలో అమెరికాలోని ‘హ్యాపీ హాలో’ అనే చిన్న పట్టణంలో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో అందరికీ ఎంతో ఇష్టమైన హైస్కూల్ ఫుట్‌బాల్ స్టార్ ఒకరోజు హఠాత్తుగా అదృశ్యమవుతాడు. దీంతో ఊరంతా భయాందోళనలకు గురవుతుంది. అప్పటికే అమెరికాలో ‘సాతాను ఆరాధకులు నరబలులు ఇస్తున్నారు’ అనే వదంతులు విస్తృతంగా వ్యాపించి ఉండటంతో, ఈ ఘటన కూడా అలాంటి కల్ట్ పని అనే ప్రచారం మొదలవుతుంది.
ఇదే సమయంలో డైలాన్, జోర్డి, స్పుడ్ అనే ముగ్గురు టీనేజర్లు తమ ‘డెత్‌క్రంచ్’ అనే హెవీ మెటల్ బ్యాండ్‌కు గుర్తింపు తీసుకురావాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం తాము కూడా సాతాను ఆరాధకులమని, రహస్య కల్ట్ సభ్యులమని నమ్మించేలా నల్లటి దుస్తులు, వింత గుర్తులు, భయపెట్టే ప్రచారం చేస్తారు. వారి ప్లాన్ మొదట అద్భుతంగా పని చేస్తుంది. ఒక్కసారిగా ఊరంతా వారి గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తుంది. బ్యాండ్‌కు ఊహించని స్థాయిలో క్రేజ్ రావడంతో పాటు డైలాన్ తనకు నచ్చిన అమ్మాయి జుడిత్ దృష్టిని కూడా ఆకర్షిస్తాడు.
కానీ సరదాగా మొదలైన ఈ నాటకం క్రమంగా ప్రమాదకరంగా మారుతుంది. పట్టణంలో వరుసగా విచిత్రమైన హత్యలు, భయంకరమైన సంఘటనలు చోటుచేసుకోవడం మొదలవుతుంది. దీంతో ప్రజలు, పోలీసులు ఈ హత్యలన్నింటికీ డెత్‌క్రంచ్ బ్యాండ్ సభ్యులే కారణమని నమ్మేస్తారు. తమకు ఎలాంటి సంబంధం లేదని ముగ్గురు స్నేహితులు చెప్పినా ఎవరూ వినరు.
ఇదే సమయంలో ట్రేసీ వైట్‌హెడ్ అనే క్రిస్టియన్ యాక్టివిస్ట్ నేతృత్వంలో ఊరివాళ్లు ఒక రకమైన ‘విచ్ హంట్’ ప్రారంభిస్తారు. నిజమైన నేరస్థుడిని వెతకడం మానేసి, మూఢనమ్మకాలతో అమాయక పిల్లలనే శిక్షించేందుకు సిద్ధమవుతారు. మరోవైపు పట్టణంలో జరుగుతున్న సూపర్‌న్యాచురల్ ఘటనలు నిజమా ? లేక ఎవరో ఉద్దేశపూర్వకంగా భయాన్ని సృష్టిస్తున్నారా ? అనే సందేహాలు మరింత పెరుగుతాయి. దీని వెనకున్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరు ? ముగ్గురు టీనేజర్లు తాము నిర్దోషులం అని ఎలా నిరూపించుకున్నారు? అనే అంశాలతో సిరీస్ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.
Also Read : స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్
1980ల అమెరికాలో జరిగిన ‘సాటానిక్ పానిక్’ అనే నిజ జీవిత కథను హారర్ థ్రిల్లర్‌గా ఆసక్తికరంగా చూపించిన సిరీస్ ఇది. భయపెట్టే సన్నివేశాలతో పాటు సమాజంలో వదంతులు ఎంత ప్రమాదకరంగా మారతాయో కూడా ఇందులో చూడవచ్చు. స్ట్రేంజర్ థింగ్స్‌ను గుర్తు చేసే 80ల వాతావరణం, హెవీ మెటల్ సంగీతం, మిస్టరీ, సైకలాజికల్ ట్విస్టులు ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణలు. ‘హిస్టీరియా’ ప్రస్తుతం Jio Hotstar, Airtel Xstream Playలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్ ఒరిజినల్ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం లేదు. హారర్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్‌లతో పాటు 1980ల నాటి డార్క్ వాతావరణం ఇష్టపడేవారి కోసమే ఈ థ్రిల్లర్.