Malayalam Comedy Thriller: కేరళకు పని కోసం వచ్చిన ఓ బెంగాల్ మహిళ. తనకు చెందిన విలువైన వస్తువు కనిపించకుండా పోయిన తర్వాత దాన్ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. కానీ ఆ వెతుకులాటలో ఆమెకు ఎదురయ్యే మనుషులు, వాళ్ల జీవితాలు, వ్యక్తిగత సమస్యలు… చివరికి ఆమె ప్రయాణాన్నే ఊహించని మలుపుల్లోకి తీసుకెళ్తాయి. ఒక్కరి కథలా మొదలై… చాలా మంది జీవితాలతో ముడిపడే ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్ పేరు ‘ఇడి మళ కాట్టు’ (Idi Mazha Kaattu). మరి మలయాళం మూవీ ప్రియులు ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు మొదలైంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
సౌగత పని కోసం కేరళకు వెళ్తుంది బెంగాల్ కు చెందిన వలస మహిళ. కొత్త ప్రాంతం, కొత్త మనుషుల మధ్య జీవితం మొదలు పెట్టిన ఆమెకు ఓ సమస్య ఎదురవుతుంది. తనకు ఎంతో విలువైన ఓ వస్తువు కనిపించకుండా పోతుంది. దాన్ని తిరిగి సంపాదించుకోవాలనే ప్రయత్నంలో సౌగత పలువురు వ్యక్తులను కలుస్తుంది. ఆమె వెతుకులాటలో పరిచయమయ్యే ప్రతి వ్యక్తికీ ఓ కథ ఉంటుంది. బయటకు క్యూజువల్ గా కనిపించే వాళ్ల జీవితాల్లో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ గొడవలు, సామాజిక ఇబ్బందులు దాగి ఉంటాయి.
సౌగతకు సంబంధించిన చిన్న సమస్య క్రమంగా మరికొందరి జీవితాలతో ముడిపడుతుంది. పెరుమాళ్, అజిత్, డేవిడ్ వంటి పాత్రలు కథలోకి రావడంతో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారతాయి. డేవిడ్ గతంలో ఆర్మీలో పని చేసిన వ్యక్తి. శాంతిభద్రతల గురించి మాట్లాడిన కారణంగా అతనిపై తీవ్రవాద ముద్ర పడుతుంది. ఇలా ఒక్కో పాత్ర వెనుక ఉన్న నేపథ్యం బయట పడుతుంటే సినిమా కేవలం వస్తువు కోసం చేసే అన్వేషణలాగా అనిపించదు. వలస కార్మికుల జీవితం, సామాజిక సమస్యలు, వ్యక్తిగత సంఘర్షణలు, మనుషుల మధ్య ఉండే సంబంధాలను కూడా కథలో చూపిస్తారు.
కామెడీ, డ్రామా, థ్రిల్లర్ అంశాలను కలిపి కథను ముందుకు తీసుకెళ్లడంతో సినిమా ఒకే జానర్ కు పరిమితం కాదు. చివరికి సౌగత వెతుకులాట ఎక్కడి వరకు వెళ్తుంది ? ఆమె కోల్పోయిన వస్తువు దొరుకుతుందా ? ఈ ప్రయాణంలో ఆమె కలిసిన మనుషుల జీవితాల్లో అసలు ఏం జరుగుతోంది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
చెంబన్ వినోద్ జోస్ (Chemban Vinod Jose), శ్రీనాథ్ భాసి (Sreenath Bhasi), సుధి కొప్ప (Sudhi Koppa), సెంతిల్ కృష్ణ, శరణ్ జిత్, ప్రియంవద కృష్ణన్, పూజా దేబ్ తదితరులు నటించిన ‘ఇడి మళ కాట్టు’ మూవీకి అంబిలి ఎస్. రంగన్ (Ambili S. Rengan) దర్శకత్వం వహించారు. ఇది మలయాళ కామెడీ, డ్రామా, థ్రిల్లర్. సెప్టెంబర్ 18 నుంచి సైనా ప్లే (Saina Play)లో మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.
Read Also: పగతో రగిలిపోయే గ్యాంగ్‌స్టర్… రాత్రికి రాత్రే ఊరంతా ఊచకోత… మెంటల్ మాస్ రివేంజ్