Kannada Crime Thriller: మైసూర్ వీధుల్లో చిన్న స్థాయి జీవితం గడిపే ఓ యువకుడు… డబ్బు కోసం నేరాల వైపు అడుగు పెట్టి, చివరికి తనకంటూ ఓ క్రైమ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుంది ? ఊహించుకుంటేనే క్రేజీగా ఉంది కదా. మరి అలాంటి యువకుడి జీవితం కుటుంబం, ప్రేమ, రాజకీయాలు, గ్యాంగ్ వార్ లతో ఎలా మారిపోయింది ? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘మ్యాంగో పచ్చ’ (Mango Pachcha) మూవీ. మరి మైసూర్ నేపథ్యంలో సాగే ఈ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే…
ప్రశాంత్ అలియాస్ పచ్చ మైసూరులో సీడీల అద్దె దుకాణం నడుపుతుంటాడు. పెద్దగా ఆశలు లేని సాధారణ జీవితమే అతనిది. తల్లి పద్మ, తమ్ముడు శ్యామ, ప్రేయసి సుజీతో కలిసి జీవిస్తుంటాడు. కానీ పరిస్థితులు అతన్ని క్రమంగా డబ్బు కోసం తప్పుదారి పట్టిస్తాయి. చిన్న చిన్న నేరాలతో మొదలైన అతని క్రైమ్ ప్రయాణం… స్థానికంగా జరిగే అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనేంతగా సాగుతుంది. డబ్బు, పలుకుబడి పెరుగుతున్న కొద్దీ పచ్చకు నేర ప్రపంచంలో పరిచయాలు కూడా పెరుగుతాయి.
ఒకప్పుడు ఇతరులపై ఆధారపడిన వ్యక్తి… కొంతకాలానికి తన మాట వినే వాళ్లను సంపాదించుకుంటాడు. కానీ క్రైమ్ ప్రపంచంలో ఎదగడం అంత సులభం అయినప్పటికీ, అక్కడ నిలదొక్కుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. అతని చుట్టూ ఉన్నవాళ్లలోనే నమ్మకద్రోహం మొదలవుతుంది. కుటుంబాన్ని కాపాడుకోవాలా ? లేక తనకు వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలా ? అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. 2001 నుంచి 2011 మధ్య మైసూరులో జరిగే పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంది.
స్థానిక రాజకీయాలు, గ్యాంగ్ ల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత సంబంధాలు… ఇవన్నీ పచ్చ జీవితాన్ని ఒక్కో మెట్టు మార్చేస్తాయి. ఒక వైపు తన కుటుంబంతో ఉన్న అనుబంధం… మరోవైపు నేర ప్రపంచంలో పెరుగుతున్న అతని స్థాయి… ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే కథకు ప్రధాన బలం. సినిమా నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందినట్లు ప్రచార వివరాల్లో పేర్కొన్నారు. దర్శకుడు వివేక తెరకెక్కించిన ఈ కథలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉంది. మైసూర్ వీధుల్లో మొదలైన ఓ యువకుడి ప్రయాణం… అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సంచిత్ సంజీవ్ (Sanchith Sanjeev), కాజల్ కుందర్ (Kajal Kunder), మయూర్ పటేల్ (Mayur Patel), హంస (Hamsa), జై (Jai) తదితరులు నటించిన ‘మ్యాంగో పచ్చ’కు వివేక దర్శకత్వం వహించారు. చరణ్ రాజ్ సంగీతం అందించారు. ఇది కన్నడ క్రైమ్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. సినిమా కథ మైసూర్ లోని స్థానిక నేర ప్రపంచం, కుటుంబం, రాజకీయాలు, ఆధిపత్య పోరాటం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి గ్యాంగ్ స్టర్ డ్రామాలను చూడాలి అనుకునే వాళ్ళు డోంట్ మిస్. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.