TGPSC Syllabus: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్ మార్పులపై గత కొన్ని రోజులుగా అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఊహాగానాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టతనిచ్చారు. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి సిలబస్ సవరణపై అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు, విచారణలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.
వివిధ పోటీ పరీక్షల సిలబస్‌ను మార్చడం లేదా సవరించడం కోసం కమిషన్ ఎలాంటి ప్రత్యేక సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని స్పష్టతనిచ్చారు. సిలబస్ మారుతోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌లో ఏవైనా భారీ మార్పులు చేయాల్సి వస్తే, అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఒక సంవత్సరం ముందే ముందస్తు సమాచారం అందిస్తామని కమిషన్ హామీ ఇచ్చింది. తద్వారా అభ్యర్థులు కొత్త సిలబస్‌కు అనుగుణంగా సిద్ధమవడానికి తగిన సమయం దొరుకుతుందని వివరించింది.
సిలబస్‌లో ఏవైనా చిన్నపాటి మార్పులు, చేర్పులు ఉంటే గనుక, ఆయా వివరాలను ప్రత్యేకంగా కాకుండా, నేరుగా ఆయా ఉద్యోగాల భర్తీకి జారీ చేసే నియామక నోటిఫికేషన్‌తో పాటే పొందుపరిచి విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
Also read: గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!