OTT Movie : ఇప్పుడు సినీ పరిశ్రమలో చిన్న సినిమా, అయినా పెద్ద సినిమా అయినా, కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయగలిగితే, కొత్త వాళ్ల సినిమా అయినా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందిస్తున్నారు. కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు తన నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇతను నటించి, దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాకి IMDB లో కూడా టాప్ రేటింగ్ ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళితే
ఆహా (aha) లో
ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కళింగ’ (Kalinga). 2024 లో విడుదలైన ఈ సినిమాకి ధ్రువ వాయు దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఇందులో ధ్రువ వాయు, ప్రగ్యా నయన్ ప్రధాన పాత్రలు పోషించగా, ఆడుకలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆహా (aha) ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంది. 120 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDBలో 9.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ తెలంగాణలోని కళింగ అనే గ్రామంలో మొదలవుతుంది. ఇక్కడ గ్రామ సరిహద్దును దాటిన వాళ్ళెవరూ ఇంతవరకూ తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో లింగ (ధ్రువ వాయు) అనే అనాథ యువకుడు పరిచయమవుతాడు. లింగ మద్యం వ్యాపారం చేస్తూ, బాధ్యతారహితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అతను గ్రామంలోని పద్దు అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వీళ్లిద్దరి మధ్య ఒక రకమైన కెమిస్ట్రీ నడుస్తుంటుంది. అయితే లింగ, పద్దు ప్రేమ కథకు అడ్డంకులు ఎదురుపడతాయి. లింగ బాధ్యతారహితంగా ఉండటం, సారా కాస్తుండటంతో అతనికి దూరంగా ఉండమని పద్దును ఆమె తండ్రి హెచ్చరిస్తాడు. ఇక వీళ్ళు మళ్ళీ కలుస్తుండటంతో, లింగ తన ప్రేమను నిరూపించుకోవడానికి, పద్దు తండ్రి అతనికి ఒక షరతు విధిస్తాడు.
గ్రామంలోని గ్రామ పెద్ద పటేల్ నుండి, తమ కుటుంబం తాకట్టులో పెట్టిన భూమి పత్రాలను తిరిగి తీసుకుని రావాలని చెప్తాడు. ఈ భూమి కూడా గ్రామ పొలిమేర అవతల ఒక శాపగ్రస్త ప్రాంతంలో ఉంటుంది. ఈ సమయంలో గ్రామ పెద్ద పటేల్ సోదరుడు బలి కూడా పద్దుపై మొహం చూపిస్తాడు. బలి చాలా దుర్మార్గుడు. అమ్మాయిల పిచ్చితో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసిఉంటాడు. ఈ విషయంలో బలికి, లింగాకి మధ్య ఒక గోడవ కూడా జరుగుతుంది. ఇక లింగ, పద్దును పెళ్లి చేసుకోవడానికి, ఆస్తి పత్రాలను ఆమె తండ్రికి తెచ్చి ఇస్తానని మాట ఇస్తాడు. ఆతరువాత అతను గ్రామ సరిహద్దును దాటి, శాపగ్రస్తమైన భూమిలోకి ప్రవేశిస్తాడు. ఈ భూమిలో ఒక పురాతన అసుర భక్షి అనే భయంకరమైన శక్తిని ఉంటుంది. ఇది గ్రామ సరిహద్దును దాటిన వారిని తిరిగి రానివ్వదు. అక్కడికి వచ్చిన వాళ్ళని భయంకరంగా చంపి తినేస్తుంది. లింగ ఈ ప్రాంతంలో అనేక భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటాడు.
ఈ దశలో ఒక పురాణ కథ కూడా చూపించడం జరుగుతుంది. ఇది ప్రత్యంగిరా మాత, నరసింహ అవతారం కథతో ముడిపడి ఉంటుంది. హిరణ్యకశిపును సంహరించిన నరసింహుడికి, కాలభైరవుడికి మధ్య జరిగిన యుద్ధం ఈ శాపగ్రస్త భూమికి సంబంధించిన రహస్యాన్ని వివరిస్తుంది. ఈ పురాణ నేపథ్యం కళింగ రాజ్యం దాచిన నిధి , అసుర భక్షి శాపంతో ముడిపడి ఉంటుంది. ఇక లింగ తన స్నేహితుడు సహాయంతో ఈ రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ ప్రయాణంలో అతను అనేక ప్రమాదకరమైన సంఘటనలను ఎదుర్కొంటాడు. లింగ ఈ ప్రయాణంలో భూమి పత్రాలను తిరిగి పొందగలిగాడా ? పద్దును గెలుచుకున్నాడా ? అసుర భక్షి నుండి బయటపడగలిగాడా ? ఆ నిధిని సొంతం చేసుకున్నాడా ? అనే ప్రశ్నలకి సమాధానాలు కావాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయి తలలో సూదులు… ఒక్కో సూదికి ఒక్కో దెయ్యం… చేతబడితో చెమటలు పట్టించే హర్రర్ థ్రిల్లర్