Lyle Lyle Crocodile OTT: కొత్త ఇంట్లోకి వెళ్లిన ఓ చిన్నారికి… అక్కడ ఓ మొసలి కనిపిస్తే ? అది కూడా సాధారణ మొసలి కాదు… ఏకంగా పాటలు పాడే మొసలి. మొదట భయపడిన ఆ బాలుడికి అదే మొసలి బెస్ట్ ఫ్రెండ్ గా మారుతుంది. కానీ ఆ వింత స్నేహం బయట పడితే మాత్రం సమస్యలు మొదలవుతాయి. ఓ కుటుంబం జీవితాన్ని మార్చేసిన ఈ సింగింగ్ క్రొకడైల్ కథే ‘లైల్, లైల్, క్రొకడైల్’ (Lyle, Lyle, Crocodile). మరి ఈ ఫ్యామిలీ మ్యూజికల్ కామెడీ మూవీ తెలుగులో అందుబాటులో ఉందా లేదా ? ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే ?
ప్రిమ్ కుటుంబం న్యూయార్క్ సిటీలోని ఓ కొత్త ఇంటికి మారుతుంది. కుటుంబంతో పాటు చిన్నారి జోష్ కూడా కొత్త జీవితం మొదలు పెట్టాల్సి వస్తుంది. కొత్త స్కూల్, కొత్త ఫ్రెండ్స్… అన్నీ అతనికి చిరాగ్గా ఉంటాయి. కొత్త వాతావరణంలో ఒంటరిగా ఫీల్ అవుతున్న జోష్ కు ఓ పెట్ ను పెంచుకోవాలి అని ఉంటుంది. అందుకే వాళ్ళు ఉండే బిల్డింగ్ లోనే కింద అపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి పెంచుకుంటున్న ఓ తెల్ల పిల్లిని చూసి ముచ్చట పడతాడు. కానీ అతను మాత్రం దాన్ని ముట్టుకోనివ్వడు. ఇలాంటి టైమ్ లోనే అనుకోకుండా ఓ వింత స్నేహితుడు దొరుకుతాడు.
ఇంటి అటకపై దాక్కుని ఉన్న లైల్ అనే పెద్ద మొసలిని జోష్ చూస్తాడు. కానీ లైల్ సాధారణ మొసలి కాదు. అతనికి పాటలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… అతను పాటలు కూడా పాడగలడు. మొదట లైల్ ను చూసి భయపడిన జోష్… ఆ తర్వాత అతనితో స్నేహం చేస్తాడు. కొద్దికాలానికే ఆ మొసలి తనకు ఎంత దగ్గరైందో జోష్ కు అర్థమవుతుంది. లైల్ కు స్నానం చేయడం, మంచి సంగీతం వినడం, ప్రత్యేకమైన ఆహారం తినడం అంటే ఇష్టం. జోష్ తో అతని బంధం బలపడుతుండగా… ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులకు కూడా లైల్ గురించి తెలుస్తుంది. మొదట నమ్మలేకపోయినా అతని స్వభావాన్ని చూసి వాళ్లు కూడా దగ్గరవుతారు.
అయితే ఇంటి పక్కన ఉండే మిస్టర్ గ్రంప్స్ మాత్రం లైల్ ఉనికిని అసలు అంగీకరించడు. అతని వల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయని భావిస్తాడు. లైల్ గురించి బయటకు తెలిసే పరిస్థితి రావడంతో ప్రిమ్ కుటుంబం కూడా చిక్కుల్లో పడుతుంది. ఇదే సమయంలో లైల్ యజమాని హెక్టర్ పి. వాలెంటి తిరిగి రంగంలోకి వస్తాడు. లైల్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే అతని ప్రయత్నాలు… ప్రిమ్ కుటుంబాన్ని మరింత విచిత్రమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి. చివరికి లైల్ ను కాపాడుకోవడానికి కుటుంబం మొత్తం ఒక్కటవుతుంది. మనకు ఊహించని చోట కూడా కుటుంబం, స్నేహం దొరుకుతాయనే భావనతో కథ సాగుతుంది. మరి ఇంతకీ లైల్ ను ఎలా కాపాడుకున్నారు ? చివరికి ఏమైంది ? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
జేవియర్ బార్డెమ్, కాన్స్టాన్స్ వూ, విన్స్లో ఫెగ్లీ, స్కూట్ మెక్‌నెరీ, బ్రెట్ గెల్మన్ నటించిన ఈ సినిమాలో లైల్ కు షాన్ మెండెస్ (Shawn Mendes) వాయిస్ ఇచ్చారు. విల్ స్పెక్, జోష్ గోర్డన్ (Josh Gordon) దర్శకత్వం వహించారు. ఇది కామెడీ, ఫ్యామిలీ, మ్యూజికల్ జానర్‌కు చెందిన సినిమా. 2022లో విడుదలైన ఈ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగుతో పాటు 4 భాషల్లో అందుబాటులో ఉంది.