Malayalam Mystery Comedy: ఒక చిన్న పల్లెటూరిలో ఉన్నట్టుండి వింత పుట్టగొడుగులు వాటిని తిన్న తర్వాత ఊరి జనాల ప్రవర్తనలోనే మార్పులు వస్తే? అసలు ఆ మష్రూమ్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇదంతా సైన్సా.. స్థానికంగా ప్రచారంలో ఉన్న ఏదైనా పురాణ గాథ ప్రభావమా? ఈ మిస్టరీకి ప్రేమకథ, కామెడీ కూడా తోడైతే ఎలా ఉంటుందో చూపించే మలయాళ సినిమా Magic Mushrooms.
ఒక చిన్న పల్లెటూరిలో ఎప్పుడూ చూడని కొత్త రకం వింత పుట్టగొడుగులు మొలిస్తే ఏం జరుగుతుంది ? వాటిని తిన్న తర్వాత మనుషుల ప్రవర్తనే మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? అసలు ఆ మష్రూమ్స్‌లో ఏముంది ? వాటి వెనుక ఏదైనా సైన్స్ దాగుందా ? లేక ఆ ప్రాంతంలో తరతరాలుగా ప్రచారంలో ఉన్న జానపద కథలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా ? ఈ మిస్టరీకి తోడు ఓ అందమైన ప్రేమకథ, కాస్త కామెడీ, ఫాంటసీ కలిస్తే అదే ‘Magic Mushrooms’. ఈ మలయాళం కామెడీ ప్లస్ థ్రిల్లర్ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కథ మొత్తం ఇడుక్కి జిల్లాలోని కంజిక్కుళి అనే ప్రశాంతమైన పల్లెటూరు చుట్టూనే సాగుతుంది. అక్కడ అయాన్ తన తండ్రి, నానమ్మతో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే చిన్నతనంలో జరిగిన ఓ ఘటన అతడి స్వభావాన్నే మార్చేస్తుంది. అయాన్ చిన్నప్పుడు అనుకోకుండా ఓ బావిలో పడిపోతాడు. అతడిని కాపాడేందుకు ఊరంతా బావి దగ్గర గుమిగూడుతుంది. ఆ సంఘటన తర్వాత ఎక్కువ మంది ఒకచోట చేరడం, జనాల మధ్య ఉండటం అంటేనే అయాన్ కు భయం మొదలవుతుంది. అందుకే ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు.
అలాంటి అయాన్ జీవితంలోకి ఓ రోజు ఊహించని సమస్య వచ్చి పడుతుంది. కంజిక్కుళిలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని కొన్ని వింత పుట్టగొడుగులు మొలుస్తాయి. మొదట వాటిని చూసి ఊరి జనాలు ఆశ్చర్యపోతారు. కానీ ఆ మష్రూమ్స్ తిన్న తర్వాత కొందరిలో విచిత్రమైన ప్రవర్తన కనిపించడంతో అసలు విషయం ఏంటనే ప్రశ్న మొదలవుతుంది. సాధారణంగా కనిపించే ఆ పుట్టగొడుగులే ఇన్ని మార్పులకు కారణమా ? లేక దీని వెనుక మరేదైనా రహస్యం ఉందా ? అనేది ఎవరికీ అర్థం కాదు.
ఈ వింతలపై ఆసక్తి పెరగడంతో అయాన్ తన స్నేహితులతో కలిసి అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు. వాళ్ల అన్వేషణ ముందుకు సాగుతున్న కొద్దీ మష్రూమ్స్ చుట్టూ ఉన్న స్థానిక నమ్మకాలు, జానపద కథలు, సైన్స్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇదే సమయంలో జానకి అయాన్ జీవితంలోకి వస్తుంది. ఆమెతో పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అతడి వ్యక్తిగత జీవితంలోనూ కొత్త మార్పులు మొదలవుతాయి.
ఒకవైపు ఊరిలో జరుగుతున్న వింత సంఘటనలు… మరోవైపు అయాన్ ప్రేమకథ… మధ్యలో స్నేహితులతో కలిసి చేసే కామెడీ ప్రయత్నాలు… ఇలా సినిమా కథ ముందుకు సాగుతుంది. చివరికి ఈ మష్రూమ్స్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? వాటి ప్రభావంతో గ్రామంలో ఏం జరిగింది ? అయాన్, అతడి స్నేహితులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారు ? అనేదే సినిమా కథ.
నాదిర్షా దర్శకత్వం వహించిన ‘మ్యాజిక్ మష్రూమ్’ మూవీలో విష్ణు ఉణ్ణికృష్ణన్, అక్షయ ఉదయకుమార్, అల్తాఫ్ సలీమ్, అజు వర్గీస్, హరిశ్రీ అశోకన్ తదితరులు నటించారు. కామెడీ, ఫాంటసీ, జానపద అంశాలతో పాటు మిస్టరీని కలిపిన ఈ మలయాళ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా అందుబాటులో లేదు. కొత్త కాన్సెప్ట్‌తో సాగే మిస్టరీ కామెడీలు నచ్చేవాళ్లు ఈ సినిమాను ఓసారి ట్రై చేయొచ్చు.