Korean Thriller : ఓటిటి మూవీ లవర్స్ లో కొరియన్ సినిమాలకు ఉండే ప్రత్యేకమైన క్రేజ్ గురించి సపరేట్ గా చెప్పక్కర్లేదు. కొరియన్ అనే పదం వినిపిస్తే చాలు సిరీస్ అయినా, సినిమా అయినా చూడకుండా వదిలిపెట్టరు. అలాంటి క్రేజీ మూవీ లవర్స్ కోసమే ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ను తీసుకొచ్చాము. ఈ సినిమా పేరు ‘మెమోరీస్ ఆఫ్ మర్డర్’ (Memories of Murder). 2003లో తెరపైకి వచ్చిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రసిద్ధ దర్శకుడు బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించారు. ఆయనే ‘పారాసైట్’ మూవీ డైరెక్టర్ కూడా. దక్షిణ కొరియా చరిత్రలో జరిగిన మొదటి సీరియల్ కిల్లింగ్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇది రియల్ స్టోరీ కావడం విశేషం.
1986లో దక్షిణ కొరియాలోని ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో దారుణమైన సంఘటనలు జరుగుతాయి. ఓ పొలంలో ఓ యువతి ముందుగా శవమై కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. ఈ దారుణమైన ఘటనను మర్చిపోకముందే మరో మర్డర్ చోటు చేసుకుంటుంది. వరుసగా మరికొందరు యువతుల హత్యలు జరుగుతాయి. అయితే కేవలం వర్షం పడే రోజుల్లో ఎరుపు రంగు బట్టలు వేసుకున్న మహిళలని ఆ కిల్లర్ టార్గెట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తిస్తారు.
స్థానిక పోలీస్ అధికారి పార్క్ చాలా పాత పద్ధతుల్లో కేవలం తన ఊహల ఆధారంగా కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. సరైన సాక్షులు లేకపోయినా, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకొని థర్డ్ డిగ్రీ ఉపయోగించి బలవంతంగా నేరాన్ని ఒప్పించాలని ట్రై చేస్తాడు. కేసు తీవ్రతను బట్టి సీయోను నగరం నుంచి సైంటిఫిక్ పద్ధతుల్లో దర్యాప్తు చేసే మరో డిటెక్టివ్ సియో కథలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరి పద్ధతులు వేరువేరు కావడంతో మొదట్లో వీరి మధ్య విభేదాలు వస్తాయి. అయినప్పటికీ కిల్లర్ని పట్టుకోవడానికి ఇద్దరు కలిసి పని మొదలు పెడతారు.
అయితే పోలీసులు ఎంత ట్రై చేసినా కిల్లర్ ఎలాంటి వేలిముద్రలు లేదా సాక్ష్యాలు వదలకుండా చాలా తెలివిగా తప్పించుకో తిరుగుతాడు. వర్షం పడడం వల్ల క్రైమ్ సీన్ లోని ఆధారాలన్ని తుడిచి పెట్టుకుపోతాయి. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా పార్క్ అనే ఒక ఫ్యాక్టరీ కార్మికుడిపై పోలీసులకు అనుమానం బలపడుతుంది. వర్షం పడే రోజుల్లో రేడియోలో ఒక పాటను ప్లే చేయమని అతను పదేపదే రిక్వెస్ట్ పంపుతున్నట్టు కనిపెడతారు. కానీ అతనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలు ఏమీ దొరకవు. ఇక్కడే ఇంటెన్స్ క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది.
ఆ కాలంలో కొరియాలో టెక్నాలజీ లేకపోవడం వల్ల కొన్ని క్లూస్ ను డీఎన్ఏ పరీక్ష కోసం అమెరికాకు పంపుతారు. ఆ రిపోర్ట్ వచ్చేలోగా కిల్లర్ మరో అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేస్తాడు. అమెరికా నుంచి వచ్చిన ఆ రిపోర్టు పోలీసులకు షాక్ ఇస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా అనుమానిస్తున్న పార్క్ అనే వ్యక్తి డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం లేదని ఆ రిపోర్ట్ లో తేలుతుంది. మరి ఆ తర్వాత పోలీసులు ఏం చేశారు ? కిల్లర్ నిజంగానే పార్క్ కాదా ? క్లైమాక్స్ లో వచ్చే ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? చివరికి కేసు ఎలా ఎండ్ అయింది? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిన స్టోరీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : బోయ్ దిమ్మతిరిగే యాక్షన్… బుల్లెట్టు దిగినా బిల్డింగ్ నుంచి దూకినా చావని వింత మనుషులు