Crime Drama Series: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు. ఎంత పెద్ద గ్యాంగ్ స్టర్ అయినా శత్రువులు ఎక్కడో కాదు ఇంట్లోనే ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా ఓ క్రైమ్ ఫ్యామిలీలో బయట శత్రువుల కంటే… ఇంట్లోనే ఉన్నవాళ్లే ప్రమాదకరంగా తయారవుతారు. అధికారం కోసం తండ్రి, కొడుకు మధ్య పోరు మొదలవుతుంది. కుటుంబాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్న ఓ ఫిక్సర్ కు… అన్నివైపుల నుంచి ప్రమాదం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? తెలుసుకోవాలంటే ‘మాబ్ ల్యాండ్ సీజన్ 2’ (MobLand Season 2) పై ఒక లుక్కేయాల్సిందే. మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
హ్యారీ డా సౌజా అనే వ్యక్తి హారిగన్ క్రైమ్ ఫ్యామిలీకి ఫిక్సర్ గా పని చేస్తుంటాడు. అంటే కుటుంబానికి వచ్చే సమస్యలను బయట పడకుండా సెట్ చేయడం అతని పని. కానీ ఈసారి సమస్య బయట నుంచి మాత్రమే కాదు, ఇంట్లో కూడా మొదలవుతుంది. కుటుంబంలోనే అధికారం కోసం పోరు మొదలవుతుంది. కాన్రాడ్ హారిగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు తారుమారు అవుతాయి. అతని కొడుకు కెవిన్ తనకంటూ ఓ పవర్ బేస్ నిర్మించుకోవాలని చూస్తుంటాడు. మరోవైపు కుటుంబంలో మరో కీలక వ్యక్తిగా ఎదుగుతున్న ఎడ్డీ కూడా తన స్థానాన్ని బలపరుచుకోవాలని చూస్తాడు.
ఇలాంటి పరిస్థితుల్లో హ్యారీకి ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకోలేని పరిస్థితి వస్తుంది. కుటుంబం మొత్తం ఒకే వైపు ఉన్నట్లు కనిపించినా… లోపల మాత్రం అనుమానాలు, కుట్రలు, వ్యక్తిగత ప్రయోజనాలు వంటివి పెరుగుతుంటాయి. ప్రతి నిర్ణయం తర్వాత కొత్త సమస్య మొదలవుతుంది. సెరాఫినా కూడా తన భవిష్యత్తు కోసం కొత్త సంబంధాలను వెతుక్కుంటుంది. అమెరికన్ పవర్ బ్రోకర్ కాట్ మెక్‌అలిస్టర్ రంగంలోకి రావడంతో హారిగన్ కుటుంబానికి మరో పెద్ద సవాలు ఎదురవుతుంది.
కుటుంబంలోని అంతర్గత బలహీనతలను ఉపయోగించుకుని అధికారం చేజిక్కించుకోవాలనుకునే వాళ్లు పెరుగుతారు. ఇదే సమయంలో హ్యారీ వ్యక్తిగత జీవితం కూడా ప్రశాంతంగా ఉండదు. భార్య జాన్, కుమార్తె గినాతో ఉన్న సంబంధాల వల్ల కూడా అతనికి సమస్యలు ఎదురవుతాయి. ఒకవైపు కుటుంబం కోసం ప్రాణాలకు తెగించి పని చేయాల్సి రావడం, మరోవైపు తన జీవితాన్ని కూడా కాపాడుకోవాల్సి రావడంతో హ్యారీ పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. మరి ఫ్యామిలీ మధ్య మొదలైన ఈ అధికార పోరు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే సిరీస్ ను డోంట్ మిస్.
టామ్ హార్డీ (Tom Hardy), పియర్స్ బ్రాస్నన్ (Pierce Brosnan), హెలెన్ మిర్రెన్, ప్యాడీ కాన్సిడైన్, మాండీప్ ధిల్లాన్ తదితరులు నటించిన ‘మాబ్ ల్యాండ్ సీజన్ 2’ సెప్టెంబర్ 18న ప్రీమియర్ అయింది. అసలు సిరీస్ పారామౌంట్ ప్లస్ (Paramount+) ఒరిజినల్. ఇండియాలో మాత్రం జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ ఇంగ్షీషులోనే ఉంది.