Mortal Kombat II OTT Release : సినిమాల్లో హీరోగా కనిపిస్తూ ఫైట్లు చేసే ఓ నటుడు… నిజంగానే ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన పరిస్థితి వస్తే… పైగా అతడు ఎదుర్కోవాల్సింది మామూలు విలన్లను కాదు, మరో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఓ క్రూర చక్రవర్తిని. ఇలాంటి కాన్సెప్ట్కి యాక్షన్, ఫాంటసీ, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్‌ను కలిపి రూపొందిన సినిమానే ‘Mortal Kombat II’. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కథ ప్రారంభంలోనే షావో కాన్‌కు ఉన్న క్రూరత్వం ఏంటో చూపిస్తారు. గతంలో ఈడెనియా రాజ్యంపై దాడి చేసిన అతడు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు రాజు జెరోడ్‌ను చంపేస్తాడు. అతడి కుమార్తె కిటానాను మాత్రం తన దగ్గరే ఉంచుకుంటాడు. అయితే కిటానా తన తండ్రిని, తన రాజ్యాన్ని మర్చిపోదు. పరిస్థితులు మారిన తర్వాత షావో కాన్‌కు వ్యతిరేకంగా నిలబడి భూమి యోధులకు సహాయం చేస్తుంది.
ఇక భూమిపై మోర్టల్ కొంబాట్ పోరాటం మరోసారి మొదలయ్యే పరిస్థితి వస్తుంది. రైడెన్, సోన్యా, లియు కాంగ్, జాక్స్ తదితర యోధులు షావో కాన్ సేనలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు. కానీ ఈసారి అవుట్‌వరల్డ్ నుంచి వచ్చే ముప్పు గతం కంటే చాలా పెద్దది. షావో కాన్‌ను ఆపాలంటే మరింత బలమైన యోధుడు అవసరమవుతుంది.
అప్పుడే రైడెన్, సోన్యా దృష్టి జానీ కేజ్‌పై పడుతుంది. సినిమాల్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జానీ కేజ్.. నిజ జీవితంలో మాత్రం తన కెరీర్ కాస్త డౌన్‌లో ఉండటంతో పాత సినిమాల గుర్తులతోనే కాలం గడుపుతుంటాడు. కామిక్ కాన్వెన్షన్లకు వెళ్లి అభిమానులతో ఫొటోలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం అతడి జీవితంలో భాగమైపోతుంది. అలాంటి వ్యక్తిని నిజమైన యుద్ధంలోకి తీసుకురావడం మొదట కాస్త కామెడీగానే అనిపిస్తుంది. కానీ జానీకి కూడా తాను ఎదుర్కొంటున్నది సినిమా షూటింగ్ కాదని, నిజమైన ప్రాణాంతక పోరాటమని అర్థమవుతుంది.
మరోవైపు షావో కాన్ తన శక్తిని మరింత పెంచుకునేందుకు ప్రమాదకరమైన ప్రయత్నాలు చేస్తాడు. క్వాన్ చి, కానో వంటి పాత్రలతో కలిసి భూమి యోధులను దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తాడు. శక్తివంతమైన అమ్యూలెట్ అతడి చేతికి చిక్కిన తర్వాత షావో కాన్‌ను ఎదుర్కోవడం మరింత కష్టంగా మారుతుంది. ఒక్కో యోధుడు ఇబ్బందుల్లో పడుతున్న సమయంలో జానీ కేజ్ కూడా తనలో దాగి ఉన్న అసలైన శక్తిని గుర్తించాల్సి వస్తుంది.
ఇక్కడి నుంచే జానీ కేజ్ పాత్రలో అసలైన మార్పు మొదలవుతుంది. ఇప్పటివరకు తెరపై మాత్రమే హీరోగా కనిపించిన అతడు, నిజమైన యోధుడిగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. కిటానా సహాయం, రైడెన్ నమ్మకం అతడికి ధైర్యాన్ని ఇస్తాయి. చివరికి భూమి భవిష్యత్తును నిర్ణయించే భారీ పోరాటంలో జానీ కేజ్‌తో పాటు మిగిలిన యోధులు కూడా షావో కాన్ సేనలను ఎదుర్కొంటారు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు ? అన్నది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
Also Read : అమెజాన్ అడవుల్లో సీక్రెట్ సిటీ… వెతుక్కుంటూ వెళ్లి రాత్రికి రాత్రే గల్లంతైన సైంటిస్ట్… క్లైమాక్స్ ఊహించలేరు
‘మోర్టల్ కొంబాట్ II’కి సైమన్ మెక్‌క్వాయిడ్ దర్శకత్వం వహించారు. కార్ల్ అర్బన్ జానీ కేజ్‌గా, అడెలైన్ రుడాల్ఫ్ కిటానాగా, జెస్సికా మెక్‌నేమీ సోన్యాగా, లుడి లిన్ లియు కాంగ్‌గా, మెహ్‌కాడ్ బ్రూక్స్ జాక్స్‌గా, జోష్ లాసన్ కానోగా నటించారు. ఈ సినిమా 2026 మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 2021లో వచ్చిన ‘మోర్టల్ కొంబాట్’కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో ఈసారి యాక్షన్ మరింత పెరిగింది. అవుట్‌వరల్డ్ చక్రవర్తి షావో కాన్ తన సామ్రాజ్యాన్ని భూమి వరకు విస్తరించేందుకు సిద్ధమవుతుంటే, అతడిని అడ్డుకోవడానికి రైడెన్ టీమ్ మరోసారి రంగంలోకి దిగుతుంది. ఈ పోరాటంలో హాలీవుడ్ యాక్షన్ స్టార్ జానీ కేజ్ ఎంట్రీ ఇవ్వడం సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. గేమ్‌లో కనిపించే ఫైటింగ్ స్టైల్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫాంటసీ ప్రపంచం కలిసి సినిమాకు మంచి మాస్ టచ్ ఇస్తాయి. ఈ సినిమా ప్రస్తుతం Jio Hotstarలో తెలుగు, ఇంగ్షీషు, హిందీ, తమిళ భాషల్లో ఉంది.