Squid Game : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3 జూన్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇందులో సియోంగ్ గిహున్ (ప్లేయర్ 456, యాక్టర్ లీ జంగ్-జే) కథను ముగించారు. ఈ సీజన్‌లో గిహున్ ఆటను ఆపడానికి తిరిగి రంగంలోకి దిగుతాడు. కానీ ఎన్నో బాధాకరమైన సంఘటనలు, మరణాలతో డెడ్లీ డెత్ గేమ్స్ కంటిన్యూ అయ్యాయి. అంతా బాగానే ఉంది గానీ అసలు ఆ ఎండింగ్ ఏంది సామీ? అనుకున్నారు చాలామంది. క్లైమాక్స్ అలా ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
456 త్యాగం… వై నాట్ హ్యాపీ ఎండింగ్ ?
సీజన్ 2 చివరిలో, గిహున్ నడిపిన తిరుగుబాటు ఫెయిల్ అవుతుంది. సీజన్ 3లో గిహున్ నిరాశలో మునిగిపోతాడు. కానీ జూన్-హీ (ప్లేయర్ 222) శిశువు జననం అతనిలో కొంత ఆశను రేకెత్తిస్తుంది. జూన్-హీ తన గాయం కారణంగా ఆటలో కొనసాగలేక, తన శిశువును గిహున్‌కు అప్పగిస్తుంది. అయితే ఆ పాపను కాపాడతానని అతను చేసిన ప్రామిస్ తనను తాను త్యాగం చేసుకునేలా చేసింది. నిజానికి ఆడియన్స్ అక్కడ హ్యాపీ ఎండింగ్ ను ఎక్స్పెక్ట్ చేశారు. గేమ్ చివర్లో హీరో ఆ పాప తండ్రిని చంపేసి పాపతో కలిసి గేమ్ విన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
చివరి ఆట “స్కై స్క్విడ్ గేమ్”లో గిహున్, జూన్-హీ శిశువు (ప్లేయర్ 222), మ్యూంగ్-గి (జూన్-హీ మాజీ ప్రియుడు, శిశువు తండ్రి) మిగిలారు. ఈ ఆటలో, ఆటగాళ్లు ఎత్తైన రాతి స్తంభాల మీద నడవాలి. అలాగే తమలో ఒకరిని చంపితేనే ముందుకు వెళ్లగలరు. అయితే తండ్రి తన కూతురును చంపడానికి కూడా వెనకాడకపోవడం అన్నది మనుషులలో నరరూప రాక్షసులు ఎలా ఉంటారో చూపించే ప్రయత్నం. అలాగే డబ్బు కోసం కక్కుర్తి పడితే జీవితం నాశనం అవుతుందనే సందేశం ఇచ్చారు మిగతా ప్లేయర్స్ ద్వారా.
ఎలాంటి సంబంధం లేని 456 ఆ పాపను కాపాడడం అన్నది మానవత్వానికి నిదర్శనం. గిహున్ శిశువును రక్షించడానికి, “మేము గుర్రాలు కాదు, మేము మనుషులం” అని చెప్పి ప్రాణా త్యాగం చేస్తాడు. పేద వాళ్ళను ఆట వస్తువులుగా చూసే ధనిక విఐపీలకు మానవత్వ ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ప్రయత్నం అది.
మనుషులు తమదాకా వస్తే ఎంతకైనా తెగిస్తారని, హీరో కూడా అదే చేస్తాడని నిరూపించాలని ఫ్రంట్ మ్యాన్ అనుకుంటాడు. అప్పటికే తాను కూడా అలాగే చేసి ఉండడంతో తనకున్న గిల్ట్ ను ఇలాగైనా పోగొట్టుకోవాలని చూస్తాడు. కానీ హీరో చచ్చి అది తప్పని నిరూపిస్తాడు. హ్వాంగ్ డాంగ్-హ్యూక్ ప్రకారం స్వార్థపూరితంగా ఆలోచించకుండా, భవిష్యత్ తరాల కోసం త్యాగం చేయడం గొప్ప అనేది గిహున్ నిర్ణయం.
పాపే ఎందుకు కీలకం ?
ఇక డిటెక్టివ్, గేమ్స్ ఆడిస్తున్న వారిలో ఒక అమ్మాయి కూడా ఓ పాప తండ్రిని గేమ్స్ నుంచి కాపాడి, చావాలి అనుకుంటుంది. కానీ చివరికి వీళ్ళిద్దరిలోనూ పాప కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది. అలాగే ఇక్కడ పాప కీలకం. సృష్టికర్త హ్వాంగ్ డాంగ్-హ్యూక్ ప్రకారం, ఈ శిశువు భవిష్యత్ తరాన్ని సూచిస్తుంది. అంటే భవిష్యత్ తరాలైనా ఇప్పుడున్న పరిస్థితులను మారుస్తారనే ఆశ అన్నమాట. గిహున్ త్యాగం మానవత్వం, ఆశను ప్రతిబింబిస్తుంది.
ఫ్రంట్ మ్యాన్, విఐపీల ఎస్కేప్
ఫ్రంట్ మ్యాన్ సోదరుడు, డిటెక్టివ్ ద్వీపాన్ని కనుగొన్నా ఫ్రంట్ మ్యాన్‌ను ఏం చేయలేకపోతాడు. ఫ్రంట్ మ్యాన్, విఐపీలు అందరూ సేఫ్ గా అక్కడి నుంచి బయటపడడం, రిచ్ పీపుల్ ఎలాంటి సమస్య నుంచైనా ఈజీగా బయటపడతారు అనడానికి నిదర్శనం.
చివరగా విలన్ అమెరికాలో ఉన్న హీరో కూతురికి డబ్బులున్న కార్డ్ ఇవ్వడం, అలాగే విన్ అయిన పాపకు కూడా గోల్డెన్ కార్డు ఇవ్వడం విలన్ లోనూ మానవత్వం ఉందనే దానికి హింట్.
కేట్ బ్లాంచెట్ కామియో
చివరి సన్నివేశంలో ఫ్రంట్ మ్యాన్ హీరో కూతురికి డబ్బులిచ్చి వెళ్తూ లాస్ ఏంజిల్స్‌లో ఒక మహిళ (కేట్ బ్లాంచెట్) డాక్జీ ఆట ఆడుతూ, కొత్త ఆటగాళ్లను రిక్రూట్ చేస్తున్నట్లు చూస్తాడు. ఇది స్క్విడ్ గేమ్ అమెరికాలో కొనసాగుతోందని సూచిస్తుంది. హ్వాంగ్ డాంగ్-హ్యూక్ ప్రకారం ఈ కామియో ఆటలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
Read Also : పడుకున్న శవాన్ని లేపి మరీ తన్నించుకునే ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హారర్ మూవీ
అన్‌సాల్వడ్ మిస్టరీస్
ఆటల మూలం ఏంటి? ఫ్రంట్ మ్యాన్ పూర్తి గతం, విఐపీలు ఎవరు ? అనే ప్రశ్నలు స్పష్టమైన సమాధానాలు లేకుండా మిగిలిపోయాయి. జూన్-హో దర్యాప్తు కూడా ఫలితం ఇవ్వలేదు. అంటే ఇంకా అలాగే ఆటలు రహస్యంగా కొనసాగుతాయి.