OTT Movie : పెళ్లి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే బ్యాచిలర్ బాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక కాక కాక పెళ్లి సెట్ అయ్యాక, ఆ పిల్ల ఏకంగా పెళ్లికి కొన్ని నిమిషాల ముందు, అది కూడా పెళ్లి పీటల మీద నుంచి జంప్ అయితే ఆ బాధ వర్ణనాతీతం. అదే బాధను ఓటీటీలో ఫన్నీగా చూసే టైమ్ వచ్చేసింది. ఈ వీకెండ్ కు ఓ మంచి మలయాళ మూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఆ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
కథ ఏంటంటే?
కథ స్టెఫీ (అనస్వర రాజన్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక ఎమ్మెల్యే కుమార్తె, పెళ్లికి సిద్ధంగా ఉన్న వధువు. అయితే పెళ్లి రోజున తన ప్రియుడు ఆమెను విడిచి పెట్టి పారిపోవడంతో స్టెఫీ షాక్‌కు గురవుతుంది. ఈ నిరాశలో ఆమె తన పెళ్లి నుండి పారిపోయి, తన ప్రియుడిని వెతకడానికి బస్టాండ్ కు చేరుకుంటుంది. అక్కడ ఆమె జిత్తు (ఇంద్రజిత్ సుకుమారన్) అనే 40 ఏళ్ల సరదా బ్యాచిలర్‌ను కలుస్తుంది. అతను ఆమెకు తన కారులో లిఫ్ట్ ఇస్తాడు.
ఇంకేముంది ఇది ఒక రోడ్ ట్రిప్ గా మారుతుంది. ఇది స్టెఫీ, – జిత్తు జీవితాలను అనూహ్య రీతిలో మార్చేస్తుంది. ఈ ప్రయాణంలో వారు అనేక కామెడీ సంఘటనలు, భావోద్వేగ క్షణాలు, వ్యక్తిగత సంఘర్షణలను ఎదుర్కొంటారు. స్టెఫీ తన ప్రియుడిని వెతకడానికి ప్రయత్నిస్తుండగా, జిత్తు తన స్వేచ్ఛాయుత జీవితంలోని లోటును గుర్తిస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ఒక ప్రత్యేక బంధంగా మారుతుంది. మరి ఆ తరువాత ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎలాంటి సంఘటనలకు దారి తీసింది? స్టెఫీ ప్రియుడు దొరికాడా లేదా? బ్యాచిలర్ బాబు పెళ్లి జరిగిందా? అనేవి తెరపై చూసి తెలుసుకోవలసిన అంశాలు.
Read also : హిల్ స్టేషన్ లో ఇల్లు… చేయకూడని పని చేసి అడ్డంగా బుక్కయ్యే అబ్బాయి… స్పైన్ చిల్లింగ్ కొరియన్ థ్రిల్లర్
స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
ఈ మలయాళ కామెడీ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఈ మూవీ పేరు “మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్” (Mr and Mrs Bachelor). దీపు కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హైలైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాశ్ హైలైన్ నిర్మించారు. మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మనోరమ మాక్స్ (Manorama Max)లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రంలో రాహుల్ మాధవ్, బిజు పప్పన్, సోహన్ సీనులాల్, దయ్యానా హమీద్, రోసిన్ జోలీ, మనోహరి జాయ్, జిబిన్ గోపీనాథ్, లయ సింప్సన్ సహాయక పాత్రల్లో నటించారు.