Crime Drama: ఓ అమ్మాయి తనను ప్రేమిస్తున్న వ్యక్తికి నో చెప్పింది. అంతే… ఆ వ్యక్తి ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోవడంతో ఆమె జీవితం ఒక్కసారిగా భయంతో నిండిపోతుంది. ప్రేమ పేరుతో మొదలైన కథ ఎప్పుడు మోజుగా మారింది ? ప్రేమించిన వాడికి ఒక అమ్మాయి చెప్పిన ‘నో’ తర్వాత ఆమె ఎదుర్కొనే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి ? అనే అంశాల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan) ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
పూజా అనే అమ్మాయి మన హీరోయిన్. ఓ వ్యక్తి ప్రేమ అంటూ ఆమె వెంట పడతాడు. కానీ పూజ మాత్రం అతడి ప్రేమను అంగీకరించదు. ఇలా జరిగినప్పుడు కొంతమంది లైట్ తీసుకుంటారు. మరికొందరు మాత్రం తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని నరకం చూపిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం సదరు ప్రేమికుడు ఆమె నో చెప్పడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో పూజ జీవితం ప్రమాదకరమైన మలుపు తిరుగుతుంది.
మొదట వ్యక్తిగత విషయంలా కనిపించిన ఈ వ్యవహారం క్రమంగా పూజ భద్రతకు సంబంధించిన సమస్యగా మారుతుంది. అందరూ ఆమెనే నిందిస్తారు. తనను ఎవరో గమనిస్తున్నారనే భావన, చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆమెను భయపెడతాయి. అంతేకాదు అతడి చావుకు ఆమె కారణం అంటూ పోలీసులు కూడా పూజను అరెస్ట్ చేస్తారు. ఇక్కడే కథలోకి సనా అనే లాయర్ ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు అనికేత్ పాత్ర కూడా కథలో కీలకంగా మారుతుంది.
పూజ చుట్టూ జరుగుతున్న పరిణామాల్లో అతడి పాత్ర ఏంటి ? అతడికి పూజతో ఉన్న సంబంధం ఎలా మారుతుంది ? అనే అంశాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి. ఈ వ్యవహారంలో సమాజం ఒక మహిళ నిర్ణయాన్ని ఎలా చూస్తుంది ? ఆమె చెప్పిన ‘నో’ను గౌరవించకపోతే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారుతాయి ? అనే అంశాలను కూడా సినిమా టచ్ చేస్తుంది.
మరి పూజను ఇంతలా వెంటాడుతున్న వ్యక్తి ఎవరు ? ఆమెను ఎందుకు వదలడం లేదు ? ఈ ప్రేమ వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశం ఏంటి ? సనా చేసే న్యాయపోరాటం పూజను కాపాడగలదా ? పూజ చెప్పిన నిజమే చివరికి బయటపడుతుందా ? లేక అందరూ నమ్ముతున్న కథకు పూర్తి భిన్నమైన నిజం బయటకు వస్తుందా ? అన్నది తెలుసుకోవాలంటే సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), హుమా ఖురేషి (Huma Qureshi), విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్, చైతన్య వ్యాస్ తదితరులు నటించిన ‘పూజా మేరీ జాన్’కు నవజోత్ గులాటి (Navjot Gulati) దర్శకత్వం వహించారు. ఈ హిందీ క్రైమ్ డ్రామా అక్టోబర్ 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది.
Read Also: ప్రేయసి ప్లేస్ లోకి వచ్చిన రోబోతో డేటింగ్… అది ఏం చేసిందో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే