OTT Movie : రొమాంటిక్ సినిమాలకు అభిమానులు ఎక్కువే. ఇలాంటి సినిమాలు అన్ని భాషల్లో వస్తుంటాయి. వీటిలో గుర్తుండిపోయే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. రవీంద్రనాథ్ టాగోర్ సాహిత్యాన్ని తెరపై అద్భుతంగా చూపించినందుకు, ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఈ చిత్రం గుర్తింపు పొందింది. 58వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ బెంగాలీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డులను గెలుచుకుంది. బెంగాలీ తెలియని వాళ్ళు కూడా ఈ సినిమాను ఆస్వాదిస్తూ మంచి అనుభూతిని పొందుతారు. ఇన్ని విశేషాలున్న ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
రమేష్ అనే ఒక న్యాయవాది, తన తండ్రి కోరిక మేరకు అన్నపూర్ణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. కానీ ఆమెను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అతను కలకత్తా నుండి ఓడలో స్వగ్రామానికి వెళ్తుండగా, కమలా అనే యువతి తన భర్త నిర్మల్ తో కలిసి అదే ఓడలో ప్రయాణిస్తుంది. రాత్రి సమయంలో ఓడ ప్రమాదంలో మునిగిపోతుంది. ఈ గందరగోళంలో రమేష్, కమలాను తన కాబోయే భార్య అన్నపూర్ణగా, కమలా రమేష్‌ను తన భర్త నిర్మల్‌గా తప్పుగా గుర్తిస్తారు. కమలాను రమేష్ తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇద్దరూ ఒకరినొకరు భార్యాభర్తలుగా భావిస్తూ జీవితాన్ని మొదలెడతారు.
కమలా ఈ కొత్త జీవితంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కానీ తన గతం గురించి ఆలోచనలో పడుతుంది. ఇదే సమయంలో నిర్మల్ పడవ ప్రమాదంలో బతికి కమలాను వెతుకుతూ ఉంటాడు. అన్నపూర్ణ రమేష్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ తప్పు బయటపడుతుంది. రమేష్, కమలా ఒకరిపట్ల ఒకరు ఎమోషనల్ బంధం ఏర్పరచుకున్నప్పటికీ, తమ బాధ్యతల కారణంగా నిజమైన జీవిత భాగస్వాముల వైపు తిరిగి వెళతారు. మరి ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుదనేది, ఈ బెంగాలీ సినిమాని చూసి తెలుసుకోండి.
‘నౌకాడుబి’ (Noukadubi) రవీంద్రనాథ్ టాగోర్ నవల ఆధారంగా రీతుపర్ణో ఘోష్ దర్శకత్వంలో తీసిన బెంగాలీ రొమాంటిక్ డ్రామా సినిమా. ఇందులో రైమా సేన్, జిషు సేన్‌గుప్తా, ప్రొసెన్‌జిత్ చటర్జీ, రియా సేన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా బెంగాలీతో పాటు హిందీలో “కశ్మకశ్” పేరుతో కూడా విడుదలై, టాగోర్ సాహిత్యాన్ని అద్భుతంగా తెరపై చూపించింది. ప్రస్తుతం ఈ సినిమా హోయ్‌చోయ్ (Hoichoi), అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. బెంగాలీ వెర్షన్‌తో పాటు, హిందీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
Read Also : వరుస హత్యలు చేస్తూ సిటీని వణికించే మాస్క్ మ్యాన్… నరాలు తెగే ఉత్కంఠ… ఈ సైకో చేసే పనులకు థ్రిల్ పక్కా