Romantic Fantasy Adventure: ఒక కాలంలో ప్రేమలో ఉన్న జంట… ఇంకో కాలంలో చిక్కుకుపోయిన మరో జంట… యుద్ధం, కుటుంబ వ్యతిరేకత, టైమ్ ట్రావెల్ మధ్య వాళ్ల ప్రేమను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందా ? ఒకవైపు 18వ శతాబ్దపు స్కాట్లాండ్ లో యుద్ధం… మరోవైపు గతం, భవిష్యత్తు మధ్య చిక్కుకున్న కుటుంబం. ఈ ప్రేమ, చరిత్ర, టైమ్ ట్రావెల్ కథే ‘అవుట్ ల్యాండర్ : బ్లడ్ ఆఫ్ మై బ్లడ్ సీజన్ 2’ (Outlander: Blood of My Blood Season 2). మరి ఈ క్రేజీ హిస్టారికల్ సిరీస్ ఎప్పటి నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది ? ఏ ఓటీటీలో ఉంది ? అంటే…
సీజన్ 2లో కథ రెండు ప్రధాన కాలాల్లో సాగుతుంది. ఎలెన్ మెకెంజీ, బ్రియాన్ ఫ్రేజర్ ప్రేమకథ 1715 జాకొబైట్ తిరుగుబాటు నేపథ్యంలో మరింత కష్టంగా మారుతుంది. యుద్ధం మొదలవడంతో ప్రేమికులు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రియాన్ యుద్ధ రంగంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఎలెన్ మాత్రం తన కుటుంబం, ప్రేమ, భవిష్యత్తు అంటూ అక్కడే చిక్కుకుపోతుంది. బ్రియాన్ తన కుటుంబానికి, క్లాన్ కు బాధ్యత వహించాల్సి రావడంతో వారి ప్రేమకు మరో పరీక్ష ఎదురవుతుంది. ఎలెన్ సోదరుడి వ్యతిరేకత కథను మలుపు తిప్పుతుంది.
మరో టైమ్ లైన్ లో జూలియా మోరిస్టన్, హెన్రీ బ్యూచాంప్ కథ కొనసాగుతుంది. వీరి కథ టైమ్ ట్రావెల్ తో ముడిపడి ఉంటుంది. గతంలోకి వెళ్లిన హెన్రీ అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు. మరోవైపు జూలియా తమ చిన్నారి కొడుకుతో మిగిలిపోతుంది. తన కుటుంబాన్ని తిరిగి కలపాలనే ప్రయత్నంలో హెన్రీ ఎదుర్కొనే సమస్యలు, జూలియా తన బిడ్డను కాపాడుకుంటూ ఎదుర్కొనే పరిస్థితులు కథలో మరో కీలక కోణాన్ని తీసుకొస్తాయి. టైమ్ ట్రావెల్ కారణంగా ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కథ మరింత ఉత్కంఠగా సాగుతుంది.
ఈ సీజన్ లో యాక్షన్ తో పాటు భావోద్వేగాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ప్రేమ కోసం ఎంత దూరం వెళ్లగలరు ? కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? కాలం మారినా బంధాలు అలాగే ఉంటాయా ? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.
హ్యారియెట్ స్లేటర్ (Harriet Slater), జేమీ రాయ్ (Jamie Roy), హెర్మియోన్ కార్ఫీల్డ్ (Hermione Corfield), జెరెమీ ఇర్విన్ (Jeremy Irvine), టోనీ కరన్ తదితరులు నటించిన ‘అవుట్ ల్యాండర్ బ్లడ్ ఆఫ్ మై బ్లడ్ సీజన్ 2’ సెప్టెంబర్ 18న ప్రీమియర్ అయింది. ఇది డ్రామా, రొమాన్స్, హిస్టారికల్ ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలతో సాగుతుంది. యాపిల్ టీవీ (Apple TV)లో ఒరిజినల్ ఆడియో ఇంగ్లిష్‌లో ఉంది. తెలుగులో ఈ సిరీస్ అందుబాటులో లేకపోవడం డిసప్పాయింట్ చేస్తుంది. కానీ హిస్టారికల్ సిరీస్ లు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిరీస్ ను ఇంగ్లీషులోనే చూడవచ్చు.
Read Also: అటకలో పాటలు పాడే మొసలి… ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్