Psychological horror thriller OTT : మనం ఎన్నో ప్రేమ కథలను చూస్తుంటాం. అయితే వీటిలో సైకో ప్రేమలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. బయటకి చాలా సాఫ్ట్‌గా, బుద్ధిమంతుడిలా కనిపిస్తూనే.. లోపల మాత్రం కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయిన ఒక ముదురు సైకో కథ ఇది. వాడు ఒక అమ్మాయిని లైన్లో పెట్టడానికి చేసే ప్లాన్లు, ఆమెకు తెలియకుండా వెనకాలే తిరుగుతూ చేసే స్టాకింగ్, అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరికేసే క్యారెక్టర్ చూస్తుంటే పిచ్చెక్కిపోద్ది. చూస్తున్నంత సేపు ప్రేమ పేరుతో ఒకడు ఎంత దారుణానికి ఒడిగడతాడో అని ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓటీటీలో ఇది ఐదు సీజన్లతో పిచ్చెక్కిస్తోంది.
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘యు’ (You). 2018లో వచ్చిన ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో పెన్ బాడ్లీ (జో) అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు 5 సీజన్లు వచ్చిన ఈ సిరీస్ లో ప్రతి సీజన్‌లో జో కొత్త ఊరికి వెళ్లి, కొత్త వ్యక్తితో ప్రేమలో పడటం.. అక్కడ జరిగే థ్రిల్లింగ్ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. దీనిని కరోలిన్ కెప్నెస్ రాసిన నవలల ఆధారంగా తీశారు. నిజానికి మొదట ఇది అమెరికాలో ఒక చిన్న టీవీ ఛానల్‌లో వస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిందో అప్పుడు ఓవర్ నైట్ గ్లోబల్ హిట్ అయిపోయింది. ఇందులో హీరోగా నటించిన పెన్ బాడ్లీకి ఈ క్యారెక్టర్ వల్ల విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఫేమస్ నటి జెన్నా ఒర్టెగా (వెన్స్‌డే ఫేమ్) కూడా ఈ సిరీస్‌లోని రెండో సీజన్ ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) తెలుగు ఆడియోలో అందుబాటులో ఉంది.
ఒక బుక్ షాపులో పని చేసే జో అనే కుర్రాడు చూడటానికి చాలా పద్ధతిగా, అమాయకంగా కనిపిస్తాడు. కానీ వాడికి ఒక పిచ్చి ఉంది.. వాడికి ఏదైనా నచ్చితే చాలు, ఇక దానిని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఒకరోజు జెనీవీవ్ అనే అమ్మాయిని చూసి మనోడు ఫ్లాట్ అయిపోతాడు. ఇక అక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. ఆమెకు తెలియకుండానే ఆమె సోషల్ మీడియా మొత్తం జల్లెడ పట్టేస్తాడు, ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది అనేది నిమిషం నిమిషం నిఘా పెడతాడు. ఆమెతో మాట్లాడుతూ మెల్లగా ఆమె లైఫ్‌లోకి దూరిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ జో మామూలు ప్రేమికుడు కాదు, ఒక సైకో. ఆమె చుట్టూ ఉన్న మనుషులు అంటే వీడికి అస్సలు పడదు.
ఆమె బాయ్‌ఫ్రెండ్ అయినా, స్నేహితులైనా సరే… వాళ్ళు ఆమెకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు. ఒకవేళ వాళ్ళు అడ్డొస్తున్నారనిపిస్తే, అస్సలు కనికరం లేకుండా వాళ్ళను లేపేస్తాడు. పాపం ఆ అమ్మాయికి మాత్రం వీడే తనను కాపాడే హీరో అనుకుంటుంది. అతని ప్రేమలో కూడా పడుతుంది. చివరికి ఏమవుతుందంటే, ఈ అబద్ధాలు, హత్యలు ఎక్కువైపోయి మెల్లమెల్లగా గుట్టు రట్టవుతుంది. ఆ అమ్మాయికి తన ప్రియుడు ఒక కిల్లర్ అని తెలిసేసరికి పరిస్థితి చేజారిపోతుంది. చివరికి జెనీవీవ్ ఈ సైకో ప్రేమ నుంచి బయటపడుతుందా ? వాడి చేతుల్లో బలవుతుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 2 మర్డర్స్ ఇద్దరు అనుమానితులు… ఈ మూవీ క్లైమాక్స్ ని అస్సలు ఊహించలేరు