Psychological Revenge Thriller: పదిహేడేళ్లు జైలులో గడిపిన ఓ హంతకుడు ఎట్టకేలకు బయటకు వస్తాడు. అతన్ని జైలుకు పంపించిన వాళ్లు సాధారణ వ్యక్తులు కాదు… లాయర్లు. అతనికి వ్యతిరేకంగా వాదించి ఇన్నేళ్ళు శిక్ష పడేలా చేస్తారు. ఇక శిక్ష పూర్తయింది, అతను నిశ్శబ్దంగా వెళ్లిపోతాడనుకుంటే అక్కడే అసలు కథ మొదలవుతుంది. తన జీవితాన్ని నాశనం చేశారని భావించిన వాళ్ల కుటుంబాల్లోకి అతను నెమ్మదిగా చొరబడతాడు. ప్రతీకారం కోసం వేసే ప్రతి అడుగు భయాన్ని పెంచుతుంటే, అతని అసలు లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇలా భయం పుట్టించే కథతో తెరకెక్కిన సైకో రివేంజ్ థ్రిల్లర్ ‘కేప్ ఫియర్’ (Cape Fear). మరి మనం ఈ భయాన్ని ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అంటే…
అన్నా బౌడెన్, టామ్ బౌడెన్ ఇద్దరూ భార్యాభర్తలు, అలాగే లాయర్లు కూడా. కొన్నేళ్ల క్రితం ఓ క్రిమినల్ కేసులో మ్యాక్స్ కేడీకి వ్యతిరేకంగా జరిగిన న్యాయ పోరాటంలో వాళ్ల పాత్ర కీలకంగా ఉంటుంది. కేడీకి జైలు శిక్ష పడుతుంది. పదిహేడేళ్లు జైలులో ఉన్న తర్వాత అతను విడుదల అవుతాడు. బయటకు వచ్చిన కేడీకి ఒకే ఒక్క లక్ష్యం ఉంటుంది. అదే తనను జైలుకు పంపించిన కుటుంబానికి నరకం అంటే ఏంటో చూపించడం.
స్టార్టింగ్ లోనే కేడీ ప్రత్యక్షంగా దాడి చేయడు. బదులుగా బౌడెన్ కుటుంబాన్ని గమనిస్తూ, వాళ్ల వ్యక్తిగత జీవితంలోని బలహీనతలను తెలుసుకుంటాడు. అన్నా, టామ్ కు కేడీ తిరిగి వచ్చాడని తెలిసిన తర్వాత భయం మొదలవుతుంది. కానీ అతన్ని చట్టపరంగా ఎదుర్కోవడం అంత సులభం కాదు. కేడీ తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి నెమ్మదిగా ప్లాన్ చేస్తాడు. కుటుంబంలోని ప్రతి వ్యక్తిని మానసికంగా ఒత్తిడికి గురిచేసేలా పరిస్థితులు సృష్టిస్తాడు. ముఖ్యంగా టామ్, అన్నా తమ కుమారుడు జాక్ ను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు.
కేడీ మాత్రం వాళ్ల కుటుంబంలోకి చొరబడుతూ, బయట నుంచి కనిపించని ప్రమాదాన్ని సృష్టిస్తాడు. అంటే వాళ్ళకే తెలియకుండా సెక్యూరిటీ లాక్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళడం, స్కూల్, ఆఫీసు ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపించడం, వాళ్ళ పిల్లలతో సన్నిహితంగా మాట్లాడడం వంటివి చేస్తుంటాడు. ఒక్కసారి వాళ్ళు చూస్తున్నది నిజమేనా ? లేక అతను ఉన్నాడని భ్రమ పడుతున్నామా అనేది ఆ దంపతులకు అర్థం కాదు. అతను కేవలం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడా ? లేక ఈ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నాడా ? అనేది చివరి వరకూ అర్థం కాదు. ఒక లాయర్ గా చట్టాన్ని ఉపయోగించి కేడీని అడ్డుకోవాలనుకునే టామ్ కు, మరోవైపు అతను సృష్టిస్తున్న భయం నుంచి కుటుంబాన్ని దూరంగా ఉంచడం కష్టమవుతుంది.
కేడీ తన టాలెంట్ తో ఆ కుటుంబాన్ని మానసికంగా బలహీనపరుస్తూ రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. బౌడెన్స్ అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే కొద్దీ అతను మరింత దగ్గరవుతాడు. చివరికి ఇది కోర్టులో మొదలైన పాత పోరాటం కాకుండా కుటుంబ ప్రాణాల కోసం జరిగే ప్రత్యక్ష పోరాటంగా మారుతుంది. మరి ఇంతకీ ఆ కిల్లర్ కు జరిగిన అన్యాయం ఏంటి ? ఎందుకు ఆ లాయర్ దంపతులను టార్గెట్ చేశాడు ? ఫైనల్ గా ఆ ఫ్యామిలీపై రివేంజ్ తీర్చుకున్నాడా లేదా ? అనేది సినిమాలో చూడాల్సిందే.
జేవియర్ బార్డెమ్ (Javier Bardem), అమీ ఆడమ్స్ (Amy Adams), పాట్రిక్ విల్సన్ (Patrick Wilson) నటించిన ఈ సిరీస్ 2026లోనే విడుదలైంది. ‘కేప్ ఫియర్’ను నిక్ ఆంటోస్కా (Nick Antosca) రూపొందించారు. మార్టిన్ స్కోర్సేసీ (Martin Scorsese), స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. Apple TVలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు కానీ తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు