Adventure Thriller: ఓ తుఫాన్ మధ్య కుటుంబానికి దూరమైన ఓ చిన్నారి. ప్రాణాలతో బయటపడతాడో లేదో తెలియని పరిస్థితిలో అతనికి మనుషులు కాదు… ఎడారిలోని జంతువులే ఆశ్రయంగా మారతాయి. ఒంటెలు, అడవి జంతువులు, ఎడారి ప్రాంతం మధ్య పెరిగిన ఆ బాలుడి కథ చాలా ఏళ్ల తర్వాత ఓ పుస్తకంగా మారుతుంది. ఆ కథను రాసిన అమ్మాయికి వచ్చిన ఓ ఆహ్వానం ఆమెను నేరుగా సహారా ఎడారిలోకి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత పుస్తకంలో చదివిన కథకు, నిజంగా జరిగిన ఘటనలకు మధ్య ఉన్న తేడా ఆమెకు అర్థమవుతుంది. ఇదే ‘ది డెజర్ట్ చైల్డ్’ (The Desert Child) మూవీ స్టోరీ. మరి ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? అంటే…
సన్ అనే 14 ఏళ్ల అమ్మాయి తన తాత చెప్పిన ఓ అద్భుతమైన కథను పుస్తకంగా రాస్తుంది. ఆ కథలో హదారా అనే బాలుడు ఉంటాడు. ఓ భారీ తుఫాన్ సమయంలో కుటుంబానికి దూరమైన హదారాను ఎడారిలోని ఓస్ట్రిచ్ పక్షుల గుంపు కాపాడుతుంది. ఆ తర్వాత అతను సహారా ప్రాంతంలో అడవి జంతువుల మధ్య పెరుగుతాడు. అతనికి ఓ ఎడారి నక్క స్నేహితుడిగా మారుతుంది.
సన్ రాసిన పుస్తకం అనూహ్యంగా పాపులర్ అవుతుంది. ఆ కథను చదివిన సహారా ప్రాంతంలోని ఓ కమ్యూనిటీ ఆమెను అక్కడికి ఆహ్వానిస్తుంది. పుస్తకంలో తాను రాసిన ప్రపంచాన్ని నిజంగా చూడబోతున్నాననే ఉత్సాహంతో సన్ ఎడారికి వెళ్తుంది. అక్కడ ఆమె తన వయసుకే చెందిన ఖరూబా అనే నోమాడ్ అమ్మాయిని కలుస్తుంది. మొదట సాధారణ పరిచయంలా మొదలైన ఈ బంధం క్రమంగా సన్ కు ఎడారి జీవితం గురించి కొత్త విషయాలను చూపిస్తుంది. అదే సమయంలో తాత చెప్పిన హదారా కథలో తనకు తెలియని మరికొన్ని విషయాలు ఉన్నాయని ఆమె గ్రహిస్తుంది.
తాను పుస్తకంలో రాసిన హదారా కేవలం ఓ కల్పిత పాత్ర కాదేమో అనే భావన సన్ లో మొదలవుతుంది. ఎడారిలోని ప్రకృతి, అక్కడి ప్రజల జీవన విధానం, అడవి జంతువులతో ఉన్న సంబంధం ఆమె ఆలోచనలను మార్చేస్తాయి. పుస్తకంలో చదివిన ఓస్ట్రిచ్‌ల కథ, హదారా జీవితానికి సంబంధించిన నిజాలు, తన తాత చెప్పిన జ్ఞాపకాలు అన్నీ ఒకదానితో ఒకటి కలుస్తాయి. సన్‌కు ఈ ప్రయాణం ఓ అడ్వెంచర్ మాత్రమే కాకుండా తన కుటుంబ గతాన్ని అర్థం చేసుకునే ప్రయాణంగా కూడా మారుతుంది. మరి ఆ బాలుడి అసలు కథ ఏంటి ? చివరికి సన్ కి తెలిసిన నిజం ఏంటి ? అనేది సినిమాలో చూడాల్సిందే.
కెవ్ ఆడమ్స్ (Kev Adams), నహెల్ ట్రాన్ (Nahel Tran), నహిల్ బువాజౌయి (Nahïl Bouazzaoui), నెజ్ దె మాస్ట్రే (Neige de Maistre) నటించిన ఈ ఫ్రెంచ్ ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీకి గిల్లెస్ దె మాస్ట్రే (Gilles de Maistre) దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 22 నుంచి Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్షీషులోనే సినిమాను చూడాల్సి ఉంటుంది.
Read Also: పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ