Xiaomi Washer Dryer: ప్రముఖ షియోమీ కంపెనీ చైనాలో తమ తొలి హీట్ పంప్ వాషర్ డ్రైయర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మిజియా వాషింగ్ మెషీన్ విత్ డెలికేట్ వాష్ ప్రో సుప్రీమ్ ఎడిషన్ పేరుతో దీనిని లాంచ్ చేశారు. చైనాలో దీని ధర దాదాపు రూ.75,000 వరకు ఉంటుంది. గతంలో వచ్చిన మోడళ్లతో పోలిస్తే.. ఇది కాస్త ఖరీదైనదే అయినప్పటికీ, ఇందులో అందించిన కొత్త డ్రైయింగ్ టెక్నాలజీ వల్ల బట్టలు ఆరబెట్టడం చాలా సులువు అవుతుంది.
ఈ వాషింగ్ మెషీన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీట్ పంప్ టెక్నాలజీ గురించే. సాధారణ వాషర్ డ్రైయర్లతో పోలిస్తే.. ఇది లోపల ఉండే వేడిని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంది. దీనివల్ల కరెంట్ వినియోగం ఏకంగా 73 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ చెప్తోంది. అంతేకాకుండా ఇందులో ఇచ్చిన డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ వల్ల బట్టలు 49 శాతం వేగంగా ఆరిపోతాయి. డ్రైయింగ్ సామర్థ్యం పెంచడానికి వీలుగా ఈ సిస్టమ్‌ను మెషీన్ పైభాగంలో అమర్చారు.
Also Read: రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!
ఈ మెషీన్‌లో ఒకేసారి 13 కేజీల బట్టలు ఉతకవచ్చు. అలాగే 9 కేజీల బట్టలను ఆరబెట్టుకోవచ్చు. ఉతకడానికి, ఆరబెట్టడానికి కలిపి మొత్తం 35 వేర్వేరు ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. బట్టలపై ఉన్న మొండి మరకలను వదిలించడానికి షియోమీ సూపర్ ఎలక్ట్రోలిసిస్ టెక్నాలజీని ఉపయోగించింది. సాధారణ చల్లటి నీళ్లతో ఉతికినా కూడా 99 శాతం వరకు క్రిములను ఇది నివారిస్తుంది. బట్టల రంగు మారకుండా, తెల్లటి దుస్తులు పసుపు రంగులోకి మారకుండా ఇవి శుభ్రపడతాయి.
ఇది కేవలం ఉతకడమే కాకుండా స్మార్ట్ ఫీచర్లతో పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే ఈ మెషీన్, మనం వేసే బట్టల రకం, మరకల ఆధారంగా సరైన వాషింగ్ ప్రోగ్రామ్‌ను సూచిస్తుంది. షియోమీ హోమ్ యాప్ ద్వారా ఫోన్ నుంచే ఈ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే బట్టలు ఉతకడం ఎంతవరకు వచ్చిందో కూడా ఫోన్‌లోనే చూసుకోవచ్చు.
ఈ వాషింగ్ మెషీన్‌ను ప్రస్తుతం చైనాలో మాత్రమే విక్రయిస్తున్నారు. ఇతర దేశాల్లో లేదా మన భారతదేశంలో దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తారనే దానిపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ వాషింగ్ మెషీన్‌ను భారత్‌లో లాంచ్ చేస్తే.. దాని ధర, ఫీచర్లను బట్టి ప్రీమియం వాషర్ డ్రైయర్ విభాగంలో ఇతర బ్రాండ్లతో పోటీ పడే అవకాశం ఉంది.
Also Read: సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. Truecaller Scam Checkerతో మోసాలపై ముందే అలర్ట్!