Romantic Movie: ప్రేమలో ఉన్నప్పుడు మనకు కనిపించే ప్రపంచం వేరు.. బ్రేకప్ తర్వాత కనిపించే ప్రపంచం వేరు. ఇలాంటి కాన్సెప్ట్ కి తనదైన స్టైల్లో సమాధానం చెప్పే సినిమా ‘(500) Days of Summer’. ‘సీత రామం’, ‘హాయ్ నాన్న’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాను తనకు ఇష్టమైన హాలీవుడ్ మూవీస్‌లో ఒకటిగా పేర్కొన్నారు. 2026లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాను తాను ఎన్నోసార్లు చూశానని, చాలా క్యూట్, రొమాంటిక్‌గా ఉంటుందని చెప్పారు. మార్క్ వెబ్ దర్శకత్వం వహించిన ఈ 2009 మూవీ జోసెఫ్ గోర్డన్-లెవిట్, జూయీ డెషానెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ ప్రేమకథ ఎందుకు బ్రేకప్ వరకు వెళ్లింది? బ్రేకప్ తర్వాత వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఇందులో టామ్ అనే కుర్రాడు గ్రీటింగ్ కార్డులు రాసే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతను ప్రేమ అంటే జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన బంధమని బలంగా నమ్ముతాడు. అలాంటి సమయంలో అతనికి ఆఫీసులో ‘సమ్మర్’ అనే అమ్మాయి పరిచయమవుతుంది. సమ్మర్‌ను చూసిన మొదటి చూపులోనే టామ్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి డేటింగ్ చేయడం మొదలుపెడతారు. కానీ టామ్ ప్రేమను ఎంత సీరియస్‌గా తీసుకుంటాడో, సమ్మర్ మాత్రం ఈ బంధాన్ని అంత సీరియస్‌గా తీసుకోదు. ఆమెకు పెళ్లి, జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండిపోవడం వంటి ఆలోచనలపై పెద్దగా నమ్మకం ఉండదు.
అయినా సరే, ఇద్దరూ కలిసి గడిపిన 500 రోజుల్లో ఎన్నో తీపి జ్ఞాపకాలు, సరదా క్షణాలు, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అయితే రోజులు గడిచేకొద్దీ ఇద్దరి ఆలోచనల మధ్య తేడాలు పెరిగిపోతాయి. చివరికి టామ్ ఊహించని విధంగా సమ్మర్ అతనికి బ్రేకప్ చెప్పేసి దూరమవుతుంది. దాంతో తీవ్రమైన బాధలో మునిగిపోయిన టామ్, తమ 500 రోజుల ప్రయాణాన్ని ఒకే వరుసలో కాకుండా ముందూ వెనుక జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ, అసలు తమ ప్రేమ బంధంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఆ ఆత్మపరిశీలనలో టామ్‌కు ఒక ముఖ్యమైన నిజం బోధపడుతుంది. తాను నిజమైన సమ్మర్‌ను కాకుండా, తన మనసులో ఊహించుకున్న ‘సమ్మర్’ రూపాన్ని మాత్రమే ప్రేమించానని గ్రహిస్తాడు. ఈ బ్రేకప్ బాధ నుంచి బయటపడే క్రమంలో టామ్ తను ఇష్టపడే ఆర్కిటెక్చర్ రంగాన్ని ఎంచుకుని, తన జీవితంలో నిజంగా ఏం కావాలో తెలుసుకుంటాడు. చివరలో అతని జీవితంలోకి ‘ఆటమ్’ అనే మరో అమ్మాయి రావడంతో సినిమా ఒక కొత్త ఆశతో ముగుస్తుంది.
మార్క్ వెబ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోసెఫ్ గోర్డన్-లెవిట్, జూయీ డెషానెల్, జెఫ్రీ అరెండ్, క్లోయీ గ్రేస్ మోరెట్జ్ తదితరులు నటించారు. సినిమా నిడివి 95 నిమిషాలు. ఇది కామెడీ, రొమాన్స్, డ్రామా జానర్ల కలయికతో వచ్చిన PG-13 మూవీ. JioHotstarలో సెప్టెంబర్ 24 నుంచి అందుబాటులోకి వచ్చింది ఈ మూవీ. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ప్రేమకథను చూడొచ్చు. బ్రేకప్, ప్రేమ, జ్ఞాపకాలు, జీవితంపై కొత్త అవగాహన కలిపిన ఎమోషనల్ రొమాంటిక్ కథలు ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్.