Romantic Series on OTT: ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఎప్పుడూ యువతను బాగా ఆకట్టుకుంటాయి. అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక అమ్మాయి ప్రేమలో పడితే పరిస్థితులు ఎలా మారతాయో చూపించే కథ అయితే మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అలాంటి క్రేజీ లవ్, ఎమోషన్స్, రిలేషన్‌షిప్ డ్రామాతో పాపులర్ అయిన సిరీస్ ‘మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్’ (My Life with the Walter Boys). నిక్కీ రోడ్రిగ్జ్, నోహ్ లాలోండే, ఆష్బీ జెంట్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ఇప్పుడు మూడో సీజన్ కూడా వచ్చేసింది. మరి ఈ సీజన్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.
జాకీ హోవార్డ్ జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన ఆమె జీవితాన్నే మార్చేస్తుంది. ఓ ప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోయిన ఆమె కొలరాడోలోని వాల్టర్స్ కుటుంబం దగ్గరకు చేరుతుంది. కొత్త కుటుంబం, కొత్త ప్రదేశం, పూర్తిగా కొత్త జీవితం మధ్య జాకీ తనను తాను మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే వాల్టర్స్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో మరో ఊహించని సమస్య మొదలవుతుంది. అదే ప్రేమ. వాల్టర్స్ కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అలెక్స్, కోల్ ఇద్దరితో జాకీకి దగ్గరి అనుబంధం ఏర్పడుతుంది. మొదట స్నేహంగా మొదలైన ఈ బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. దీంతో జాకీ ఎవరిని ఎంచుకోవాలి అనే ప్రశ్న కథలో ప్రధాన అంశంగా మారుతుంది.
అలెక్స్ ఒకవైపు ప్రశాంతంగా, జాకీకి అండగా నిలిచే వ్యక్తిగా కనిపిస్తే… కోల్‌తో ఆమెకు మరో రకమైన బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ ఇద్దరి మధ్య జాకీ ఎమోషనల్ గా చిక్కుకుపోవడంతో కుటుంబ సంబంధాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. గత సీజన్లలో జరిగిన పరిణామాల తర్వాత జాకీ, అలెక్స్ మధ్య దూరం పెరగగా, కోల్‌తో ఆమె సరికొత్త రొమాన్స్‌ను ప్రారంభిస్తుంది.
ఇక సీజన్ 3లో అసలు కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. కోల్‌తో జాకీ ప్రేమ కొనసాగుతున్న సమయంలో న్యూయార్క్ నుంచి ఆమె చిన్ననాటి స్నేహితుడు ఇలియట్ ఎంట్రీ ఇస్తాడు. ఇలియట్ రాకతో జాకీ జీవితంలో పాత జ్ఞాపకాలు, కొత్త బంధాలు మరోసారి ఎదురెదురవుతాయి. ఇప్పటికే తన జీవితంలో ఎన్నో మార్పులు చూసిన జాకీకి ఇప్పుడు మరో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు కోల్‌తో కొనసాగుతున్న ప్రేమ.. మరోవైపు తన గత జీవితానికి సంబంధించిన వ్యక్తి ఇలియట్.. ఇంకోవైపు వాల్టర్స్ కుటుంబంతో ఏర్పడిన అనుబంధాలు. వీటన్నింటి మధ్య జాకీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సీజన్ 3లో ఆసక్తిని పెంచే అంశంగా మారుతుంది.
ఈ సీజన్‌లో ప్రేమికుల మధ్య వచ్చే అపార్థాలు, బ్రేకప్ పరిస్థితులు, భావోద్వేగ ఘర్షణలు కథను మరింత ముందుకు తీసుకెళ్తాయి. జాకీ తన మనసులో అసలు ఎవరిని కోరుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం, తన గతం – వర్తమానం మధ్య సమతుల్యత సాధించడానికి ప్రయత్నించడం సీజన్‌లో కీలకంగా ఉంటుంది.
సిరీస్‌లో జాకీ పాత్రలో నిక్కీ రోడ్రిగ్జ్, కోల్ వాల్టర్‌గా నోహ్ లాలోండే, అలెక్స్ వాల్టర్‌గా ఆష్బీ జెంట్రీ నటించారు. అలీ నోవాక్ రాసిన నవల ఆధారంగా మెలానీ హాల్సాల్ ఈ సిరీస్‌ను రూపొందించారు. యువతను ఆకట్టుకునే రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఈ సిరీస్‌లో కనిపిస్తాయి. ‘మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్’ సీజన్ 3 ఆగస్ట్ 6 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది. అలాగే ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్లతో వచ్చిన సీజన్ 3లో జాకీ చివరకు ఎవరిని ఎంచుకుంటుంది ? కోల్‌తో తన ప్రేమను కొనసాగిస్తుందా ? లేక ఇలియట్ రాకతో ఆమె జీవితం మరో మలుపు తిరుగుతుందా ? ఈ లవ్ ట్రయాంగిల్ కి ఎలాంటి ముగింపు లభిస్తుందో తెలుసుకోవాలంటే ‘మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్’ సీజన్ 3ని చూడాల్సిందే.
Read Also: 70 ఏళ్ల బామ్మకు పెళ్లి… మనవడు చేసిన పని తెలిస్తే నవ్వు ఆపుకోలేరు