Survival Action Thriller: కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లిన ఓ సాధారణ యువతికి అక్కడ యుద్ధ వాతావరణం ఎదురౌతుంది. తప్పించుకునే మార్గం లేకపోయినా ప్రాణాల కోసం ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇదే ఉత్కంఠతో తెరకెక్కిన హిందీ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ‘Akelli’. నుష్రత్ భరుచ్చా జ్యోతి పాత్రలో నటించిన ఈ సినిమాలో యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న ఓ భారతీయ మహిళ పోరాటాన్ని చూపించారు. 2014లో ఇరాక్‌లోని మోసుల్‌కు గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా వెళ్లిన జ్యోతి, కొద్దిరోజుల్లోనే ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకుంటుంది. కుటుంబానికి నిజం చెప్పకుండా వెళ్లిన ఆమెకు అక్కడి పరిస్థితులు ఊహించని ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ప్రణయ్ మెష్రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం భారతదేశంలో JioHotstarలో ఉచితంగా యాడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి జ్యోతి ఉగ్రవాదుల చెర నుంచి ఎలా బయటపడింది? ఆమెకు సహాయం చేసిన వ్యక్తి ఎవరు? చివరికి ఇండియాకు తిరిగి ఎలా చేరుకుంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
జ్యోతి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే యువతి. భారత్‌లో ఉద్యోగం కోల్పోయిన తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా ఇరాక్‌లోని మోసుల్‌లో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారని భావించి తాను మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెబుతుంది. మోసుల్ చేరుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు తాను ఊహించినంత సురక్షితంగా లేవని ఆమెకు అర్థమవుతుంది.
కొన్ని రోజుల తర్వాత ఐఎస్‌ఐఎస్ దళాలు మోసుల్‌పై దాడి చేసి ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను బంధించి, పురుషులను ఒకవైపు, మహిళలను మరోవైపు తీసుకెళ్తారు. జ్యోతి కూడా వారి చెరలో చిక్కుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు విఫలమవుతూనే ఉంటాయి. అయితే ఓ దశలో తనను బంధించిన కమాండర్‌ను ఎదిరించి, అతడిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు యువతులతో కలిసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది.
తర్వాత కూడా ప్రమాదాలు ఆగవు. పారిపోతున్న సమయంలో మళ్లీ ఉగ్రవాదులు వెంటపడటంతో జ్యోతి, ఆ ఇద్దరు అమ్మాయిలు ప్రాణాల కోసం పరుగులు తీయాల్సి వస్తుంది. చివరికి పేష్మెర్గా బలగాల సహాయంతో వారు శరణార్థి శిబిరానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వ సహకారంతో జ్యోతిని దేశానికి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతాయి.
ప్రణయ్ మెష్రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నుష్రత్ భరుచ్చా, నిషాంత్ దహియా, అమీర్ బౌట్రూస్, త్సాహి హలేవి, రాజేష్ జైస్, పిలూ విద్యార్థి తదితరులు నటించారు. సినిమా నిడివి 2 గంటల 7 నిమిషాలు. ఇది హిందీ యాక్షన్, డ్రామా, సర్వైవల్ థ్రిల్లర్. ‘Akelli’ ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న ఓ సాధారణ మహిళ ప్రాణాల కోసం చేసే పోరాటం, వరుస ప్రమాదాలు, సర్వైవల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. నరాలు బిగపట్టే సర్వైవల్ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ‘Akelli’ ఓ ఇంటెన్స్ వాచ్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.