Tamil Horror Mystery: ఓ అమ్మాయి చనిపోయింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ శవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లే సమయంలో ఏదో వింత శక్తి అడ్డుపడుతుంది. ఎంత ప్రయత్నించినా ఆ మృతదేహం కదలకుండా మొండికేసస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, చనిపోయిన తర్వాత కూడా ఎందుకు వెళ్లడానికి నిరాకరిస్తోంది అనే ప్రశ్నలతో ఊరంతా భయం మొదలవుతుంది. ఇలాంటి సూపర్‌నేచురల్ మిస్టరీతో తెరకెక్కిన తమిళ సినిమా ‘Yamakaathaghi’. తంజావూరు సమీపంలోని ఓ గ్రామంలో జరిగే ఈ కథలో లీలా అనే యువతి అనుమానాస్పద మరణం చుట్టూ అసలు మిస్టరీ మొదలవుతుంది. గ్రామ పెద్ద సెల్వరాజ్ కుమార్తె అయిన లీలా చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతుంటుంది. ఓ రోజు తండ్రితో గొడవ తర్వాత ఆమె చనిపోతుంది. కుటుంబం మాత్రం ఆ మరణాన్ని సహజ మరణంగా చూపించాలని ప్రయత్నిస్తుంది. కానీ అంత్యక్రియల సమయంలో శవం కదలకపోవడంతో గ్రామంలో భయాందోళనలు మొదలవుతాయి. 2025 మార్చి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం Ahaలో అందుబాటులో ఉంది. మరి లీలా మరణం వెనుక అసలు నిజం ఏంటి? శవం ఎందుకు కదలలేదు? ఇంట్లోని ఓ రహస్య గదికి ఈ మరణానికి సంబంధం ఏంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
తంజావూరు జిల్లాలోని ఓ గ్రామంలో సెల్వరాజ్ తన కుటుంబంతో నివసిస్తుంటాడు. సంప్రదాయాలు, ఆచారాలను కఠినంగా పాటించే అతడి తీరు కారణంగా కూతురు లీలాకు తండ్రితో తరచూ విభేదాలు వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్న లీలా ఇంట్లో ఎప్పుడూ తాళం వేసి ఉంచే ఓ గదిపై ఆసక్తి చూపిస్తుంది. ఆ గదిని తెరవకూడదని ఆమె అమ్మమ్మ హెచ్చరించినా, ఓ రోజు లీలా దాన్ని తెరుస్తుంది. అక్కడ కనిపించిన ఓ చనిపోయిన ఎలుక ఆమెకు మరింత భయాన్ని కలిగిస్తుంది.
కొంతకాలానికి తండ్రితో తీవ్రంగా గొడవపడిన తర్వాత లీలా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంది. కుటుంబం మాత్రం ఆమె ఆస్తమా కారణంగానే చనిపోయిందని చెప్పి విషయం దాచాలని చూస్తుంది. కానీ అంత్యక్రియల సమయంలో ఆమె శవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లలేకపోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత గ్రామస్తులు ఒక్కొక్కరుగా లీలా జీవితానికి సంబంధించిన రహస్యాలను బయటపెడతారు. ఆమెకు అన్బు అనే యువకుడితో ఉన్న సంబంధం, కుటుంబ గౌరవం కోసం దాచిన విషయాలు, గ్రామంలోని మూఢనమ్మకాలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడతాయి. శవం కదలకపోవడం నిజంగా అతీంద్రియ శక్తి వల్లేనా? లేక మరో రహస్యం ఏదైనా ఉందా? అనే టాపిక్ తో స్టోరీ క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గా సాగుతుంది. మరి శవం చివరికి శ్మశానానికి చేరిందా ? ఆమె చావుకు అసలు కారణ తెలిసిందా ? అనేది మూవీ చూసి తెలుసుకోండి.
పెప్పిన్ జార్జ్ జయశీలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రూప కొడువాయూర్, నరేంద్ర ప్రసాద్, గీతా కైలాసం, రాజు రాజప్పన్, సుభాష్ రామసామి, హరిత తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 1 గంట 53 నిమిషాలు. ఇది తమిళ సూపర్‌నేచురల్ హారర్, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్. ‘Yamakaathaghi’ ఆహా ఓటీటీలో ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు డబ్ కూడా అందుబాటులో ఉంది. ఇంట్లో దాగిన రహస్యాలు, కుటుంబ గౌరవం, మూఢనమ్మకాలు, చనిపోయిన తర్వాత కూడా కదలని శవం చుట్టూ సాగే కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ డిఫరెంట్ హారర్ మిస్టరీ.