Fantasy Adventure Movie: చుట్టూ పచ్చని కొండలు, ప్రకృతి మధ్య ఓ మాయా చెట్టు. దాని పైకి ఎక్కితే మన ఊహకు కూడా అందని వింత ప్రపంచాలు పిల్లలనే కాదు పెద్దలను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇలాంటి అద్భుతమైన ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన సినిమా ‘The Magic Faraway Tree’. ఎనిడ్ బ్లైటన్ రాసిన ప్రపంచప్రసిద్ధ పిల్లల కథల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఆండ్రూ గార్ఫీల్డ్, క్లేర్ ఫోయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ సిటీ ఫ్యామిలీ అనుకోకుండా మారుమూల ఇంగ్లిష్ గ్రామీణ ప్రాంతానికి వెళ్లడంతో వారి పిల్లలకు ఈ మాయా చెట్టు కనిపిస్తుంది. చెట్టు పైకి వెళ్లిన ప్రతిసారీ కొత్త కొత్త అద్భుత ప్రపంచాల్లోకి అడుగుపెట్టే అవకాశం దొరుకుతుంది. సెప్టెంబర్ 22 నుంచి డిజిటల్ రెంట్‌కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా విజువల్స్, ఫ్యాంటసీ అడ్వెంచర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఆ చెట్టు ప్రత్యేకత ఏంటి? పిల్లలకు అక్కడ ఎలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మాయా ప్రపంచం చివరికి కుటుంబాన్ని ఎలా మార్చింది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
థామ్సన్ కుటుంబానికి చెందిన దంపతులు టిమ్ (ఆండ్రూ గార్ఫీల్డ్), పాలీ (క్లైర్ ఫాయ్) తమ ముగ్గురు పిల్లలతో కలిసి నగరాన్ని విడిచి, ఇంగ్లాండ్ గ్రామీణ ప్రాంతానికి మారాల్సి వస్తుంది. పిల్లలు ఎప్పుడూ మొబైల్ స్క్రీన్లు, టెక్నాలజీకి అలవాటు పడి ఉండటం వల్ల, ఇంటర్నెట్ లేని ఆ పల్లెటూరి వాతావరణం వారికి నచ్చదు. ఒకరోజు వారి చిన్న కూతురు ఫ్రాన్ అనుకోకుండా ఒక రహస్య అడవిలోకి వెళ్లి, అక్కడ ఉన్న ఒక భారీ ‘మాయా వృక్షాన్ని’ (Magical Faraway Tree) కనుగొంటుంది. ఆ చెట్టుపై మూన్‌ఫేస్, సిల్కీ అనే ఒక చిన్న దేవత లాంటి వింతైన, అద్భుతమైన జీవులు నివసిస్తుంటాయి.
ఆ చెట్టు చిటారు కొమ్మల పైభాగంలో ప్రతిరోజూ కొత్త కొత్త మాయా లోకాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఆ లోకాల్లోకి పిల్లలు ప్రయాణించి వింత అనుభవాలను ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఒక ప్రమాదకరమైన లోకంలో దుష్ట పాత్ర అయిన ‘డేమ్ స్నాప్’ చేతిలో చిక్కుకుంటారు. ఆ కష్టాల నుండి ఒకరినొకరు ఎలా రక్షించుకున్నారు, ప్రకృతితో సమయం గడపడం ఎంత ముఖ్యమో ఆ పిల్లలు ఎలా తెలుసుకున్నారు అనేదే ఈ సినిమా ముగింపు.
ఇందులో బెన్ గ్రెగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆండ్రూ గార్ఫీల్డ్, క్లేర్ ఫోయ్, నోన్సో అనోజీ, నికోలా కాఫ్లాన్, జెస్సికా గన్నింగ్, జెన్నిఫర్ సాండర్స్, రెబెక్కా ఫెర్గూసన్ తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 1 గంట 50 నిమిషాలతో Prime Videoలో సెప్టెంబర్ 22 నుంచి రెంట్‌కు అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఫ్యాంటసీ, మ్యాజిక్, అడ్వెంచర్ సినిమాలు ఇష్టపడేవారికి ‘The Magic Faraway Tree’ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది.
Read Also: అండర్‌వరల్డ్ దందాలతో ఆగమయ్యే సిటీ… గ్యాంగ్‌స్టర్ వార్ తో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్