Adilabad RIMS Tragedy: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు చిన్నారులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మంత్రి పరామర్శకు వెళ్లారంటే కచ్చితంగా బాధితులకు సాయం ప్రకటిస్తారని భావించామని కానీ వారికి రూపాయి కూడా సాయం చేయలేదన్నారు. ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను ప్రభుత్వంపై సంధించారు.
ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ లో ముగ్గురు చిన్నారులు చనిపోయిన సంఘటనలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ నిర్లక్ష్యమే ఎక్కువ బాధించిందని కవిత అన్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన ఆయన సంఘటన స్థలానికి వెళ్లి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఏదో టూరిజం స్పాట్ కు వెళ్లినట్లు హడావుడిగా అర్ధగంటలో అక్కడ నుంచి వెళ్లిపోయారని.. కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో చిన్నారుల మృతి విషయంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యమే బాధించింది.
ముగ్గురు చిన్నారులు చనిపోతే బాధిత కుటుంబాలకు పైసా సాయం చేయరా?
ఫోటోలు దిగేందుకే హెల్త్ మినిస్టర్ ఘటన స్థలానికి వెళ్లారు కానీ కనీస మానవత్వం… pic.twitter.com/wTscVxA7Ez
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 22, 2026
చిన్న పిల్లలున్న ఇంక్యుబేటర్ వార్డులో జరిగిన ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, మానవ తప్పిదం కారణంగానే జరిగిందని చెప్పారన్నారు. ఏసీ మెయింటెనెన్స్ సరిగా చేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఒక్క ఆదిలాబాద్ రిమ్స్ లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో ఏదో ఒక సమస్య ఉందన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ పరిస్థితి పై సీఎం సమీక్ష నిర్వహించి అడిట్ చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు.
కాగా, చనిపోయిన వారిలో ఇద్దరు మైనార్టీ పిల్లలుంటే ఒక ఆదివాసీ బిడ్డ ఉన్నారని కవిత తెలిపారు. వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పేదరికంలో బాధిత కుటుంబం ఉందన్నారు. వారికి కనీస సాయం కూడా ఈ ప్రభుత్వం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి గర్భ శోకంలో మునిగిపోయిన చిన్నారుల కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: ‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్ వైఖరిపై ధ్వజం!
మరోవైపు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం ఆదిలాబాద్ వెళ్లనున్నట్లు కవిత తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున పార్టీ తరఫున అందిస్తామన్నారు. హెల్త్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అత్యంత సీరియస్ అంశంగా తాము పరిగణిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ దుర్ఘటనతో నైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు.
Also Read: ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!