Chinese fantasy Action Movie: ఒకప్పుడు దైవిక శక్తులతో తిరుగులేని యోధుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తన శక్తులన్నీ కోల్పోతే ? తాను గతంలో ఇచ్చిన ఓ మాటను నిలబెట్టుకోలేకపోయిన వ్యక్తినే, ఏళ్ల తర్వాత మళ్లీ కలిస్తే ? అదే సమయంలో ఓ గ్రామంపై రాక్షస శక్తులు దాడి చేస్తే… శక్తులు లేని ఆ యోధుడు ఏం చేస్తాడు ? చైనీస్ ఫాంటసీ, మార్షల్ ఆర్ట్స్ యాక్షన్, ఎమోషన్ కలగలిసిన కథే ‘ది మంకీ ఈజ్ బ్యాక్’ (The Monkey is Back). మరి 2021లో విడుదలైన ఈ మూవీ తెలుగులో ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ప్రసిద్ధ చైనీస్ నవల ‘జర్నీ టు ది వెస్ట్’ (Journey to the West)లోని మంకీ కింగ్ పాత్ర స్ఫూర్తితో ఈ కథ సాగుతుంది. ఇందులో లింగ్ మింగ్ స్టోన్ మంకీ అనే శక్తివంతమైన దైవిక యోధుడు చిన్నతనంలో బా హైక్సింగ్ అనే నిరాశ్రయురాలైన బాలికను కలుస్తాడు. ఆమెకు సహాయం చేస్తానని మాట ఇస్తాడు. కానీ పరిస్థితులు అతడిని ఆ మాట నిలబెట్టుకోనివ్వవు. దాంతో బా హైక్సింగ్ తీవ్రంగా నిరాశ చెందుతుంది. ఆ చిన్న సంఘటనే భవిష్యత్తులో ఇద్దరి జీవితాలను ప్రభావితం చేసే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కొన్నేళ్ల తర్వాత మంకీ కింగ్‌కు ‘త్రీ-ఐడ్ గాడ్ ఆఫ్ వార్’తో భీకరమైన పోరాటం జరుగుతుంది. ఈ యుద్ధంలో అతడు ఓడిపోవడమే కాకుండా తన దైవిక శక్తులన్నింటినీ కోల్పోతాడు.
స్వర్గలోకం నుంచి మానవ లోకానికి పడిపోయిన అతడు ఇక గతంలో ఉన్న శక్తివంతమైన యోధుడు కాదు. సాధారణ మనిషిలా కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడే అతడికి ఊహించని విధంగా తన గతం మళ్లీ ఎదురవుతుంది. ఇప్పుడు పెద్దదైన బా హైక్సింగ్ ను అతడు కలుస్తాడు. గతంలో నిలబెట్టుకోలేకపోయిన మాటను ఈసారి నెరవేర్చాలనే ఆలోచన అతడిలో మొదలవుతుంది. కానీ ఇది అంత సులభం కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంపై ము షెన్ జుమాంగ్ అనే శక్తివంతమైన చెక్క రాక్షసుడు, అతని అనుచరుల కన్ను పడుతుంది. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు మరింత ప్రమాదకరమైన లక్ష్యంతో వారు ముందుకు వస్తారు.
గ్రామస్థులపై ముప్పు పెరుగుతున్న కొద్దీ, శక్తులు లేని మంకీ కింగ్ కూడా పోరాటంలోకి దిగాల్సి వస్తుంది. అయితే అతని దగ్గర ఇప్పుడు దైవిక శక్తులు లేవు. మరి కేవలం ధైర్యం, తెలివి, ఆత్మవిశ్వాసంతో ఆ రాక్షస శక్తులను ఎదుర్కోగలడా ? గతంలో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం అతడికి దొరుకుతుందా ? నిజమైన శక్తి అంటే దైవిక సామర్థ్యమా… లేక ఇతరులను కాపాడేందుకు ముందుకు వచ్చే మనసా ? బా హైక్సింగ్ నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి అతడు ఏం చేస్తాడు ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చివరి వరకు చూడాల్సిందే.
‘ది మంకీ ఈజ్ బ్యాక్’ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. ఫాంటసీ కథలు, చైనీస్ పురాణ పాత్రలు, మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు, భారీ VFXతో పాటు ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి టైమ్‌పాస్ అవుతుంది. ముఖ్యంగా మంకీ కింగ్ పాత్ర చుట్టూ సాగే ఫాంటసీ ప్రపంచం, యాక్షన్ సన్నివేశాలు వర్త్ వాచింగ్ అని చెప్పవచ్చు.
Read Also: జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా