Animated Fantasy Series OTT : యూనికార్న్ ఐలాండ్‌లో అంతా సాఫీగా సాగిపోతుందనుకునే సమయంలో వరుసగా వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. మ్యాజిక్‌తో నిండిన ఆ ప్రపంచానికే ప్రమాదం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? తమ యూనికార్న్‌లతో కలిసి ఎన్నో సాహసాలు చేసిన సోఫియా, వైల్డ్‌స్టార్‌తో పాటు మిగిలిన సఫైర్స్ ఇప్పుడు మరో పెద్ద మిస్టరీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐలాండ్‌ను కాపాడేందుకు వాళ్లు ఊహించని మిత్రులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ అడ్వెంచర్ యానిమేటెడ్ సిరీస్ పేరే ‘Unicorn Academy: Secrets Revealed – Chapter 2’. ఈ కొత్త చాప్టర్ స్ట్రీమింగ్ తాజాగా షురూ అయ్యింది. మరి ఈ సిరీస్‌ను ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే…
యూనికార్న్ ఐలాండ్‌లోని మ్యాజికల్ ప్రపంచమే ఈ కథకు ప్రధాన నేపథ్యం. సోఫియా, వైల్డ్‌స్టార్‌తో పాటు సఫైర్స్‌గా ఉన్న ఆమె స్నేహితులు ఇప్పటికే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని యూనికార్న్ అకాడమీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. తమ యూనికార్న్‌లతో ఏర్పడిన బంధం ద్వారా కొత్త శక్తులను తెలుసుకుంటూ, ఐలాండ్‌లో ఉన్న రహస్యాలను కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు.
అయితే ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ఐలాండ్‌లో వరుసగా వింత విపత్తులు మొదలవుతాయి. సాధారణంగా కనిపించే సమస్యల వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని సోఫియా టీమ్‌కు అర్థమవుతుంది. మ్యాజిక్‌కు సంబంధించిన పాత విషయాలు బయటకు రావడంతో అసలు ఈ ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై వాళ్లు దృష్టి పెడతారు. ఒక సమస్యను పరిష్కరించేలోపే మరో సమస్య ఎదురవడంతో సఫైర్స్‌కు విశ్రాంతి లేకుండా పోతుంది.
ఇదే సమయంలో సోఫియా, వైల్డ్‌స్టార్‌తో పాటు మిగిలిన రైడర్స్ తమ కొత్త మ్యాజికల్ రెక్కలను ఉపయోగిస్తూ రెస్క్యూ మిషన్స్‌లో పాల్గొంటారు. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడటంతో పాటు, ఐలాండ్‌కు సంబంధించిన పాత రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయాణంలో ఊహించని వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది.
మరోవైపు సోఫియా తన తండ్రికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్న కొద్దీ తమ వ్యక్తిగత సమస్యల కంటే యూనికార్న్ ఐలాండ్‌ను కాపాడటమే ముఖ్యమని వాళ్లు నిర్ణయించుకుంటారు. మ్యాజిక్ ప్రపంచంలో జరిగే ఈ అడ్వెంచర్‌లో ఒక్కో ఎపిసోడ్‌తో కొత్త రహస్యం బయటపడుతుంది. సోఫియా టీమ్ చివరికి దాగి ఉన్న నిజాన్ని ఎలా గుర్తించింది ? ఐలాండ్‌ను కమ్ముకున్న ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ? తమ మ్యాజిక్‌ను కాపాడుకునేందుకు సఫైర్స్ ఎలాంటి సాహసం చేశారు ? అన్నది తెలుసుకోవాలంటే ఈ కొత్త చాప్టర్ చూడాల్సిందే.
Also Read : విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’
‘యూనికార్న్ అకాడమీ చాప్టర్ 2’ యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్. ఇందులో సోఫియాకు సారా గార్సియా, వైల్డ్‌స్టార్ పాత్రకు సాడీ లాఫ్లామ్-స్నో, అలాగే కామైయా ఫెయిర్‌బర్న్ తదితరులు వాయిస్ అందించారు. ఈ కొత్త చాప్టర్ 2026 అక్టోబర్ 8న Netflixలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మొదటి నాలుగు ఎపిసోడ్లు అక్టోబర్ 8న విడుదల కాగా, మిగిలిన నాలుగు ఎపిసోడ్లను 2027 స్ప్రింగ్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ఇంగ్షీషు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.