OTT Movie : మందుబాబులు గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాగినప్పుడు వీళ్ళు చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు. తాగకముందు ఒకలా, తాగిన తర్వాత మరోలా ప్రవర్తిస్తుంటారు మందు బాబులు. ఈ మద్యం మహమ్మారికి ఎన్నో కుటుంబాలు చల్లా చెదురు అయ్యాయి. మద్యానికి బానిస అయితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అవుతాడు. ఆ తర్వాత ఇదే వ్యక్తి ఒక గొప్ప వ్యాపారవేత్త కూడా అవుతాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా, ఈ మూవీని తెరకెక్కించారు. మంచి మెసేజ్ ఉన్న ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘వెళ్ళం’ (vellam). 2021 లో విడుదలైన ఈ మలయాళ డ్రామా మూవీకి ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జయసూర్య, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్దీక్, శ్రీలక్ష్మి, సంతోష్ కీజట్టూర్ వంటి నటులు సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త మురళి కున్నుంపురత్ జీవితం ఆధారంగా రూపొందింది. అతను మద్యపాన వ్యసనం నుండి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన వ్యక్తి. ఈ మూవీలో జయసూర్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మురళి నంబియార్ మద్యపాన వ్యసనపరుడు. అతని వ్యసనం వల్ల కుటుంబం, సమాజానికి భారంగా మారుతాడు. అతని భార్య సునీత, తల్లిదండ్రులు కూడా అతన్ని మార్చలేక, నిస్సహాయంగా ఉండిపోతారు. మద్యం కోసం అతను ఇంట్లో డబ్బు, వస్తువులు, స్నేహితుల నుండి రుణాలు కూడా తీసుకుంటాడు. ఒకసారి ఇంటి ఫర్నిచర్‌ను కూడా అమ్మేస్తాడు. అతని ప్రవర్తన వల్ల కుటుంబం అవమానపాలు అవుతుంది. చివరికి కూతురు మెడలో గొలుసు దొంగతనం చేయాలని చూస్తాడు. ఇక లాభం లేదనుకొని ఒక డాక్టర్ దగ్గర ట్రీట్ మెంట్ కోసం పంపిస్తారు. అయితే అక్కడ కూడా అతని ప్రవర్తన మారాడు. అక్కడి నుంచి ఒక రోజు, మురళి తన ఇంటికి తిరిగి వస్తాడు. తన తల్లిదండ్రులు ఇంటిని అమ్మి వెళ్ళిపోయారని తెలుసుకుంటాడు. ఎవరూ తన గురించి పట్టించుకోవడం లేదని భావించి, అతను బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అయితే, అతన్ని రక్షించి ఆసుపత్రికి తీసుకెళతారు.
అతనిలో మార్పు ఇప్పటి నుంచి మొదలవుతుందని, మురళికి ప్రేమ మద్దతు అవసరమని, డాక్టర్ సుబ్రమణ్యం అతని కుటుంబాన్ని ఒప్పిస్తాడు. మళ్ళీ అతన్ని కుటుంబం ఆదరిస్తుంది. మురళి క్రమంగా తన వ్యసనం నుండి బయటపడి, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మారుతాడు. అతను ‘వాటర్‌మ్యాన్’ అనే టైల్స్ ఉత్పత్తిని ప్రారంభించి, వాటిని ఎగుమతి చేయడం కూడా మొదలుపెడతాడు. చివరగా, మురళి మరొక మద్యపాన వ్యసనపరుడిని డాక్టర్ సుబ్రమణ్యం వద్దకు చికిత్స కోసం తీసుకెళతాడు, తనలాగే అతను కూడా సమాజంలో గౌరవంగా బ్రతకగలడని నమ్ముతాడు.ఈ సినిమా మద్యపాన వ్యసనం వల్ల వచ్చే వినాశకర పరిణామాలతో పాటు, ప్రేమ మద్దతుతో ఆ వ్యక్తి తిరిగి జీవితంలో నిలబడగలడనే సందేశాన్ని కూడా చూపిస్తుంది.