Horror Movie on OTT: దెయ్యం అంటే భయపెట్టే రూపం.. చీకటి, అరుపులు, రక్తపాతం.. సాధారణంగా హారర్ సినిమాల్లో కనిపించే దృశ్యాలివే. కానీ ‘ఎ గోస్ట్ స్టోరీ’ (A Ghost Story) మాత్రం వీటన్నింటికంటే డిఫరెంట్ సినిమా. ఇందులో దెయ్యం ప్రేక్షకులను భయపెట్టదు. తన భార్యను విడిచిపెట్టలేక అదే ఇంట్లో ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉండే ఒక భర్త ఆత్మను చూపిస్తూ… ప్రేమ, మరణం, జ్ఞాపకాలు, కాలం గురించి మనసుకు హత్తుకునే ఎమోషనల్ హర్రర్ స్టోరీ ఇది. కేసీ అఫ్లెక్, రూనీ మారా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ వినూత్నమైన సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
సి ఒక మ్యూజిషియన్. అతని భార్య ఎమ్‌తో కలిసి ఓ పాత ఇంట్లో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అయితే ఆ సంతోషకరమైన జీవితాన్ని ఒక్కసారిగా ఓ విషాదం కుదిపేస్తుంది. ఇంటి సమీపంలో జరిగిన ప్రమాదంలో సి ప్రాణాలు కోల్పోతాడు. భర్త మరణంతో ఎమ్ పూర్తిగా కుంగిపోతుంది. అతని జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించినా.. ఆ ఇంట్లోని ప్రతి వస్తువు, ప్రతి మూల ఆమెకు సి గుర్తులను గుర్తు చేస్తూనే ఉంటాయి. అందుకే చివరకు ఆ ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది.
ఇదే సమయంలో కథలో అద్భుతమైన అంశం మొదలవుతుంది. సి ఆత్మ తన పాత ఇంటికి తిరిగి వస్తుంది. తెల్లటి దుప్పటిని కప్పుకున్న ఓ దెయ్యం రూపంలో కనిపించే అతను… ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. అతనికి భార్య కనిపిస్తుంది. కానీ ఆమెకు మాత్రం తన భర్త ఆత్మ కనిపించదు. ఎమ్ వెళ్లిపోయే ముందు ఓ చిన్న కాగితంపై ఏదో రాసి, దాన్ని ఇంటి గోడలోని ఓ సందులో దాచిపెడుతుంది. ఆ కాగితంలో ఏముందో తెలుసుకోవాలనే కోరిక సి ఆత్మను అక్కడే కట్టిపడేస్తుంది. గోడను గీకుతూ ఆ చీటీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు.
కానీ ఇక్కడే సినిమా సాధారణ కథలా ఉండదు. రోజులు గడుస్తాయి… నెలలు, సంవత్సరాలు దాటిపోతాయి. ఆ ఇంట్లోకి కొత్త వ్యక్తులు వస్తారు. వాళ్లు వెళ్లిపోతారు. కాలం మారుతుంది. ఒక దశలో ఆ ఇల్లు కూడా కనుమరుగై, అక్కడ కొత్త నిర్మాణాలు వస్తాయి. అయినప్పటికీ ఆ దెయ్యం మాత్రం తనకు సంబంధించిన ఆ ఒక్క జ్ఞాపకం కోసం అక్కడే ఎదురుచూస్తూ ఉంటుంది. కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే… కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాలం కూడా వెనక్కి ప్రయాణిస్తుంది. సి ఆత్మ చివరకు గతంలోని తన జీవితాన్ని, తన భార్యను చూసే స్థితికి చేరుకుంటుంది. అంటే తాను చనిపోవడానికి ముందు జరిగిన సంఘటనలను కూడా ఆత్మ చూసేలా కథ ఒక టైమ్ లూప్‌లోకి వెళ్తుంది.
చివరకు ఎమ్ ఆ ఇంటిని వదిలి వెళ్లే సమయంలో గోడలో దాచిన ఆ కాగితం సి ఆత్మకు దొరుకుతుంది. ఇన్నాళ్లుగా తెలుసుకోవాలని ఎదురుచూసిన ఆ చీటీని చివరకు బయటకు తీస్తాడు. దాన్ని చదివిన తర్వాత అతని ఆత్మకు విముక్తి లభిస్తుంది. ఇంతకీ ఆ కాగితంలో ఏముంది? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
‘ఎ గోస్ట్ స్టోరీ’ని సాధారణ హారర్ సినిమాగా చూడటం కరెక్ట్ కాదు. ఇది భయపెట్టదు. పైగా ప్రేమను, కోల్పోవడాన్ని, జ్ఞాపకాలను ఎక్కువగా చూపించే స్లో-బర్న్ ఎమోషనల్ డ్రామా. కేసీ అఫ్లెక్ ఈ సినిమాలో దాదాపు మొత్తం తెల్లటి దుప్పటి కప్పుకున్న దెయ్యం రూపంలో కనిపిస్తారు. ముఖ కవళికలు కూడా కనిపించని పరిస్థితిలో కేవలం బాడీ లాంగ్వేజ్‌తోనే భావోద్వేగాన్ని ప్రేక్షకులకు చేరవేయడం ఈ సినిమా ప్రత్యేకత. రూనీ మారా కూడా తన పాత్రలో చాలా సహజంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలోని నిశ్శబ్దం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెద్దగా డైలాగులు లేకపోయినా.. ఇంటి ఖాళీతనం, ఒంటరితనం, కాలం గడిచిపోవడం లాంటి అంశాలు ప్రేక్షకుడిపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ‘ఎ గోస్ట్ స్టోరీ’ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. సాధారణ దెయ్యాల సినిమాల కంటే భిన్నంగా.. ప్రేమ, మరణం, జ్ఞాపకాలు, కాలం చుట్టూ నెమ్మదిగా సాగే ఒక ఎమోషనల్ కథను చూడాలనుకుంటే ఈ మూవీ బెస్ట్. సినిమా పూర్తయ్యాక కూడా ఆ తెల్లటి దుప్పటి కప్పుకున్న దెయ్యం ఎందుకు ఇన్నేళ్లు అక్కడే ఉండిపోయిందనే ఆలోచన మాత్రం మనసులో మిగిలిపోతుంది.
Read Also: తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్