Survival Thriller: వెస్ట్రన్ సినిమాలు అంటే చాలామందికి గన్‌ఫైట్లు, ఎడారుల్లో జరిగే యాక్షన్ సన్నివేశాలే గుర్తుకు వస్తాయి. కానీ అదే వెస్ట్రన్ జానర్‌ను మంచుతో కప్పుకున్న నిర్మానుష్య ప్రాంతంలో, సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది ? అలాంటి విభిన్నమైన ప్రయత్నమే ‘ది ఐసోలేట్ థీఫ్’ (The Isolate Thief 2026). ఇది వేగంగా పరుగులు తీసే యాక్షన్ సినిమా కాదు. నెమ్మదిగా సాగుతూ, ప్రతి క్షణం ఉత్కంఠను పెంచే సర్వైవల్ డ్రామా. ఒక ఒంటరి యువతి తెలివితేటలు, ప్రాణాల కోసం చేసే పోరాటం ఈ చిత్రంలో ఆకట్టుకుంటాయి. మరి ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
అమెరికా అంతర్యుద్ధం ముగిసే రోజుల నేపథ్యంలో కథ సాగుతుంది. మంచుతో పూర్తిగా కప్పుకుపోయిన ఓ మారుమూల ప్రాంతంలో యూనియన్ ఆర్మీకి చెందిన చిన్న సైనిక స్థావరం ఉంటుంది. అక్కడ అడ్రియాన్ హార్న్ అనే యువతి తన తండ్రితో కలిసి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటుంది.
ఒకరోజు అనుకోకుండా ఆమె జీవితాన్ని తలకిందులు చేసే ఘటన జరుగుతుంది. తండ్రి మరణించడంతో ఆ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె ఒక్కతే మిగిలిపోతుంది. గడ్డకట్టే చలి, చుట్టూ ఎవరూ లేని పరిస్థితుల్లో ఆ స్థావరాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపై పడుతుంది.
ఆ సమయంలోనే అదృష్టమో, దురదృష్టమో తెలియని ఒక సంఘటన చోటుచేసుకుంటుంది. అత్యంత విలువైన దొంగిలించిన బంగారం ఆమె చేతికి చిక్కుతుంది. ఆ నిధిని దాచిపెట్టాలని నిర్ణయించుకున్న ఆమెకు అసలు ప్రమాదం అప్పుడే మొదలవుతుంది.
ఆ బంగారం కోసం వెతుకుతున్న క్రూరమైన నేరస్థుల ముఠా ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. ఎక్స్పీరియన్స్డ్ సైనికుడు నాయకత్వం వహిస్తున్న ఆ గ్యాంగ్, ఎలాంటి దయ లేకుండా బంగారం కోసం వెతకడం ప్రారంభిస్తుంది. వారి కంట పడిన తర్వాత అడ్రియాన్‌కు ప్రతి క్షణం ప్రాణాపాయంగా మారుతుంది.
చుట్టూ మంచు, బయటపడే దారి లేదు. ఎదురుగా ఆయుధాలతో ఉన్న నేరస్థులు. అలాంటి పరిస్థితుల్లో ఆమె తన తెలివిని ఎలా ఉపయోగించింది ? శత్రువుల కంటే ఒక అడుగు ముందే ఉండగలిగిందా ? బంగారాన్ని కాపాడుకోగలిగిందా ? లేక ప్రాణాలు రక్షించుకోవడమే కష్టమైందా ? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ది ఐసోలేట్ థీఫ్’ అసలు కథ.
‘ది ఐసోలేట్ థీఫ్’లో యాక్షన్ కంటే వాతావరణం, పాత్రల మధ్య ఉత్కంఠ, సర్వైవల్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటర్‌స్టెల్లార్ ఫేమ్ మెకెంజీ ఫాయ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. సీన్ బీన్, ఓడెయా రష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపిస్తారు. దర్శకుడు జాన్ సూట్స్ మంచుతో కప్పుకున్న ప్రకృతిని కథలో భాగంగా మలచిన తీరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్లో-బర్న్ థ్రిల్లర్స్, వెస్ట్రన్ డ్రామాలు, సర్వైవల్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది.
‘ది ఐసోలేట్ థీఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ కి మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కేవలం ఇంగ్లీష్ ఒరిజినల్ వెర్షన్లో మాత్రమే వీక్షించవచ్చు. భాష ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్ సినిమాలు చూసేవారైతే ఈ చిత్రాన్ని డోంట్ మిస్.
Read Also: బావిలో దొరికిన మహిళ శవం… దర్యాప్తులో బయటపడిన భయంకర రహస్యం