Mookuthi Amman 2:ప్రముఖ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara) ఒకవైపు హీరోయిన్ గా గ్లామర్ వలకబోస్తూనే..మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలా 2020లో ‘మూకుత్తి అమ్మన్’ అనే టైటిల్ తో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది నయనతార. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరిట రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 పేరిట విడుదల చేయబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి.
ఐసరి గణేష్ తన వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ విలువ ఎంత అనే విషయం పై ప్రస్తుతం క్లారిటీ రాలేదు. కానీ మొదటి సినిమా కంటే ఈ సినిమా ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నయనతారకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. ఈ సినిమా కథపై ఉన్న నమ్మకంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
also read:రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?
ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.. నయనతార అమ్మవారి పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుండగా.. ఇందులో రెజీనా కసాండ్రా విలన్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారి ఆమె తన కెరియర్ లోనే ఇలా విలన్ పాత్ర పోషిస్తుండడం గమనార్హం. 2020లో విడుదలైన మూకుత్తి అమ్మన్ సినిమా తొలి భాగానికి ఆర్జే బాలాజీ, ఎం. జే.శర్వానంద్ దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార దేవతగా.. ఆర్జే బాలాజీ హీరోగా నటించారు. నకిలీ స్వామీజీలు, మూఢనమ్మకాలపై వివిధ అంశాలను సంధిస్తూ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అటవీ భూములపై కన్నేసిన నకిలీ స్వామీజీ బండారాన్ని కథానాయకుడు తమ ఇలవేల్పు అయిన ముక్క పుడక అమ్మవారి సహాయంతో ఎలా బయటపెట్టాడు అనే స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో కరోనా లాక్ డౌన్ కారణంతో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు . మరి ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ముకుత్తి అమ్మన్ 2 థియేటర్లలో విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
నయనతార సినిమాల విషయానికి వస్తే .. యశ్ (Yash) హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ చిత్రంలో హీరో సోదరి పాత్రలో గంగ పాత్రధారిగా అలరించడానికి సిద్ధమయ్యింది నయనతార. అలాగే ప్రముఖ యంగ్ హీరో కవిన్ తో కలిసి రొమాంటిక్ కామెడీ డ్రామా ‘హాయ్’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. కేవలం రెండు రోజుల తేడాతోనే ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది నయనతార.