TVS Scooter Prices August 2026: టీవీఎస్ మోటార్ కంపెనీ.. స్కూటర్ల ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలనూ సవరించింది. ముఖ్యంగా ఐక్యూబ్, ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను ఎక్కువగా పెంచిన కంపెనీ, జుపిటర్ 110, జుపిటర్ 125, Ntorq 125 మోడళ్ల ధరలను కూడా స్వల్పంగా పెంచింది. ఆయా మోడల్ ను బట్టి సుమారు రూ. 11,000 వరకు ధరలు పెరిగాయి.
టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఐక్యూబ్, ఆర్బిటర్ మోడళ్ల ధరలు ఎక్కువగా పెరిగాయి. ఐక్యూబ్ 2.2kWh వేరియంట్ ధర రూ.5,000 పెరిగి ఇప్పుడు రూ.1.16 లక్షలకు చేరింది. అయితే 3.1kWh వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఐక్యూబ్ 3.5kWh వేరియంట్ ధర అత్యధికంగా రూ.9,000 పెరిగి రూ.1.42 లక్షలకు చేరింది. అలాగే ఐక్యూబ్ S 4.7kWh ధర రూ.6,000 పెరిగి రూ.1.61 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ఐక్యూబ్ ST 5.3kWh ధర రూ.3,000 పెరిగి రూ.1.75 లక్షలకు చేరుకుంది. అటు ఆర్బిటర్ సిరీస్ లో ధరల పెంపు మరింత ఎక్కువగా ఉంది. ఆర్బిటర్ V1 ధర రూ.11,000 పెరిగి రూ.99,250కు చేరగా, ఆర్బిటర్ V2 ధర రూ.9,000 పెరిగి రూ.1.14 లక్షలకు చేరింది.
టీవీఎస్ జుపిటర్ 110 ధరలు వేరియంట్‌ను బట్టి రూ.575 నుంచి రూ.1,950 వరకు పెరిగాయి. దీంతో ఇప్పుడు ఈ స్కూటర్ ధరలు రూ.73,975 నుంచి రూ.88,850 మధ్య ఉన్నాయి. జుపిటర్ 125 ధరలను కూడా కంపెనీ సవరించింది. ఈ మోడల్ ధరలు రూ.875 నుంచి గరిష్టంగా రూ.2,410 వరకు పెరిగాయి. ప్రస్తుతం జుపిటర్ 125 ధర రూ.81,110 నుంచి ప్రారంభమై రూ.89,935 వరకు ఉంది.
యూత్ లో మంచి ఆదరణ పొందుతున్న Ntorq 125 ధర కూడా పెరిగింది. ఇటీవల కొత్త కలర్ ఆప్షన్లతో వచ్చిన Ntorq 125 Disc వేరియంట్ ధర రూ.850 పెరిగి రూ.83,350కు చేరింది. అదే విధంగా రేస్ ఎడిషన్ ధర కూడా రూ.850 పెరిగి ప్రస్తుతం రూ.88,800గా ఉంది.
టీవీఎస్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్న కస్టమర్లు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది. సిటీ, స్టేష్, ఆర్‌టీఓ ఛార్జీలు, ఇన్సూరెన్స్ లాంటి అంశాల కారణంగా ఆన్ రోడ్ ధరలు మారే అవకాశం ఉంటుంది. మొత్తంగా టీవీఎస్ స్కూటర్లలో అత్యధిక ధరల పెంపు ఆర్బిటర్ V1, ఐక్యూబ్ 3.5kWh వేరియంట్లలో ఉంది. మరోవైపు జుపిటర్, Ntorq మోడళ్లలో స్వల్ప పెంపు కనబడింది.
Read Also: భారత్ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?