British Horror Short Film: హారర్ సినిమాల్లో కొన్ని కథలు మన చుట్టూ ఉన్న సాధారణ ప్రదేశాలనే భయంకరంగా మార్చేస్తాయి. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన బ్రిటీష్ హారర్ షార్ట్ ఫిల్మ్ ‘The River’ (2022). ప్రశాంతంగా కనిపించే ఒక నది వెనుక దాగి ఉన్న భయంకరమైన జానపద కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా, పెద్ద సెట్స్, భారీ యాక్షన్ లేకుండానే వాతావరణం, సౌండ్ డిజైన్, మిస్టరీతో భయాన్ని పుట్టిస్తుంది. బ్రిటీష్ ఫిల్మ్‌మేకర్ లియామ్ బ్యాంక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా వైన్ కోర్డాస్ కథానాయికగా నటించారు. ముఖ్యంగా యూకే జానపద కథల్లో చెప్పుకునే జెన్నీ గ్రీన్‌టీత్ అనే నది రాక్షసి చుట్టూ కథ తిరుగుతుంది. మరి ఈ భయంకరమైన సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
కుటుంబంలో ఎదురైన కొన్ని తీవ్రమైన మనస్పర్థల కారణంగా సారా మానసికంగా కుంగిపోతుంది. కొంత ప్రశాంతత కోసం ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా హైకింగ్ చేస్తూ ఓ సుదూర ప్రాంతంలోని నది ఒడ్డుకు చేరుకుంటుంది. చుట్టూ అడవి, ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి జనసంచారం లేకపోవడంతో అక్కడ కొంత సమయం గడపాలని నిర్ణయించుకుంటుంది.
అయితే నదిపై ఉన్న ఓ పాత వంతెన దగ్గర ఆమెకు ఒక వింత హెచ్చరిక కనిపిస్తుంది. అందులో జెన్నీ గ్రీన్‌టీత్ గురించి ప్రస్తావన ఉంటుంది. జానపద కథల ప్రకారం నదుల్లో దాక్కుని ఉండే ఈ రాక్షసి, నీటి దగ్గరకు వచ్చే మనుషులను తన వశం చేసుకుని నది లోతుల్లోకి లాగేస్తుందని చెబుతారు. సారా మాత్రం ఆ హెచ్చరికను పెద్దగా పట్టించుకోదు.
మొదట నది చాలా అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రశాంతత ఎక్కువసేపు ఉండదు. చుట్టూ నిశ్శబ్దం పెరుగుతున్న సమయంలో ఎక్కడి నుంచో వినిపించే చిన్న పిల్లల పాట వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. నీటిలో అలజడి మొదలవుతుంది. సారాకు నీటి అడుగున ఏవో వింత ఆకారాలు కనిపిస్తాయి. తనను ఎవరో గమనిస్తున్నారనే భావన ఆమెను వెంటాడుతుంది.
భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించే సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. నది లోపల దాగి ఉన్న జెన్నీ గ్రీన్‌టీత్ తన ఉనికిని బయటపెడుతుంది. సారా ప్రాణాల కోసం పోరాడుతుంది. కానీ ఆ రాక్షసి ఆమెను నీటి లోతుల్లోకి లాగేస్తుంది.
అక్కడితో కథ ముగిసిందనుకుంటే అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. కొంతసేపటి తర్వాత నది మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. సారా కనిపించకపోవడంతో ఆమె భర్త ఆమెను వెతుక్కుంటూ నది దగ్గరకు వస్తాడు. ఇంతలో నీటిలో నుంచి సారా బయటకు వస్తుంది. ఆమెను చూసిన భర్త ఊపిరి పీల్చుకుంటాడు.
కానీ అతనికి తెలియని నిజం ఏమిటంటే.. నీటి నుంచి బయటకు వచ్చింది సారా కాదు. సారా రూపాన్ని ధరించిన జెన్నీ గ్రీన్‌టీత్. అసలు విషయం గ్రహించకముందే ఆ రాక్షసి అతనిపై దాడి చేసి నీటిలోకి లాగేస్తుంది. ఈ షాకింగ్ ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది.
ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రధాన ఆకర్షణ భయాన్ని నెమ్మదిగా పెంచే విధానం. నది అందాన్ని చూపించే విజువల్స్‌కు పూర్తి విరుద్ధంగా దాని అడుగున దాగి ఉన్న ప్రమాదాన్ని దర్శకుడు చూపించారు. నీటి శబ్దాలు, అడవి నిశ్శబ్దం, పిల్లల పాట, బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కలిసి టెన్షన్‌ను పెంచుతాయి. సారా పాత్రలో సారా వైన్ కోర్డాస్ యాక్టింగ్ బాగుంటుంది. The Riverను Superfreak Media అధికారిక చానల్ లో చూడచ్చు. YouTubeలో The River 2022 Short Film అని వెతికి చూడవచ్చు. సాధారణ దెయ్యాల కథలకు భిన్నంగా జానపద రాక్షసి నేపథ్యంలో సాగే చిన్నదైన, ట్విస్ట్‌తో కూడిన హారర్ కథలను ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.
Read Also: ఇది రివెంజ్ కాదు ఊచకోత… తండ్రి కోసం కొడుకు బ్లడీ బ్లడ్ బాత్… ఈ థ్రిల్లర్ మిస్ అవ్వొద్దు