Superhero Movie: సూపర్ హీరో అంటే ప్రజలను కాపాడే గొప్ప వ్యక్తి అనే భావన అందరికీ ఉంటుంది. కానీ నగరాన్ని కాపాడుతూనే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ, ఎప్పుడూ మద్యం మత్తులో తిరిగే సూపర్ హీరో ఉంటే ? అందరూ అతన్ని హీరోగా కాకుండా సమస్యగా భావిస్తే ? ఇలాంటి విభిన్నమైన కథతో తెరకెక్కిన హాలీవుడ్ సూపర్ హీరో యాక్షన్ చిత్రమే ‘Hancock’. తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
మన హీరో జాన్ హ్యాన్‌కాక్‌కు సూపర్ పవర్స్ ఉంటాయి. గాల్లో ఎగరగలడు. ఎంతటి ప్రమాదం వచ్చినా అతనికి ఏమీ కాదు. నేరస్థులను క్షణాల్లో పట్టుకునే శక్తి కూడా అతనికి ఉంటుంది. కానీ అతని ప్రవర్తన మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ మద్యం తాగడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నేరస్థులను పట్టుకునే సమయంలో భారీ విధ్వంసం సృష్టించడం వల్ల ప్రజలు అతన్ని హీరోగా కాకుండా తలనొప్పిగా భావిస్తారు. అతను చేసే సహాయం కంటే జరిగే నష్టం ఎక్కువగా ఉండటంతో నగరంలో అతనిపై అసహనం పెరుగుతుంది.
ఒకరోజు రే అనే పబ్లిక్ రిలేషన్స్ నిపుణుడి ప్రాణాలను హ్యాన్‌కాక్ కాపాడుతాడు. తనను రక్షించిన హ్యాన్‌కాక్‌లో ఉన్న మంచితనాన్ని గుర్తించిన రే, అతని ఇమేజ్‌ను పూర్తిగా మార్చాలని నిర్ణయించుకుంటాడు. ప్రజలకు నచ్చేలా ఎలా ప్రవర్తించాలి ? నిజమైన హీరోగా ఎలా మారాలి ? అనే విషయాల్లో అతనికి సహాయం చేయడం ప్రారంభిస్తాడు. మొదట ఈ మార్పులు హ్యాన్‌కాక్‌కు ఇబ్బందిగా అనిపించినా, క్రమంగా అతనిలో మార్పు కనిపించడం మొదలవుతుంది. ప్రజలు కూడా అతన్ని మరో కోణంలో చూడడం ప్రారంభిస్తారు. కానీ కథ అసలు మలుపు మాత్రం రే ఇంటికి వెళ్లిన తర్వాతే మొదలవుతుంది.
రే భార్య మేరీని చూసిన క్షణం నుంచి హ్యాన్‌కాక్‌కు విచిత్రమైన అనుభూతులు కలుగుతాయి. మరోవైపు మేరీ కూడా అతన్ని చూసి అసహజంగా ప్రవర్తిస్తుంది. ఇద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. క్రమంగా బయటపడే నిజాలు హ్యాన్‌కాక్ జీవితాన్నే మార్చేస్తాయి. అతను సాధారణ సూపర్ హీరో కాదని, వేల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న అమరుల్లో ఒకడని తెలుస్తుంది. అంతేకాదు… మేరీ కూడా అతనిలాగే అసాధారణ శక్తులు కలిగిన వ్యక్తేనని బయటపడుతుంది.
ఇద్దరి గతం, వారి మధ్య ఉన్న బంధం, ఒకరికి ఒకరు దగ్గరగా ఉంటే జరిగే పరిణామాలు కథను పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్తాయి. ఇప్పటి వరకు కామెడీగా సాగిన సినిమా ఒక్కసారిగా భావోద్వేగాలతో నిండిన కథగా మారిపోతుంది. చివరికి హ్యాన్‌కాక్ తన గతాన్ని పూర్తిగా గుర్తు తెచ్చుకున్నాడా ? మేరీతో ఉన్న వేల ఏళ్ల బంధం వెనుక దాగున్న అసలు నిజం ఏమిటి ? ఇద్దరూ మళ్లీ కలిసి జీవించగలిగారా ? లేక ప్రపంచాన్ని కాపాడటానికి మరోసారి విడిపోవాల్సి వచ్చిందా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘హాంకాక్’లో విల్ స్మిత్ ప్రధాన పాత్రలో నటించగా, షార్లిజ్ థెరాన్, జాసన్ బేట్‌మన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రస్తుతం Netflix, Amazon Prime Video ఓటీటీల్లో తెలుగు డబ్బింగ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మొదట నవ్విస్తూ సాగే ఈ సినిమాలో, చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. వీకెండ్‌లో ఒక డిఫరెంట్ సూపర్ హీరో మూవీ చూడాలనుకుంటే దీనిని మస్ట్ వాచ్.
Read Also: ప్రియుడిని చంపి పాతిపెట్టే సీఐ… ప్రియురాలు ఇచ్చే షాక్ కు దిమాక్ కరాబ్