కత్తి ఎవనికో ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా? ఇది కేసీఆర్ నోటి వెంట ఓడిన తరువాత వచ్చిన మాటలు. ఇవే మాటలను కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో ప్రజలనుద్దేశించి రిపీట్ చేస్తూ వస్తున్నారు. ఇదింకా ముదిరి.. కేసీఆర్‌ను ఓ వారం రోజులు సీఎం చేయాలి.. ఆయనే అన్నీ చేసి చూపిస్తారు..! అనే దాకా వచ్చింది పరిస్థితి.
అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేస్తాం.. ఓడితే ఏం చేయలేని నిస్సహాయులం .. అని చెప్పడం వారి ఉద్దేశ్యమయి ఉంటుంది. లేదంటే మమ్మల్ని ఓడగొట్టి.. వారిని గెలిపించారు. కానీ వారికి చేతనవ్వడం లేదు.. అందుకే మాకు అధికారం ఇచ్చి చూడండి.. ఎలా చేస్తామో చూడండి..!అని బీరాలు పడకడమూ కావొచ్చు.
జనాలకు ఈ విధంగా ఓ సంకేతము ఇవ్వడమూ కావొచ్చు. రజినీకాంత్ సినిమాలో ఓ ఊతపదం ఉంటుంది.. అదెంతటి పని జూజూపీ.. అంటాడు మాటిమాటికీ! ఇప్పుడు బీఆరెస్ కూడా అంతే.. అధికారం లేక కానీ.. లేదంటే.. మేమే అధికారంలో ఉంటే.. కేసీయారే సీఎం అయితే.. మేమే పాలిస్తే.. అంటూ చెప్పుకొస్తున్నారు.
ఇప్పుడు తాజాగా హరీశ్ వంతు కూడా వచ్చింది. కాళేశ్వరం పై మాట్లాడుతూ.. తనకు ఓ మూడు నెలలు ఇరిగేషన్ శాఖ మంత్రిని చేస్తే చాలట.. నీళ్లు పారిస్తా..! మీతో కాకపోతే చెప్పండి .. నేను చేసి చూపిస్తా..! నాకు జీతమొద్దు.. జీపు వద్దు.. ఫ్యాను వద్దు.. కారు వద్దు..అని అంటున్నాడు. అంటే ఒక్క పదవే కావాలట! మళ్లీ తనే అన్నాడు. అంటే.. పదవి కోసం కాదు.. ఓ పదమూడేండ్లు మంత్రిగా ఉన్నా..నాకు కొత్త కాదన్నాడు.
అసలు రేవంత్ కన్నా నేనే సీనియర్ తెలుసా.. ఆయనది ఇరవై ఏండ్ల ఇండస్ట్రీ అయితే.. నేను 23 ఏండ్ల ఇండస్ట్రీ అని తన గురించి కూడా ఓసారి జనానికి గుర్తు చేశాడు. ఒకే కుటుంబం.. అది అధికారం చెలాయించిన పార్టీ. పదేండ్లు పాలించిన పార్టీకి చెందిన కీలక నేతలు. పోయిన అధికారం కోసం.. ఓటమిని తరచూ తడిమి చూసుకుంటూనే.. అధికారం కోసం వెంపర్లాడినట్టే లేవు.. ఈ మాటలన్నీ! అనే చర్చ మొదలైంది.
కత్తి మా చేతికిస్తే ఎట్లా చేస్తామో తెలుసా? అని జనాలకు పదే పదే చెప్పడమే దీని ఉద్దేశ్యమైతే.. మరి పదేండ్లు కత్తి తింపారు కదా? ఎందుకు ఓడించినట్టు..! ఇది కూడా ఆలోచించి.. ఆత్మ పరిశీలన చేసుకుని, అహంకారం తగ్గించుకుని, చేసిన తప్పులు తెలుసుకుని, గ్గ..ట్టిగా చెంపలేసుకునే విధంగా మీ మాట తీరుంటే మరింత బాగుంటుందేమో! అప్పుడైనా జనాలు కనెక్టవుతారేమో! అనే డిస్కషనూ జరుగుతుందండోయ్..!
సరే, కత్తి మీ చేతిలో లేదు. మరి యుద్దం చేయరా? అంటే.. యుద్ధమంటే రెండు వైపులా ఉంటుంది కదా! ఇద్దరి దగ్గరా కత్తులుంటాయి కదా! మీ దగ్గర ప్రధాన ప్రతిపక్షమనే కత్తి ఉండనే ఉంది. ఎండగడుతా ఉండండి… జనాలకు చెబుతా ఉండండి.. జనాలతో మమేకమవుతా ఉండండి.. ఆ ఉద్యమాలు, నిరసనలు, ప్రశ్నలు, నిలదీతలే కదా కత్తులు.
మరి ఆ కత్తులు ఉపయోగించరా? అవి అంత మొండిగా ఉన్నాయా? యుద్ధానికి పనికి రావా? అధికారమనే కత్తే మీకు కావాలా? అయితే ఆగండి.. మీరు పదేళ్ల పాటు తిప్పిన కత్తుల విన్యాసాలకు గాయాల పాలైన జనం ఇంకా కోలుకోలేదు. ఆ గాయాలు మానలేదు. మానే దాకా ఆగండి.. పశ్చాత్తాపం ప్రకటించి క్షమాపణ కోరే ఆయింట్‌మెంటైనా రాయండి.. కానీ ఆగండి..! ఎప్పటిదాక అని మాత్రం అడక్కండి…!