కవిత మూడు పార్టీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మొన్న మొన్న పుట్టిన పార్టీ అంటే ఎందుకంత భయమని నిలదీశారు. జెండా గద్దెలు కూల్చడం, పోస్టర్లు చింపేయడం లాంటి గుండాగిరి, దాదాగిరీ పనులు తన దగ్గర నడవవని హెచ్చించారు. ఇదే లాస్ట్ వార్నింగ్ అన్నారు. మరోసారి ఇది రిపీట్ అయితే.. మా తడాఖా చూపిస్తామన్నారు.
మంగళవారం ముషీరాబాద్‌లో టీఆరెస్ జెండా పండుగలో ఆమె పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సభనుద్దేశించి మట్లాడారు. కొత్త పార్టీ ఏం చేస్తుందనే అనుమానం వద్దన్నారు. తన పార్టీ పాంచజన్యంలోని ఐదు పథకాలు పేద, మధ్య తరగతి వర్గాల మేలు కోరి రూపొందించినవని వివరించారు.
ఉచిత వైద్యం, ఉచిత విద్య ద్వారా ఆ కుటుంబం ఆర్థిక భారం నుంచి కాపాడి, అభ్యున్నతి దిశగా అడుగులు వేసేందుకు మేం వారిధిగా ఉంటామన్నారు. రైతులకు పెద్ద పీట వేస్తామని, సామాజిక తెలంగాణ సాధించి తీరుతామన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లలో చేసిందేమీ లేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఆడబిడ్డగా కొత్త పార్టీ పెట్టిన… తనకు కచ్చితంగా ఓ సారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు.
మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం తాను ఆలోచిస్తానన్నారు. తమ పార్టీని చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ పార్టీలు.. తమతో పనిలో పోటీకి రావాలని హితవు పలికారు కవిత. అభివృద్దిలో పోటీ పడి జనం మనుసు గెలుచుకోవాలని, మా పార్టీపై గుండాగిరీ చేయడం మానుకోవాలని సూచించారు.
రోజుకో కొత్త అంశంతో జనంతో కలిసి పోతున్నామని, వారి సమస్యలు తెలుసుకోవడమే కాదు… పరిష్కారమయ్యే వరకు పోరాడుతున్నామని, అదే తమ కొత్త పార్టీ ప్రత్యేక విధానమన్నారు.
ఉద్యమకారులకు అప్పటి పదేళ్ల పాలనలో న్యాయం జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదన్నారు.అందుకే రెండో తారీఖున ఉప్పల్ భగాయత్‌ను ముట్టడిస్తామన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇచ్చే దాకా పోరాటం ఆపమని, మరో మిలియన్ మార్చ్‌ను తలపించేలా ఉద్యమకారుల కోసం ఉద్యమం చేపడుతామని ఆమె చెప్పారు.
నిరంతరం జనం మధ్య ఉండే తనను ఆశీర్వదించి.. అండగా ఉండాలని, ఆడబిడ్డకు ఓసారి అవకాశం కచ్చితంగా ఇచ్చి చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.