అనుకున్నట్టే అయ్యింది. మొన్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నోటి వెంట ఈ క్షుద్రపూజల మాటలు వచ్చినప్పుడు మనం అనుకున్నాం.. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అధ్యక్షా ! అని. సీఎం ఈ విషయాన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందనే భావన అప్పుడు కలిగింది. కానీ ఆ వెంటనే ఆయన మహా వరుణ యాగానికి సిద్దం కావడంతో .. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి.. రాజకీయ అస్త్రంగా సర్కార్ వాడుకోనుందనే సిగ్నల్ వచ్చేసింది.
ఇంకా నయం.. అక్కడ వరుణయాగం తరువాత ఈ కామెంట్స్ చేస్తాడని అనుకున్నా. కానీ అలా చేయలేదు. బతికించాడు. కానీ వదులుతాడా…? నిన్న ఆ టాపిక్ ను ఎత్తుకున్నాడు. ఓ అస్త్రంగా సంధించాడు. అఘోరాలతో హరీశ్‌రావు పూజలు చేయించాడని. కరువు రావాలని, సర్కార్ పడిపోవాలని, మళ్లీ రావొద్దని. మళ్లీ అదే మాట సీఎంను అడుగుదాం. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా సీఎం గారు? మీరు కూడా నమ్ముతారా? లేక దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం మూలంగా కేసీఆర్, హరీశ్.. మొత్తానికి బీఆరెస్ ఓ మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతోందని తెలియజేయడానికేనా..?
కానీ అక్కడ నిజంగా పూజలు జరిగాయనడానికి ఆధారాలైతే లేవు. ఒకవేళ హరీశ్ ప్రభుత్వం కూలాలని పూజలు చేయించాడని అనుకుందాం. ఒక నిమిషానికి. కానీ ప్రభుత్వం మళ్లీ రావాలంటే మీ దగ్గరున్న ప్లస్ పాయింట్లేమిటీ? బీఆరెస్‌ను రానీయకుండా జనాలు మళ్లీ గుణపాఠం చెప్పాలంటే ప్రజల్లో ఇంకా ఉన్న బలమైన కారణాలేమిటీ? ఇవి కదా అసలు ప్రాక్టికల్ ముచ్చట్లు.
అంటే మన దగ్గర సబ్జెక్టు లేక.. అవతలోడిని మంత్రగాళ్లనే నెపం వేస్తున్నామా? ఇవి ఎలాంటి రాజకీయాలకు దారి చూపుతున్నాయి? ఇప్పుడు ఇవీ జనాల మధ్య వస్తున్న ప్రశ్నలు. చర్చలు.
కొత్త పింఛన్లు ఇస్తున్నారటగా.. వాటి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కదా? ఇండ్ల స్కీంపై ఇంకా బాగా బాగా వివరించొచ్చు కదా? రేషన్ కార్డులను ముద్రించి ఇస్తున్నామనే టాపిక్ ఉండనే ఉంది కదా! టిమ్స్ ఆస్పత్రిని మేమే మెరుగులు పరిచి పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామనే అంశాన్ని మీరే క్రెడిట్ కొట్టేయొచ్చు కదా? ఇంకా చాలా అంశాలే మాట్లాడొచ్చు.
పనిలో పనిగా బీఆరెస్ పార్టీ పాలనపైనా విమర్శించండి.. పర్వాలేదు. కానీ .. ఏకంగా బట్టకాల్చి మీదేసే రాజకీయాల వల్ల జనాలు ఎన్నో రోజులు వీటిని ఎంజాయ్ చేయరు. చీత్కరించుకునే పరిస్థితి వస్తుంది. ఇది కొంచెం హద్దులు దాటకుండా చేసుకోవాలి రేవంత్ సార్.
అధికారంలోకి రాకముందు చేసిన రకుల్‌రావు కామెంట్ ఎంత చీపుగా ఉందో.. పెండ్లాం మొగుళ్ల మాటలు దొంగచాటుగా వినే అలవాటైతే మాకు లేదు.. అని సీఎం హోదాలో కేటీఆర్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు వాడిన పదాలు అంతే చీపుగా ఉన్నాయి. పశుపతిలా నిన్ను ఫామ్‌హౌజ్‌లోనే బంధిస్తానని అనడం ఎంత ఎబ్బెట్టుగా ఉన్నాయో.. తెలుసు కదా చేతబడి తిరుగబడితే ఏమవుతుందో అనడం.. మీరు కూడా ఈ మూఢనమ్మకాల్ని బలంగా నమ్మి.. వాటిని ప్రోత్సహించి.. జనాలను కూడా అందులో ముంచేలా ఉన్నాయనడంలో సందేహం లేదు.
మన రాష్ట్రం పరువు గంగలో కలిపేందుకే ఇలాంటి రాజకీయాలు నడస్తున్నట్టున్నాయి బహుశా అని అనుకుంటున్నారు జనాలు. నవ్వెటోడి ముందు జారిపడ్డట్టే ఉన్నాయి ఈ వ్యవహారాలు అని కూడా అనుకుంటున్నారు.
ఎల్‌నినో ఎఫెక్టే లేదని మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ద్వారా మీరు ఎంత శాస్త్రీయ బద్దంగా ఆలోచిస్తున్నారో కూడా తెలియజేసినట్టయ్యింది జనాలకు.