స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకునే రోజు. కానీ ఈ దినాన్నీ వదల్లేదు. దంచి వదిలాడు. రాజకీయాలకు ఓ రోజంటూ ఉండదని, నిమ్మళంగా అలా ఎలా ఉండనిస్తామని అనుకున్నాడో ఏమో.. స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారు. పెడితే పెట్టారు. ఏదో అలా లాంఛనంగా ప్రారంభించి అయిందనిపించినా బాగుండేది.
ఓ బహిరంగ సభనే పెట్టుకున్నారు. బహిరంగ సభ పెట్టారంటేనే పొలిటికల్ ధూం ధూం ఉంటుందనే సంకేతమిచ్చారు. సరే, రోజూ తిట్టేవే కదా? నిత్యం జపిస్తున్నవే కదా.. దినామూ ఆరోపించుకుంటున్నవే కదా.. ! ఇవాళ కొంచెం చూసీ చూడనట్టుగా.. అనీ అననట్టుగా.. తిట్టీ తిట్టనట్టుగా.. ప్రసంగించి ఫినిష్ చేస్తే అయిపోయేది.
కానీ అదేదో బీఆరెస్‌ను ఫినిష్ చేసేందుకు డిసైడ్ అయిన సభలా.. ఒక్క సబ్జెక్టు మీద కాదు… ఎక్స్ రే తీసినట్టుగా పదేళ్ల పాలన గురించి వరుస బెట్టి , విమర్శలతో చుట్టు ముట్టి , తిట్టుకుంటూ ముందుకు సాగి.. పంద్రాగస్టు పంచులు వేసి.. పాపం ఇక వదిలేయండి.. అని జనాలు ముఖం చిట్లించేదాకా చూసీ.. అప్పుడు గాని ముగించలేదు.
ఉద్యోగాలిస్తామన్నారు. ఇకపై ఆరు నెలలకోసారి నోటిఫికేషన్లు వస్తాయి.. చూస్కోండని అన్నారు. బాగానే ఉంది. కానీ మాయలోడి మాటలు నమ్మకండనే సూచన కూడా చేశాడు. రైతులకు ఏమేమీ ఇచ్చారో అన్నీ ఏకరువు పెట్టారు. మీకన్నా మేమే ఎక్కువిచ్చిన్నమన్నడు. కావాలంటే అసెంబ్లీలో చర్చ పెడదాం రా.. అని కవ్వించాడు.
నీ డబుల్ బెడ్ రూం ఇండ్లు డబ్బా ఇండ్లన్నడు. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరే లేదన్నడు. కావాలంటే.. ఈ స్కీమ్ మీదనే ఓట్లకు పోదామా? వస్తావా? అని కయ్యానికి కాలు దువ్వాడు. మేము పాలపిట్ట చీరలిచ్చినమన్నడు. మీరు బతుకమ్మ చీరలల్ల కూడా కమీషన్లు కొట్టి.. ఆ పాపం తలిగి ఫామ్‌హౌజ్‌ల పన్నరు అని అన్నడు. అంటే అన్నడు.. కానీ చివర్ల ఛీ మీ బతుకులు చెడా! అని కూడా తిట్టిండు.
స్కీములన్నింటి మీద మాట్లాడిండు. పరిపాలనలను పోల్చి చూపాడు. సరే, ఇకనైనా ముగిస్తాడేమో అనుకుంటే.. చిట్ట చివర్న మళ్లా ఆ చేతబడుల ముచ్చట అందుకున్నడు.
రాష్ట్రాన్ని, ప్రజలను ఆగం చేసేందుకే హరీశ్‌రావు రహస్య పూజలు చేశాడన్నడు. కాదా? అయితే ఆ రోజు నువ్వు ఎటెటు తిరిగినవు.. ఏయే గుడులల్ల పూజలు చేసినవ్.. ఆ పూజరులెవరు..? అన్నీ అన్నీ బయటపెట్టు.. దమ్ముంటే! అని సవాల్ విసిరిండు.
గిట్ల అఘోర పూజలు చేపిచ్చొటోళ్లా రాజ్యాన్ని పాలించేది..? అని జనాలు తిట్టుకునేలా, చీధరించుకునేలా.. అసలు వాళ్లకు పరిపాలించే హక్కే లేదనేలా తిట్టి.. ఉన్నదున్నట్టు అన్నీ చెప్పిన.. ఇక జనాల ఇష్టం అనేలా ప్రసంగించి..మళ్లా మేమే వస్తామంటూ జనం సాక్షిగా .. పంద్రాగస్టు వేదికగా ప్రకటించి పరిసమాప్తం చేశాడు. ఇదీ పంద్రాగస్టు వేళ పంచుల ప్రసంగాల పరమార్ధం.