నిజామాబాద్ ఎంపీ నోటి దురుసు చేష్టలు హద్దులు దాటాయి.. పొద్దున లేస్తే లీడర్లను తిట్టీ తిట్టీ బాగా అలవాటైంది. ఆ తిట్లే తనను ఇంతటి వాడిని చేశాయని గట్టిగా నమ్మేవాళ్లలో అర్వింద్ మొదటి స్థానంలో ఉంటాడు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే తిరబడతాడు. ఎదురు దాడికి దిగుతాడు. మీడియా ఇంటర్వ్యూలలో కూడా ఇదే దోరణి కనిబడుతూ ఉంటుంది.
ప్రశ్నకు ప్రశ్నే సమాధానం చెప్పడం మూలంగా తప్పించుకోవడం ఓ వ్యూహమైతే.. అవతలి వారిని డిఫెన్స్‌లో పడేయాలనే ఎత్తుగడ కూడా ఉంటుంది అతని ప్రవర్తనలో. ఇలాంటి వ్యవహార శైలే అతన్ని ఎప్పుడూ వైరల్ నేతగా వార్తల్లో ఉంచుతుంది. కానీ అది అప్పుడప్పుడు హద్దులు మీరుతూ ఉంటుంది. సీఎంలపై కూడా తన వాచాలతను ప్రయోగిస్తాడు. పెద్దోళ్లను తిడితే తానూ ఆ లిస్టులోనే ఉంటాననే భావన కావొచ్చు.
కానీ ఇది హద్దులు మీరి.. విలేకరుల మీదా తన తిట్ల దండకాన్ని ప్రయోగించేదాకా పోయింది పరిస్థితి. తాజాగా అర్వింద్ ఓ విలేకరిని బేవకూఫ్ అని తిట్టే ప్రెస్‌మీట్ వీడియో వైరల్ అవుతోంది. ఓ ప్రశ్నను అర్వింద్‌పై సంధించడమే అతని చికాకుకు, వాచాలత్వానికి కారణమైంది. ఫలితంగా ఆ విలేకరిని అందరి ముందు బేవకూఫ్.. ఒక్కసారి చెబితే వినాలి.. మళ్లీ మళ్లీ అదే అడుగుతావు.. నేను ఇప్పుడే చెప్పాను కదా? వాడి గురించి నన్ను అడగకండి.. ( ఇక్కడ వాడు అంటే టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్). ఓ కౌన్సిలర్‌గా కూడా గెలవనోడి గురించి నన్ను అడుగుతారా? అంటూ మండిపడ్డాడు.
ఇది ఇప్పుడు హైదరాబాద్ మీడియా సర్కిళ్లలో వైరల్ అవుతోంది. అర్వింద్ వైఖరిపై మండిపడుతున్నాయి జర్నలిస్టు సంఘాలు. ఇంత అహంకారమా? మీడియా కూడా కంటికి కానరావడం లేదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా నిజామాబాద్‌కు చెందిన ఐ న్యూస్ స్టాఫర్‌గా పనిచేసిన పంచరెడ్డి శ్రీకాంత్‌ను కూడా ఇదే విధంగా మాటల దాడి చేశాడు అర్వింద్.
తను అప్పుడు హన్‌మాన్ దీక్ష తీసుకుని ఉన్నాడు. స్వామి మాలలో ఉన్నాడని కూడా చూడకుండా.. అతని ప్రశ్నలను తట్టుకోలేక.. ఆపవయ్యా నీ సోది.. నా దగ్గర ఇవన్నీ మాట్లాడొద్దు.. ! అని అవమానించిన తీరులో మాట్లాడటంతో ఈ జర్నలిస్టు.. ఎంపీ వైఖరికి నిరసనగా ఆ ఇంటర్వ్యూను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు.
ఈ ఉదంతంపై నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మండిపడ్డారు. ఇదేం తీరు.. ప్రజా ప్రతినిధులు ఇలా ఉంటారా? మీడియాపైనా నీ ప్రతాపమా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు చేసేది తక్కువ కానీ, ఇలా మాటలతో ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తారనే కోవలో చేరిపోయాడు అర్వింద్.
మొన్నటికి మొన్న ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. షోరూంలపై దాడి చేయండి… స్కూటీలు ఎత్తుకెళ్లండి.. కాంగ్రెస్ నాయకుల మెడలో బంగారు చైన్లను లాక్కెళ్లండని ఉచిత సలహా ఒకటి ఇచ్చేసి వైరల్‌గా వార్తల్లో నిలిచాడు. సరే, మీ రాజకీయ ఎత్తుగడ అదే అయితే అదే ఫాలో కండి.. అది మీ ఇష్టం.. మీ రాజకీయ భవితవ్యం మీ చేతల్లో, మీ వ్యవహార శైలిలో ఉంటుంది.. కానీ మీడియా పట్ల కూడా ఎందుకా చిన్నచూపు.. ఏమిటా మాటలు..? అనే విమర్శలు చుట్టుముడుతున్నాయి కాషాయ పార్టీ లీడర్లకు.