ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. (సర్)పై కేంద్రం ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల్లో పారేలా లేవు. బీజేపీ అనుకూల ఓటర్ల సంఖ్య పెంచడం.. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని గల్లంతు చేసే కార్యక్రమం ఇకపై సర్ ద్వారా ఇక్కడ చెల్లుబాటు అయ్యేలా లేదు. అంతటా ఓ లెక్క… ఇక్కడో లెక్క.. అన్న మాదిరిగా పార్టీలు అప్రమత్తమయ్యాయి. వాస్తవానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంత సీన్ లేదు. కొంత ఏపీలో బీజేపీ ఓట్లు టీడీపీకి పోలరైజ్ అయ్యే అవకాశాలుంటాయి.
ఇక వైసీపీ .. తన క్రిష్టియన్ ఓట్లను గంపగుత్తగా కాపాడుకునే ప్రయత్నంలో అలర్టయ్యింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పట్నుంచో దీనిపై అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ మొదటి నుంచి సర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. దీని వెనుక ఉన్న బీజేపీ వ్యూహాన్ని జనాలకు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దీనిపై షెడ్యూల్ విడుదల కాగానే టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలంతా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఒక్క ఓటు కూడా నోటీసు ఇవ్వకుండా.. ఓటరుకు సమాచారం లేకుండా తొలగించడానికి వీలు లేదనే ప్రధాన డిమాండ్‌ను పెట్టారు.
దీంతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ముందు ఈ సర్ విధానాన్ని హడావుడిగా మొదలు పెట్టారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు లేవు కాబట్టి నెమ్మదిగా, పారదర్శకంగా చేయాలనే డిమాండ్ కూడా తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లింది. అయితే మొదట కాంగ్రెస్ స్పందించినంతగా.. బీఆరెస్ పార్టీ దీనిపై స్పందించలేదు. ప్రధానంగా సర్ విధానంతో ముస్లిం ఓట్లే పెద్ద ఎత్తున గల్లంతవుతాయనే ప్రచారం ఉంది. కానీ వాస్తవంగా, ముస్లింలతో పాటు.. దళితులు, క్రిష్టియన్లు… ఇలా నిబంధనల మేరకు లేని ఓటర్లను పెండింగ్ లిస్టులో పెట్టి అనధికారికంగా వీటిని తొలగించేస్తున్నారు. అదే జరిగింది ఇతర రాష్ట్రాల్లో. ఓటేసేందుకు వెళ్లేదాకా ఆ ఓటరుకు తెలియదు.. నోటీసు బోర్డు మీద మీ ఓటును సర్ పెడింగ్‌లో పెట్టిందని చూసుకుని అవాక్కయ్యారు.
ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి అన్ని పార్టీలు. ఇప్పుడు లేటుగానైనా బీఆరెస్ కూడా మేల్కొంది. ముస్లిం మైనార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు. దీంతో వీరంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని ఊహించింది. అందుకే ఇది తమకు పెద్దగా ఉపయోగపడే ప్రక్రియ కాదనుకుంది. కానీ ముస్లింలలో కొందరు.. వీరితో పాటు క్రిష్టియన్లు.. ఇతర లోకల్ ఓటర్లు బీఆరెస్‌కు అనుకూలంగా, సానుభూతితో ఉన్నవారిని కాపాడుకునేందుకు రంగంలోకి దిగక తప్పలేదు. అందుకే బూతుల వారీగా ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నది. సేమ్ కాంగ్రెస్ కూడా అంతే. పోలింగ్ బూతుల వారీగా అక్కడ లోకల్‌గా గతంలో పనిచేసిన ఏజెంట్లను నియమిస్తున్నారు.
వీరే అక్కడి ఓటర్లను గుర్తుపడతారు. బోగస్ ఓటర్లుండే అవకాశమే లేదు. కానీ… కొందరిని కావాలని పెండింగ్‌లో పెడితే.. ఆ ఓటరు ఏ పార్టీ సానభూతిపరుడో ఆ ఏజెంటు గుర్తించగలుగుతాడు. ఒకవేళ తమ పార్టీ ఓటరే అయి ఉండి.. అతని ఓటును ఏదైనా కారణంతో పెండింగ్‌లో పెడితే.. వెంటనే ఆ పార్టీ బూత్ ఏజెంట్ అలర్టవుతాడన్నమాట. ఆ ఓటను మళ్లీ రిజిష్టర్ చేయించుకునేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్‌ను సమర్పించడం.. అది మళ్లీ ఓటరు లిస్టులో చేరే వరకు క్రాస్ చెక్ చేసుకోవడం ఓ చర్యగా పెట్టుకుంటారు. అలా ఏ పార్టీకి చెందిన ఓటరును.. ఆ పార్టీ ఏజెంటు చూసుకోవాల్సిందే. తొలగించిన ఓటర్ల లిస్టుపై బీఆరెస్, కాంగ్రెస్‌లు దృష్టి పెడతాయి.
ఆ ఓటర్లలో తమ పార్టీ ఓటర్లెవరో గుర్తించడం.. ఆ వెంటనే రంగంలోకి దిగి దాన్ని మళ్లీ ఓటరు జాబితాలోకి ఎక్కించడం.. ఇవన్నీ చేయాల్సింది ఆ బూతు ఏజెంటే. పోలింగ్ సమయంలో ఓటేసేందుకు వచ్చే ఓటరును అక్కడి బూతు ఏజెంటే గుర్తుపడతాడు. వారు ఎవరి వైపున్నారో కూడా అంచనా వేయగలిగేది కూడా అతనే. అందుకే ఈ రెండు పార్టీలు బూత్ ఏజెంట్లనే నమ్ముకున్నాయి. ఎంఐఎం కూడా హైదరాబాద్ పాతబస్తీతో పాటు తాము బలంగా ఉన్న ఏరియాల్లో ఏజెంట్లను సిద్దం చేసుకున్నది.
ఈ సర్ ప్రక్రియను ఏడాది పాటు కొనసాగించి.. నిజమైన ఓటరు తన ఓటును కోల్పోకుండా చూడాలని, అది ప్రభుత్వాల బాధ్యతని ఎన్నికల కమిషన్‌ను టీజేఎస్ అనుబంధ సంఘం.. యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా ఇవాళ డిమాండ్ చేశారు.