ఇది చాలా సిల్లీ లొల్లి. ఇంటి పంచాయితీ. గల్లీ లెవల్ లొల్లన్నమాట. టీపీపీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సొంత గడ్డ నిజామాబాద్ లీడర్ల పంచాది. ఇప్పుడిది ఢిల్లీ చేరింది. కారకులు .. సీనియర్ మైనార్టీ లీడర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నోరు జారిన ఫలితం! మహేశ్ మీద విపరీతమైన కోపముంది షబ్బీర్‌కు. తన ఇలాఖ కామారెడ్డిలో గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అనే లీడర్‌ను తీసుకొచ్చి తనకు పక్కలో బల్లెంలా పెట్టాడని. అంతే కాదు .. తాను పోటీ చేసిన నిజామాబాద్‌కు రావడాన్ని పూర్తిగా కంట్రోల్ చేశాడని. ఎవరెక్కడ పోటీ చేస్తే అక్కడే ఇంచార్జిగా ఉంటారు.
కానీ షబ్బీర్‌ది కామారెడ్డి. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి పోటీ చేశాడు. దీంతో అతన్ని మహేశ్ గతంలో పోటీ చేసిన నిజామాబాద్‌కు పంపారు. మహేశ్ పోటీ నుంచి తప్పుకుని షబ్బీర్‌కు చాన్స్ ఇచ్చాడు. ఓడిపోయాడు షబ్బీర్. అయినా పిలవని పేరంటానికి వచ్చినట్టు నిజామాబాద్‌లో తిష్టవేశాడు. అక్కడో ఆఫీసు కూడా తీసుకున్నాడు. ఇది మహేశ్‌కు నచ్చలేదు.
వాస్తవానికి, అంతకు ముందు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి.. షబ్బీర్‌ను కామారెడ్డికే పరిమితం చేయడంతో పాటు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మహేశ్‌ను ఇంచార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇది జరిగిన కొద్ది రోజులకే మహేశ్‌కు పీసీసీ చీఫ్ పదవి వచ్చింది. దీంతో షబ్బీర్ మళ్లీ నిజామాబాద్‌పై పెత్తనం స్టార్ట్ చేశాడు.
నీ నియోజకవర్గం నువ్వు చూసుకో పో! అని మొన్న మున్సిపాలిటీలో గట్టిగానే చెప్పాడు. దీంతో నిజామాబాద్‌కు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇది సరిపోదంటూ.. తనపై పెత్తనానికి ఓ లీడర్‌ను తీసుకొచ్చి నెత్తిన పెట్టాడనే ఫీలింగులో షబ్బీర్ ఉన్నాడు. దీంతో తిక్కరేగి ఇలా.. రాత్రి ఎవరో తప్పతాగి ఫోన్ చేసిన ఓ సాదాసీదా లీడర్‌తో తన ఫ్రస్ట్రేషన్ అంతా కక్కుకుని పలుచనై, దిగజారి పోయిన రాజకీయాలు నడిపాడనే ఆరోపణలు మూటగట్టుకున్నాడు షబ్బీర్.
మహిళా లీడర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. కాంగ్రెస్ ఎవరు పైసలిస్తే వారికి పదవులు ఇస్తుంది..! అని అనడం వివాదమైంది. ఓ రకంగా ఈ కామెంట్లలో మహేశ్‌ను లాక్కొచ్చాడు పరోక్షంగా. అందుకే ఇది ఇంత పెంటై కూర్చున్నది. రచ్చ ఢిల్లీకి పోయింది. మహేశ్ షోకాజ్ ఇచ్చాడు. కానీ సస్పెండ్ చేసేంత సీన్ అక్కడ ఉన్నట్టు కనిపించడం లేదు. ఉన్న ఏకైక సీనియర్ మైనార్టీ లీడర్. రిటైర్‌మెంట్‌కు దగ్గరపడ్డ నాయకుడు. అతన్ని సస్పెండ్ చేయడం మూలంగా పార్టీకి నష్టమే కానీ లాభమైతే లేదు.
ఇలాంటివి కాంగ్రెస్‌లో కామన్ అని అనుకుంటే వదిలేస్తారు. కానీ ఇక్కడ మహేశ్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇష్యూ కావడంతోనే ఈ వివాదం మరింత వేడెక్కింది. సీనియర్లు అయినా.. పార్టీకి వ్యతిరేకంగా, నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఎవరినీ వదలం.. అనేలా డీఎస్‌ను అసలే పట్టించుకోలేదు అధిష్టానం. షబ్బీర్ ను కూడా అలాగే ట్రీట్ చేస్తారా? మహేశ్‌తో రాజీ కుదుర్చుతారా? మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ… లీకేజీ లీడర్లపై సీఎంకు పెద్ద తలనొప్పి వ్యవహారమై కూర్చుంది.
ఇప్పుడిది. అయితే సీఎం రేవంత్, లేదా మహేశ్ చుట్టూ కాంగ్రెస్ వివాదస్పద రాజకీయాలు తిరుగుతున్నాయి ఇప్పుడు. కొద్ది రోజులు నడుస్తుంది ఈ లొల్లి. ఆ తరువాత సైలెంట్. కొత్త ఇష్యూ తెరపైకి వస్తుంది. తెస్తారు. కాంగ్రెస్‌లో అంతే.. కాంగ్రెస్‌లోలో అంతే! అనుకోవాలి మనం.