ఇప్పుడు ఎన్నికల సమయం కాదు. కానీ మాజీ సీఎం, సీఎంల మధ్య మాటల పోరు పతాక స్థాయికి చేరుకున్నది. కేసీఆర్ బయటకు రావడం.. విమర్శలు చేయడం సహజమే. కానీ దీన్ని లైట్‌గా తీసుకోవడం లేదు రేవంత్. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే విధానాన్ని అమలు చేస్తున్నారు రేవంత్. మొన్న జగిత్యాల సభ నుంచి ఈ ట్రెండ్ రాష్ట్రంలో కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ సభ ఓ వైపు.. రేవంత్ సభ మరోవైపు. అక్కడే ఆ వేదిక మీదే కేసీఆర్‌కు కౌంటర్ ఇవ్వడం ద్వారా తానేం తక్కువ తినలేదనే భావనను వదిలారు రేవంత్.
అందరినీ చూశుంటావు..! నన్ను చూడలేదు.. ఇదిగో నాతో వ్యవహారం ఇలా ఉంటుందని చెప్పడం రేవంత్ ఉద్దేశ్యమై ఉంటుంది. అందుకే ఎవరేమన్నా.. కొన్ని విమర్శలు వచ్చినా తన పంథాలో తాను వెళ్తున్నారు రేవంత్. మొన్నటి జగిత్యాల సభ మాదిరిగానే పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకున్న ఈ ఇరువురు.. ఇవాళ కూడా అదే పంథాలో రాజకీయంగా విమర్శలు, కౌంటర్లతో వేడెక్కించారు. ఓ వైపు తెలంగాణ భవన్‌లో కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రతినిధుల సమావేశంల పాల్గొని మైకందుకుని చెడామడా తిట్టిపోస్తుంటే.. ఆ మరుక్షణమే అక్కడ సీఎల్పీ నుంచి మీడియా ప్రతినిధుల చిట్‌చాట్ ద్వారా తన మాటల తూటాలను వదులుతూనే ఉన్నారు రేవంత్.
కేసీఆర్ ప్రతి మాటకూ ధీటుగా సమాధానమిస్తు వస్తున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. ఏ కొంచెం కూడా ఆలస్యం చేయడం లేదు. ఇతర నేతలకూ చాన్స్ ఇవ్వడం లేదు. తానే నేరుగా రంగంలోకి దిగారు. కేసీఆర్ ప్రతి విమర్శకు, ఆరోపణకు ఆయన ఘాటుగా, ధీటుగా సమాధానమిస్తున్నారు. మొన్న జగిత్యాల సభలతో హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు.. మళ్లీ ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్ మీటింగుతో మరింత హీటెక్కాయి. మధ్యలో కవిత కొత్త పార్టీ.. కేసీఆర్‌పై చేసిన కామెంట్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. కవిత మాటలకు కేసీఆర్ స్పందించాలని ఆయన్ను డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేశారు రేవంత్. ప్రధానంగా కేసీఆర్ రాజకీయంగా డబుల్ స్టాండర్డ్ విధానాలను ఈ సందర్బంగా రేవంత్ ఎండగట్టారు.
లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటు పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ మాట్లాడలేదని, వారిని వెధవలతో సంబోధించడం పై రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. కడియం కావ్య మాట్లాడిన మాటలు వినలేవా? అని ప్రశ్నించిన ఆయన.. రాజ్యసభలో మీ వాళ్లేం చేశారు? అని నిలదీశారు. ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిపితే మీరేం చేశారు? బీజేపీకి ఎందుకు అడగడం లేదన్నారు. అంతే కాదు.. బీజేపీతో పొత్తు పెట్టుకోబమని దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతావా? అని కేసీఆర్‌ను ఇరుకున పెట్టే ప్రయత్న చేశారు రేవంత్. భవిష్యత్ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని, కూటమిగా ఏర్పడటం ఖాయమని ఆయన క్లారిటీ ఇవ్వడం కూడా కేసీఆర్‌ను డిఫెన్స్‌లో పడేసినట్టయ్యింది. ఇలా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారో లేదో… అలా రేవంత్ నుంచి కౌంటర్లు జెట్ స్పీడ్‌తో వచ్చేస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇంకా ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.