సీఎం రేవంత్ వ్యూహం ఫలించింది. కిషన్‌రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కేంద్రాన్ని తూట్లు పొడిచేలా తూటాల్లా పేలిన మాటలు పనిచేశాయి. కేంద్రం దిగి వచ్చింది. కిషన్‌రెడ్డి స్టాండ్ మార్చుకున్నాడు. తెలంగాణలో తననో భూతంలా, విలన్‌లా చూపే ప్రయత్నానికి చెక్ పెట్టాలనుకున్నాడు. అందుకే రా .. నాయనా.. కల్పిస్తా.. మాట్లాడుకో..! అని మర్యాదగా మధ్యవర్తిత్వం వహించాడు. ఇదే కదా రేవంత్ కోరుకున్నది.
మంచి మాటలకు చింతకాయలు రాలుతాయా? రేవంత్ తిట్లకు రాలాయి. అందుకే మొన్నటికి మొన్న మహారాష్ట్ర పోయిన కిషన్‌రెడ్డి.. అక్కడేం చెప్పాడో తెలియదు. తుమ్మిడిహట్టిపై ఓ సారి మాట్లాడరాదు..! మధ్యలో నన్ను వాయిస్తున్నాడని అని ఉంటాడు బహుశా. అక్కడి నుంచి కూడా రేపోమాపో రేవంత్‌కు కబురు అందేలా ఉంది. ఇక మనం చెప్పుకోబోయే తాజా అంశం.. హైదరాబాద్ మెట్రో.
దీనిపై తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం. ఎల్అండ్‌టీ కంపెనీ నుంచి ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకున్నది. దీనిపై రుణం తీసుకునే విషయంలో అంతా ఓకే అయిన తరువాత కేంద్రం మొండికేసింది. ఇక రెండో ఫేజ్ మెట్రో పనుల విస్తరణపైనా ఓ కదలిక వచ్చింది. దీంతో ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. మొన్నటి దాకా ఈ మెట్రో లైన్ పూర్తిగా బీఆరెస్ హయాంలోనే నడిచిందనే పేరుండె. దీన్ని ఇప్పుడు రేవంత్ సర్కార్ మార్చబోతుంది.
రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు వేసే విస్తరణ పనులను కూడా రేవంత్ సర్కార్ ఆపేసింది. సర్కార్ కొత్త ప్లానింగ్‌తో ముందుకు సాగనుంది. అయితే, కేంద్రం రేవంత్ మాటలను పట్టించుకుంటుందా? లైట్ తీసుకుంటుందా? అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడ కొడితే టార్గెట్ రీచ్ అవుతుందో బాగా తెలిసిన రేవంత్.. గురి అక్కడే పెట్టారు. ఇక్కడ తెలంగాణలోకీలక నేతగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని ఇందులో ఇరికించారు. దీని ద్వారా బీజేపీ తెలంగాణకు పూర్తిగా బద్ద శత్రువనే విధంగా ఇక్కడి సమాజానికి సంకేతమిచ్చేలా రేవంత్ ప్రతి చర్యనూ వివరిస్తూ వస్తున్నారు.
దీంతో ఇది కిషన్‌రెడ్డికే కాదు.. రేపు తెలంగాణపై గంపెడాశలు పెట్టుకున్న పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుందనే అంచనాలకు వారొచ్చారు. ఈ విషయాన్ని కిషన్‌రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి సూచిస్తూ రావడంతో .. కేంద్రం దిగిరాక తప్పలేదు. దీంతో ఇలా భేటీలకు అపాయింట్‌మెంట్లు దొరికాయి. చకాచకా పనులూ అయిపోతూ వచ్చాయి. మొత్తానికి చర్చలు ఫలప్రదమయ్యాయి. రేవంత్ అనుకున్నది సాధించారు. కిషన్‌రెడ్డికి కూడా బిగ్ రిలీఫ్ దొరికింది.
ఈ మెట్రో పనులు ఓ కొలిక్కి వచ్చాయి… ఇక ధాన్యం కొనుగోళ్ల అంశమే ఒకటి మిగిలుంది. మరి దీన్నేం చేస్తాడో కిషన్‌రెడ్డి. దీనికీ ఏదో ఒక దారి వెతికే ఉంటాడనిపిస్తోంది.