తెలంగాణలో పోటీ చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నది జనసేనా! కేంద్ర పెద్దల దిశానిర్దేశంతో పోటీ చేయడం అనివార్యమే అని డిసైడ్ అయిపోయిన పవన్ కళ్యాణ్.. తన ఎంట్రీనే రచ్చ రచ్చ చేసుకున్నాడు. ఇది అతని పార్టీకి ప్రతికూలంగా మారనుంది. కాగా ఇవాళ తెలంగాణ జన సేన నేతలను ఢిల్లీకి పిలిపించుకున్నాడు పవన్. రేపు.. సోమవారం అక్కడే రహస్య మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాడు. తెలంగాణలో ఎలా పోటీ చేయాలి? వ్యూహాలేమిటీ? అనే అంశాలపై సమాలోచనలు జరపనున్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని అమిత్ షా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు.
దీంతో పవన్ జనసేనా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. తెలంగాణ మీ అయ్య జాగీరా అనే కామెంట్స్ తెలంగాణ వాదుల్లో ఆగ్రహాన్ని తెచ్చిపెట్టినా .. ఇక్కడి సెటిలర్లలో కొంత సానుభూతిని, సపోర్టును ప్రోది చేసిందనే చెప్పాలి. అయితే ఢిల్లీలో మీటింగు పెట్టుకోవడమెందుకు? ఏపీలోనే ఏదో ఒక చోట పెట్టుకోవచ్చు కదా? అనే చర్చ మొదలైంది. కానీ అక్కడ చంద్రబాబు ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించేలా లేడు. దీంతో పాటు ఇక్కడ తెలంగాణలో మీటింగ్ పెట్టుకోవడం మూలంగా మళ్లీ కావాలనే రెచ్చగొట్టేందుకే వచ్చాడనే ప్రచారం జరిగితే మొన్నటి చేదు అనుభవాలు రిపీట్ కావొచ్చనే అనుమానాల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఓ రకంగా ఢిల్లీ బీజేపీ పెద్దల సూచనలను కూడా ఈ రహస్య మీటింగులో చర్చించి.. ఎన్నికల స్ట్రాటజీపై చర్చించే అవకాశం ఉంది. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా తమ సత్తా చూపాలనేది బీజేపీ గట్టిగా నిర్ణయించుకున్నది. కీలకమైన హైదరాబాద్‌లో పట్టు సాధించే క్రమంలో జనసేనా సపోర్టు తీసుకుని మెజారిటీ సీట్లు సాధించడం మూలంగా తెలంగాణలో తాము బలంగా ఉన్నామనే సంకేతాలివ్వాలనుకుంటున్నది.
ఇదే విధానాన్ని.. పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కూడా భావిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎవరి దారి వారిదే అయినా.. బలం పెంచుకునే పనిలో ఇటు బీజేపీ, అటు జనసేనా పోటాపోటీగా జనంలోకి వెళ్లనున్నాయి. రేపు ఒకవేళ ఢిల్లీ మీటింగు అనంతరం తెలంగాణలో తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తే.. ఆ ప్రకటనకు అనుగుణంగా ఇక్కడి నేతలు స్పందించనున్నారు. రెచ్చగొట్టే దోరణిలోనే పవన్ ప్రకటనలు కొనసాగితే.. అదే రీతిలో దూకుడుగానే కౌంటర్ ఇవ్వాలని అందరూ రెడీగా ఉన్నారు.
ఇది కూడా ఆ పార్టీ వ్యూహంలో భాగమే కావొచ్చంటున్నారు. ఎలాంటి సంస్థాగత బలం లేకున్నా.. ఎక్కడా పార్టీ నిర్మాణం లేకున్నా.. ఏకంగా ఎన్నికల ద్వారా బరిలోకి దిగేందుకు చూస్తున్న జనసేనా.. ఇలా తనదైన శైలిలో రెచ్చగొట్టే రాజకీయాలకే తెగబడుతుందా? తెలంగాణ జనం ఆమోదం, సానుభూతి కోసం పంథా మార్చుకుని ముందుకు సాగుతుందా చూడాలి.