Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: ఇంతకాలం స్తబ్ధతగా ఉన్న పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. పదేళ్ల పాటు పవర్ ను కాపాడుకోవాలని కాంగ్రెస్, పోగోట్టుకున్న పట్టును మళ్లీ సాధించాలని బీఆర్ఎస్.. ఇలా రెండు పార్టీలు తమ పొలిటికల్ యాక్టివిటీస్ ను స్పీడప్ చేశాయి. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుంటే, సుస్థిరమైన పాలన అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ తన ప్రణాళికలను ఫిక్స్ చేసింది. అయితే తాజాగా ప్రతిపక్ష నేత కేసీఆర్ జగిత్యాల సభకు వచ్చి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు విసరడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగులు వేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని టీ పీసీసీ అంతర్గత ఆదేశాలిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, సమన్వయ కర్తలంతా ప్రభుత్వం పై విమర్శలు రాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని గాంధీభవన్ నుంచి ఆయా నేతలకు సంకేతాలు వెళ్లాయి.
ఇన్ చార్జ్ మంత్రులతో కలిసి ప్రభుత్వంపై డ్యామేజ్ జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ వర్గాలు వివరించాయి. ప్రతిపక్ష నేతలకు విమర్శలు కురిపించేందుకు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చింది. ఒక వైపు ప్రభుత్వం చేస్తున్న డెవలప్, అమలు చేస్తున్న స్కీమ్స్ ను జనాల్లోకి తీసుకువెళ్తూనే.. ప్రతిపక్ష పార్టీల యాక్టివిటీస్ ను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ సూచించింది. అంతేగాక నియోజకవర్గాల్లోని టీమ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులను నివేదిక రూపంలో గాంధీభవన్ కు చేరవేయాలని కోరారు. సమన్వయం లో ఎలాంటి లోపాలు రాకూడదని, పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని పవర్ లో ఉంచేందుకు నేతలంతా సమన్వయంతో సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ నొక్కి చెప్పింది.
Also read: ఆశించిన ఫలితం రాలేదని కవిత కొత్త పార్టీ ప్రకటన: నవీన్ చారి!
సుదీర్ఘ విరామం తర్వాత ప్రతిపక్ష నేత జనం మధ్యకు రావడం అధికార పక్షంలో కాస్త అలర్ట్ ను తీసుకువచ్చింది. ఇక నుంచి నిత్యం ప్రభుత్వ తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రతిపక్ష పార్టీ నేతతో పాటు ఆ పార్టీ లీడర్లు బహిరంగంగానే ప్రకటించారు. కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విమర్శనాస్త్రాలతో ప్రభుత్వంపై దాడిని మొదలు పెట్టారు. అంతేగాక ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు బీఆర్ఎస్ కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రిపరేషన్ లో ఉన్నట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ చేసే విమర్శలకు ప్రజల్లో తాము సన్నగిల్లకుండా ఉండాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ మేరకు ప్రతిపక్షం ఇచ్చే పిలుపులు ప్రజల్లోకి బలంగా వెళ్లకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ తన యంత్రాంగాన్ని సిద్ధం చేసింది.ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఇన్-ఛార్జ్ లు నిరంతరం ప్రజల మధ్యే ఉండాలని, అంతేగాక ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పార్టీ ఆదేశాలిచ్చింది. అంతేగాక ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు కౌంటర్ గా వాస్తవాలను గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచాలని పార్టీ సూచించింది.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో అలసత్వం ప్రదర్శించవద్దని పార్టీ నొక్కి చెప్పింది. అంతేగాక సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఉంటే వెంటనే సరిదిద్ది, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వకూడదని కోరింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉన్నట్లు పార్టీ గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ దిశగా పార్టీ సోషల్ మీడియా వింగ్స్ పనిచేయడం లేదని పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో పాటు డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే, చేసిన మంచిని పదింతలు ఎక్కువగా ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో పాటు గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రభుత్వం చేసిన, చేయబోయే ప్రోగ్రామ్స్, పథకాలు అమలు, అభివృద్ధి పనులను జనాల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కోరింది. మరోవైపు త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా స్థానిక కేడర్ ముందస్తుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పార్టీ కోరింది.
Also read: వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?