సరిగ్గా రెండున్నరేండ్ల కింద. మీకు గుర్తుందా? బీఆరెస్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే.. డిసెంబర్ 28, 2023… నుంచి ప్రజా పాలన దరఖాస్తులు చేసుకోమన్నారు. ఓ పది రోజులు గడువు కూడా ఇచ్చారు. అంటే జనవరిఇ 6, 2024 వరకు అన్నమాట. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన ఓ ఐదు పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవడం కోసం పెట్టిన ఈ డ్రైవ్‌ను ప్రజాపాలన దరఖాస్తులు అని పేరు పెట్టారు.
మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత.. ఇలా ఐదు పథకాల కోసం ఒకే దరఖాస్తు ఫారమ్ నింపాలి. దీని కోసం తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ, ఆధార్ కార్డు తప్పనిసరి. దీనికి తోడు దరఖాస్తు ఫారం కావాలి. ఇక చూడు జనాల టెన్షన్.. జిరాక్స్ సెంటర్లకు పరుగులే పరుగులు. దరఖాస్తు ఫారాలైతే దొరకనే లేదు. బ్లాక్‌లో కొన్నారు.
జిరాక్స్ సెంటర్ల వద్ద బారులు తీరి కనిపించారు జనం ఎక్కడ చూసినా. కొన్ని కొత్తగా టపా టపా వెలిశాయి జిరాక్స్ సెంటర్లు ఈ డిమాండ్‌ను చూసి. అబ్బ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది.. మాకు పండగ తెచ్చిందని ఆ సెంటర్ల నిర్వాహకులు ఎగిరి గంతేశారు. ఈ ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ వారికి భారీ ఆదాయాన్ని సమకూర్చి పెట్టింది.
ఈ దరఖాస్త ఫారాలు తీసుకున్నా.. వాటిని ప్రజా పాలన అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కించారని అంటున్నా.. ఆ లెక్కలు ఇప్పుడు ఎంత వెతికినా దొరకవు. మహాలక్ష్మీ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలు ఉండవు.. చేయూత పథకం ద్వారా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న గణంకాలు కూడా యంత్రాంగం వద్ద లేవు. అదంతా ఒక ప్రక్రియగా సాగిపోయిందంతే.
కొత్త ప్రభుత్వం, కోటి ఆశలు.. కోట్లలో దరఖాస్తులు.. కోట్లాది రూపాయలు ఆర్జించిన జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు… దరఖాస్తులను బ్లాకు చేసి జేబు నింపుకున్న నాయకులు. ఇది రెండున్నరేండ్ల ముచ్చట. దీని కథ ఇంకా పెద్దగనే ఉంది. కానీ ఇప్పుడు మనం అందులోకి పోదలుచుకోలేదు. ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే… సేమ్ టు సేమ్ అట్లనే ఇప్పుడు ఫోటో స్టూడియోలకు జనం పరుగులు తీస్తున్నారు. ఎందుకో తెలుసా?
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోల కోసం. అవును.. వారి వద్ద ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఫోటోలు ఉన్నా సరే, బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ కలర్ పరదా ..(కలర్) ఉండాలంట. సర్, దరఖాస్తులకు అంటించేందుకు ఓ రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోగ్రాపులు కావాలి. కానీ అవి ఏవి పడితే అవి పెడతామంటే చెల్లదట. వెనుక వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటోలే ఉండాలంట. ఇక ఎగబడ్డారు జనం స్టూడియోల దగ్గరకు.
మొన్నటి దాకా ఈగలు కొట్టుకున్న నిర్వాహకులు.. మోడీ పుణ్యమా అని.. అదే సర్ పుణ్యమా అని చాలా బిజీగా అయ్యారట. నాలుగు రాళ్లు వెనకేసుకునేడేమో గానీ, కిరాయిలు కట్టి, అప్పులు తీర్చుకునేందుకు మాత్రం ఉపయోగపడుతున్నాయట. పార్టీలకతీతంగా ఈ ఫోటోల నిబంధనకు మాత్రం మోడీకి రుణపడి ఉంటామంటున్నారు ఫోటో స్టూడియో నిర్వాహకులు.
ఏం చేస్తాం మరి..? ప్రభుత్వాలేవైనా.. ఇలా జనాన్ని ఠారెత్తించి, అయోమయానికి గురి చేసి, గందరగోళం సృష్టించి, జేబులకు చిల్లు పెట్టి.. అప్పుల ఊబిలో ముంచుతూనే.. ఆశల పల్లకిలో ఊరేగిస్తూనే.. కాలం వెళ్లదీస్తూనే ఉంటారు. జనానికి కూడా ఇదే అలవాటై ఇలా ఉరుకులు, పరుగులు తీస్తూ ఉంటారు. జీవితాంతం!