కలలు కనండి.. నిజం చేసుకోండన్నారు. కానీ ఇక్కడ నిజమవుతాయో తేలీదు కానీ.. కలలు కంటున్నాడు కేటీఆర్. అవి కూడా పగటి కలలు. తాము అధికారంలోకి వచ్చేసినట్టు. కేసీఆర్ సీఎం అయినట్టు..! ఇంకా తన టీమ్‌కు మంత్రి పదవులు అన్నీ పంచేసినట్టు.. ! ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమర్‌కు హోం మంత్రిని చేస్తామని మాటిచ్చాడట.. కేసీఆర్, కేటీఆర్! అటు కేటీఆర్..గతంలో మాదిరిగా తాను షాడో సీఎంగా తెలంగాణను ఏలినట్టు.. ఇటు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ హోం మంత్రి అయినట్టు… ఎవరికి వారే ఊహాలోకంలో విహరిస్తున్నారు.
నిన్న వికరాబాద్‌లో మళ్లీ కేటీఆర్ ఇవే ఊహాగానాల నేపథ్యంలో అధికారం దక్కించుకున్న పగటికలల ప్రస్థానంలో ఓ మాటన్నాడు. పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. గతంలో కూడా ఇలాంటి వార్నింగులు చాలానే ఇచ్చి ఉన్నాడు. పోలీసులకే కాదు.. ఐఏఎస్ అధికారులను బెదిరించాడు. ఇప్పుడు చెప్పుకునేది పోలీసుల గురించి, ఆర్. ఎస్. ప్రవీణ్‌కుమార్ పాత్ర గురించి.
ఏమన్నాడో తెలుసా? ఏయ్.. పోలీస్.. మేం అధికారంలోకి రాగానే మీ తాటా తీస్తాం.. నేను, ఆరెస్ ప్రవీణ్‌కుమార్ ఇద్దరం కలిసి మీ సంగతి చూస్తామన్నాడు. అంటే దీని అర్థమేమిటి? కేటీఆర్ షాడో సీఎం అన్నమాట. పేరుకు కేసీఆర్ అలా సీఎంగా ఉండిపోతాడు. లేకపోతే అధికారం వచ్చీ రాగానే గతంలో చేసిన పొరపాటు చేయకుండా వెంటనే కేటీఆర్‌ను సీఎం చేస్తాడన్నమాటకేసీఆర్. ఇక తన కేబినెట్‌లో హోం మినిష్టర్‌గా ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఉంటాడన్నమాట.
తాను ఇలా ఆర్డర్ వేయగానే హోం శాఖ కదిలి.. ఈ పోలీసు వ్యవస్థలో తమకు ప్రతికూలంగా వ్యవహరించిన వారిని, తమపై కేసులు పెట్టిన వారిని వదలకుండా లోపలేసి టార్చర్ పెడతారన్నమాట. ఒకవేళ వాళ్లు భయపడి పారిపోయినా వదలరంటండోయ్! వెతికి, వెతికి, దొరబట్టి, గుంజుకొచ్చి మరీ బొక్కలేస్తారట. ఇదీ కేటీఆర్ వార్నింగ్.
ఇప్పుడు ఆయన మాటల్లో హోంమంత్రి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కాబోతున్నాడని పదే పదే ప్రొజెక్టు చేస్తున్నాడు. ఎలాగూ తామే అధికారంలోకి వస్తామని అందరికీ తెలిసిపోయింది. యువరాజుగా తానే సీఎంగా ఉండబోతున్నానని కూడా జనాలు కనెక్టయిపోయారు. ఇక మంత్రుల శాఖలే పంచాలె. అందులో తొలిగా ఆర్. ఎస్. ప్రవీణ్‌కుమార్‌కు హోం శాఖ పంచేశాడు.
తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది.. అన్నట్టుగా రెండున్నరేండ్లు ఉన్నా గానీ.. ఇప్పట్నుంచే కలలు కంటున్నాడు కేటీఆర్. చేయాల్సింది చాలా ఉంది. కానీ.. ఇప్పట్నుంచే ఆ పగటి కలలు కనడం ఎందుకు? అని ఆ పార్టీ నేతలే కేటీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినా.. కేటీఆర్ మాత్రం తన పగటి కలలను కనడం ఆపడం లేదు. ఆ కలలు నిజం చేసుకునేందుకు మత్రం ఏం చేయడం లేదు. సోషల్ మీడియాలో ఫైట్ తప్ప.