అంతా ఎన్టీఆర్ విగ్రహం చుట్టే రాజకీయాలకు తిరుగుతున్నాయి. దీనికి ఆద్యుడిగా నిలిచాడు సీఎం రేవంత్ రెడ్డి. తగుదునమ్మా అని తనే స్వయంగా ఆ విగ్రహ ఏర్పాటుకు హాజరుకావడం.. పెద్ద పెద్ద లెక్చర్లివ్వడం కూడా కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఎంతగా ఇందిరమ్మను ఈ ఇష్యూలోకి తీసుకొచ్చి పొగిడే ప్రయత్నం చేసినా..ఎన్టీఆర్ ముందు ఆమెను తక్కువ చేసి చూపారని కొందరు.. అసలు ఇందిరమ్మనే తిట్టిపోసిన ఎన్టీఆర్ నేపథ్యం.. ఇప్పుడు చెప్పే రేవంత్ కొత్త భాష్యం…రాజకీయ అవసరాలకోసం చరిత్రను వక్రీకరించడమే కదా! అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను సోషల్ మీడియాలో బలంగా తీసుకొచ్చారు కొందరు. దీంతో మొన్న రేవంత్ రెడ్డి కూడా ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీవీ నర్సింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించినా..అది కానిపని అని అంతా దాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడున్నవివాద వేడిని తగ్గించే ప్రయత్నమే తప్ప.. సీఎం మాటలు వాస్తవదూరమేనని అందరికీ తెలిసిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా కవిత ఓ కొత్త నినాదం, డిమాండ్‌తో బయటకు వచ్చారు.
ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలోనే ఆమె తన రాజకీయ వ్యూహంలో భాగంగా.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ప్రస్తావన అంశం ఎక్కడా తీసుకురాకుండానే.. తెలంగాణ వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన, డిమాండ్ సాదాసీదాగా లేదు. దీనికో డెడ్‌లైన్ కూడా విధించారామె. ఆగస్టు 6న జయశంకర్ జయంతి సందర్భంగా.. ఆలోపు దీన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిందేననే కచ్చితమైన డిమాండ్‌ను ఆ లేఖలో పొందుపరిచారు.
ట్యాంక్‌బండ్ పై ఆ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలి..? ఆ ప్రాంతం.. ఆ జాగా.. దాని నిర్మాణం ఎలా ఉండాలి.. కచ్చితమైన ఇంజీనిరింగ్ డ్రాఫ్ట్ తో సహా అన్నీ క్రోడీకరించి.. పక్కా ప్రణాళికతో… ఆమె సర్కార్ ముందు ఈ ప్రతిపాదనను ఉంచారు. ఇదీ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. వాస్తవానికి, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో.. ఏ పార్టీ కూడా ఏం చప్పుడు చేయడం లేదు. కారణం.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలే కావొచ్చు..భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే కావొచ్చు.. ఇక్కడి సెటిలర్ల ఓట్లు అన్ని పార్టీలకు అవసరమే. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం.. విగ్రహ ఏర్పాటు సభలో ఉద్దేశ్య పూర్వకంగానే కేసీఆర్, కేటీఆర్ ప్రస్తావన తెచ్చాడు.
వీరిద్దరిని కలిపి చెడామడా తిట్టి.. ఎన్టీఆర్ లేనిదే.. మీకు రాజకీయం ఎక్కడి.. మీరు నాయకులెలా అయ్యారనే రేంజ్‌లో తిట్టిపోశారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగా అప్పటిదాకా బీఆరెస్ పక్షానే ఉన్న సెటిలర్లను తమ పార్టీ వైపునకు తిప్పుకునే ఓ ప్లానింగ్‌లో భాగమేనని చెప్పుకోవాలి. కానీ తెలివిగా ఇప్పుడు కవిత వేసిన విగ్రహ రాజకీయ వ్యూహంలో .. రెండు పార్టీలు చిక్కుకున్నాయి. బీఆరెస్ తన పదేళ్ల పాలనలో జయశంకర్ విగ్రహ ఏర్పాటు విషయాన్ని విస్మరించింది. ఆ విషయాన్ని ఆమె ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు కూడా. ఆ పదేళ్ల పాలనలో తను చాలాసార్లు జయశంకర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేసినా.. కేసీఆర్ పట్టించుకోలేదనే విషయాన్ని ఆమె గుర్తు చేయడం వల్ల.. తను అప్పట్నుంచి ఈ విషయంలో ఓ క్లారిటీతో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పుకొచ్చారు.
అంటే ఇప్పుడు బీఆరెస్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని సర్కార్ ముందు ఉంచే నైతికతను కోల్పోయిందనే విషయాన్ని కూడా ఆమె పరోక్షంగా ఇక్కడ జనానికి గుర్తు చేసినట్టయ్యిందన్నమాట. మరోవైపు రేవంత్ సర్కార్ ముందు.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు బాగానే ఉంది.. మరి మా తెలంగాణ జాతిపితగా కీర్తిస్తున్న, తెలంగాణ వైతాళికుడి విగ్రహం ఎక్కడ? ఇప్పుడు మేం సూచించిన జాగాలో ఏర్పాటు చేస్తారా? చెయ్యరా? అని ఒత్తిడి తేవడంతో పాటు ఆగస్టు6తో అల్టిమేటం జారీ చేయడమే కాదు.. ఇలా చేయకపోతే ఉద్యమకార్యచరణకు సైతం సిద్దపడతామనే సంకేతం ఇవ్వడంతో ఇప్పుడు ఇది కొత్త రాజకీయ రూపు తీసుకున్నది. ఈ విగ్రహ వివాదం ముదిరి పాకాన పడేలా కనిపిస్తున్నది.